మోదీని పాములతో బెదిరించిన పాక్‌ మహిళపై కేసు

Pakistani Pop Star Faces 2 Years in Jail After Threatening Modi with Snakes - Sakshi

లాహోర్‌: భారత ప్రధాని నరేంద్ర మోదీపైకి తన పాములను పంపించి వాటికి విందు చేస్తానని పాకిస్తాన్‌కు చెందిన ప్రముఖ సింగర్‌ ఎగతాళి చేస్తూ చేసిన వీడియో ఆమెను చిక్కుల్లో పడేసింది. పాక్‌ పాప్‌ సింగర్‌ రబీ పిర్జాదా సెప్టెంబర్‌ 2న మోదీని దుమ్మెత్తిపోస్తూ ఓ వీడియో చేసింది. కశ్మీరీలను హింసిస్తున్న మోదీకి తన స్నేహితులైన పాములు, మొసళ్లు తగిన గుణపాఠం చేప్తాయంటూ చేసిన ఆ వీడియో భారత్‌, పాక్‌ దేశాల్లో వైరల్ అయింది. తన వద్ద ఉన్న నాలుగు అనకొండలను, ఒక మొసలిని మోదీకి గిఫ్ట్‌గా పంపిస్తానని, ‘కశ్మీరీ ప్రజలను ఇబ్బంది పెడుతున్న మోదీ..  నరకంలో చావడానికి సిద్ధంగా ఉండు. నా స్నేహితులు నిన్ను విందు చేసుకుంటాయని ఆమె పదేపదే వ్యాఖ్యానించారు. ఆ వీడియోపై భారత నెటిజన్లు కామెంట్ల రూపంలో ‘తగిన’ కౌంటర్‌ కూడా ఇచ్చారు.

కాగా, వీడియోలో అరుదైన జాతులకు చెందిన పాములను చూపించటమే ఆమె ప్రస్తుత తిప్పలకు కారణం. అరుదైన వన్యప్రాణులతో వీడియో చేసినందుకు, వాటిని పెంపుడు జంతువుల వలె ఇంట్లో పెట్టుకున్నందుకు పిర్జాదాపై పంజాబ్‌లోని పాక్ వ్యనప్రాణి సంరక్షణ సంస్థ ఆగ్రహం వ్యక్తం చేస్తూ దర్యాప్తుకు ఆదేశించింది. పిర్జాదాపై నేరం రుజువైతే ఆమెకు రెండేళ్ల వరకూ జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ‘పాక్ వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం ఇటువంటి ఆరుదైన జంతువులను ఇంట్లో పెట్టుకోవడం నేరం. వాటిని పెంపుడు జంతువులుగా చూసేందుకు చట్టం అంగీకరించదని’ ఓ పాక్‌ అధికారి వెల్లడించారు. వన్యప్రాణులను తన బ్యూటీ సెలూన్‌లో బంధించినందుకు ఆమెపై కేసు నమోదు చేశామన్నారు. 

తనపై కేసు నమోదు కావడంతో పిర్జాదా స్పందించారు. మోదీపై వ్యాఖ్యల కారణంగానే తనపై కక్ష కట్టారని, తనపై కేసుకు కారణం వన్యప్రాణులు కాదని ఆమె ఆరోపించారు. 'అనుమతి లేకుండా వన్యాప్రాణులను ఇంట్లో ఎలా పెంచుకున్నావంటూ కొందరు నన్ను ప్రశ్నిస్తున్నారు. మరి మోదీపై విమర్శలకు ముందు నాపై ఇటువంటి ఆరోపణలు ఎందుకు రాలేదు. అప్పుడు కూడా మా ఇంట్లో పాములు ఉన్నాయ్‌ కదా? అని​ ప్రశ్నించారు. నాపై ఎందుకు దర్యాప్తు ప్రారంభమైందో మీకు ఇంకా అర్ధం కావట్లేదా?' అంటూ ట్వీట్ చేశారు.

కాగా, రబీ పిర్జాదా పాక్ ఆక్రమిత కశ్మీర్‌కు చెందిన ఓ ఆర్మీ అధికారి కూతురు. కశ్మీర్ స్వయం ప్రతిపత్తిని భారత ప్రభుత్వం రద్దు చేయడంతో ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అప్పటి నుంచి ఆమె భారత వ్యతిరేక ఆందోళనలలో చురుకుగా పాల్గొంటోంది. ఇటీవలే కశ్మీరీలకు మద్దతుగా ‘సేవ్ కశ్మీర్’ అంటూ ఓ ర్యాలీని కూడా నిర్వహించింది. తాజాగా తన వ్యతిరేకత శృతిమించడంతో కటకటాల పాలవుతోంది. (చదవండి : మోదీ అమెరికా సభకు అనుకోని అతిథి!)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top