నన్ను కాపాడటానికి వచ్చావా...!!

Parrot Scolds Firefighter Trying To Rescue Her - Sakshi

చిన్న పిల్లల ముద్దు ముద్దు మాటలు వింటే చిలుకలా ఎంత మధురంగా మాట్లాడుతున్నారో అంటూ మురిసిపోతాం. వారి మాటల్ని చిలుక పలుకులతో పోలుస్తాం. కానీ జెస్సీ మాటలు వింటే మాత్రం ఇంకెప్పుడూ అలా పోల్చడానికి సాహసించరు. ఇంతకీ జెస్సీ ఎవరో చెప్పలేదు కదూ.. లండన్‌కు చెందిన ఓ వ్యాపారి పెంపుడు చిలుకే ఈ జెస్సీ. పంజరంలో బంధీగా ఉండటం జెస్సీకి ఏమాత్రం నచ్చలేదు. అందుకే ఆహారం తినిపించే సమయంలో ఒక్కసారిగా తుర్రుమని ఎగిరిపోయింది. పక్కింటి పైకి ఎక్కి మూడు రోజులుగా అక్కడే బస చేస్తోంది. 

అయితే ఎంతో ప్రేమగా పెంచుకున్న జెస్సీ తిండీ తిప్పలు లేకుండా ఉండటం చూడలేక.. జంతు సంరక్షణ సిబ్బంది, ఫైర్‌ బ్రిగేడ్‌కు ఫోన్‌ చేశాడు జెస్సీ యజమాని. వెంటనే అక్కడికి చేరుకున్న ఫైర్‌ బ్రిగేడ్‌ సిబ్బంది ఒకరు.. ఓ గిన్నెలో జెస్సీ కోసం ఆహారం తీసుకెళ్లి ప్రేమగా తినిపించబోయాడు. యజమానిలాగే ‘ఐ లవ్‌ యూ జెస్సీ’ అంటూ మచ్చిక చేసుకునే ప్రయత్నం చేయడంతో... చిర్రెత్తుకొచ్చిన జెస్సీ అతడిని బూతులు తిట్టడం మొదలుపెట్టింది. జెస్సీ నుంచి అలాంటి మాటలు రావడంతో షాక్‌ తినడం అతని వంతైంది. ఈ విషయం గురించి జెస్సీ వాళ్ల యజమాని మాట్లాడుతూ.. తానెప్పుడూ అలాంటి మాటలు నేర్పించేలేదని, జెస్సీ తరపున తాను క్షమాపణలు చెబుతున్నానని వివరణ ఇచ్చుకున్నాడు. కాసేపటి తర్వాత కిందకి దిగొచ్చిన జెస్సీ... ఫైర్‌ బ్రిగేడ్‌కు సారీ చెప్పడంతో పాటు.. తనను కాపాడటానికి వచ్చినందుకు థ్యాంక్యూ కూడా చెప్పి.. అతడి కోపాన్ని పోగొట్టేసింది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top