భూగోళంపై ఆకలి కేకలు

People Getting More Hungry Globally Due To Environmental Changes - Sakshi

తీవ్ర వాతావరణ మార్పుల కారణంగా పెరుగుతోన్న ఆకలి

కరువు, వరదలే ప్రధానకారణం – హెచ్చరిస్తోన్న ఐక్యరాజ్యసమితి.

వాతావరణంలో ఏర్పడిన తీవ్రమైన మార్పులతో ప్రపంచ ప్రజల ఆకలి అనూహ్యంగా పెరిగిపోతోంది. ఆహార కొరత కొద్దిగా తగ్గుముఖం పడుతుందనుకుంటున్న తరుణంలో ప్రస్తుతం జనాభాలో ప్రతి ఎనిమిదిమందిలో ఒకరు ఆకలితో అలమటిస్తున్నట్టు ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది. తీవ్రమైన వాతావరణ మార్పులే ఇందుకు ప్రధాన కారణమని కూడా స్పష్టం చేసింది. ఐక్యరాజ్యసమితి తాజాగా విడుదల చేసిన 2018 పౌష్టికాహారం, ఆహారభద్రతా రిపోర్టు ప్రస్తుత వాతావరణ పరిస్థితులపై హెచ్చరికలు జారీచేసింది.

2015 నుంచి గత మూడేళ్ళుగా వరసగా ప్రపంచ ప్రజలు ఆకలితీవ్రత ఎక్కువగా ఎదుర్కోవాల్సి వస్తోందని అధ్యయనం తేల్చిచెప్పింది. గత ఒక్క యేడాదిలోనే ప్రపంచవ్యాప్తంగా 8.21 కోట్ల మంది ప్రజలు తీవ్రమైన ఆహార కొరతను ఎదుర్కొన్నారు. ప్రధానంగా ఆఫ్రికా, దక్షిణ అమెరికాలు తీవ్రమైన ఆహార కొరతతోనూ, పౌష్టికాహారలోపాన్నీ ఎదుర్కొంటున్నాయి.  ఆసియాలో 50 కోట్ల మంది ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. ఓ వైపు కరువు కాటకాలు తాండవిస్తోంటే, మరోవైపు నదులు, సముద్రాలు పొంగిపొర్లి వరదలు ముంచెత్తుతున్నట్టు ఐక్యరాజ్యసమితి గుర్తించింది. ఈ రెండు భిన్నమైన పరిస్థితులే 2017లో ఆర్థిక కుంగుబాటుకీ, ఆకలికీ కారణమౌతున్నాయని గుర్తించింది. దీంతో దాదాపు కోటి మంది ప్రజలు ఆకలి నుంచి విముక్తికోసం అర్థిస్తున్నట్టు వెల్లడయ్యింది.  

ప్రపంచవ్యాప్తంగా నమోదౌతోన్న అధిక ఉష్టోగ్రతలు చివరకు ఆకలి ప్రపంచాన్ని సృష్టించాయని  ఆక్స్‌ఫామ్‌ జిబిలో ఆహారమూ, వాతావరణ విధానాల శాఖాధిపతి రాబిన్‌ వ్యాఖ్యానించారు. గతంలో ఎప్పుడూ లేనట్టుగా 2018లో సైతం తీవ్రమైన వాతావరణ సంక్షోభాన్ని చూసామన్నారు. గత కొద్ది నెలలుగా పరిస్థితి మరింత భయానకంగా తయారైందన్నారు. ఐక్యరాజ్య సమితి రిపోర్టు ప్రకారం ప్రపంచంలో తీవ్రమైన వాతావరణ సంక్షోభం ఉన్నప్రాంతాల్లోనే ఎక్కువ మంది ప్రజలు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు. వర్షపాతంలో మార్పుల వల్ల గత ఐదేళ్ళలో తీవ్రమైన ఉష్ణోగ్రతలు నమోదయ్యాయనీ, దీనివల్ల గోధుమ, వరి లాంటి కీలక పంటలు దెబ్బతింటున్నాయనీ రిపోర్టు వెల్లడించింది. కరువు కాటకాలను తట్టుకునేందుకు తక్కువ నీళ్ళు అవసరమైన పంటలను వేయడం వర్షపాతానికి అనుగుణంగా పంటమార్పిడీ పద్ధతులను అవలంభించక తప్పని పరిస్థితి రైతులకు ఎదురయ్యింది.  

యూనిసెఫ్, వ్యవసాయాభివృద్ధి సహాయక సంస్థ, ప్రపంచ ఆహార కార్యక్రమం, ప్రపంచ ఆరోగ్యసంస్థ సంయుక్తంగా నిర్వహించిన ప్రపంచ వ్యాప్తంగా ఆహార భద్రత, పౌష్టికాహారం 2018  నివేదికని ఐక్యరాజ్యసమితి తాజాగా  విడుదల చేసింది. ఐక్యరాజ్యసమితి సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో భాగంగా 2030 నాటికి ఆకలినీ, పౌష్టికాహారలోపాన్నీ జయించాలన్న లక్ష్యాన్ని చేరుకోవాలంటే తక్షణమే తీవ్ర వాతావరణ మార్పులపై స్పందించాలని ఈ రిపోర్టు ముందు మాటలో పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా 6.72 కోట్ల మంది ప్రజలు అధిక బరువుతో బాధపడుతున్నారు. ప్రతి ఎనిమిది మందిలో ఒకరు స్తూలకాయంతో అవస్త పడుతున్నవారే. పౌష్టికాహారలోపమే దీనికి కారణం. ప్రపంచవ్యాప్తంగా 1.51 కోట్ల మంది ఐదేళ్ళలోపు పిల్లలు ఎదుగుదల లోపంతో బాధపడుతున్నారు.

ఐదేళ్ళలోపు పిల్లలు ఉండాల్సిన ఎత్తుకంటే చాలా పొట్టిగా ఉండడానికి సైతం పౌష్టికాహారలోపమే కారణం. అయితే 2012లో ప్రపంచవ్యాప్తంగా 1.65 కోట్ల మంది చిన్నారులు ఎదుగుదలా లోపంతో ఉన్నారు. 2012 కంటే ఇప్పుడు కొంత మెరుగైనా మొత్తం ఆసియాలోనే 55 శాతం మంది ఐదేళ్లలోపు చిన్నారులను ఎదుగుదల లోపం బాధపెడుతోంది. ప్రతి ముగ్గురు గర్భిణీల్లో ఒకరు రక్తహీనతతో అనారోగ్యంపాలవుతున్నారు. ఇది వారి పిల్లల ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతోంది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 40 శాతం పిల్లలకే ఆరునెలల పాటు తప్పనిసరిగా యివ్వాల్సిన తల్లిపాలు లభ్యం అవుతున్నట్టు ఈ నివేదిక తేల్చింది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top