చైనా విషయంలో అదంతా రూమరే! : పాక్‌

Pakistan Reacted on China Halt CPEC Fundings - Sakshi

ఇస్లామాబాద్‌ : చైనా-పాకిస్థాన్‌ ఎకనామిక్‌ కారిడార్‌ ప్రాజెక్టులకు సంబంధించి గత కొన్నిరోజులుగా ఓ వార్త చక్కర్లు కొడుతోంది. డ్రాగన్‌ కంట్రీ నుంచి నిధుల నిలిపివేత కారణంగా పాక్‌ పనులను ముందుకు సాగించలేకపోతుందన్నది దాని సారాంశం. ఈ నేపథ్యంలో పాక్‌ స్పందించింది. 

చైనా నిధులు నిలిపివేసిందన్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని అధికార ప్రతినిధి మహ్మద్‌ ఫైజల్‌ గురువారం వెల్లడించారు. ఈ మేరకు బీజింగ్‌ నుంచి తమకు ఎలాంటి సమాచారం కూడా అందలేదన్నారు. మూడు ప్రాజెక్టులకు సంబంధించి సమీక్ష చేపట్టిన తర్వాత ఆర్థిక సాయం అందించటం ఆపేపిందని ఓ పుకారు చెలరేగింది. అలాంటిదేం జరగలేదు.. మిత్రపక్షం(చైనా) ఏనాడూ అలా చేయబోదు అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కానీ, తాత్కాలికంగా పనులు నిలిపివేసిన మాట వాస్తవమేనని.. చైనా నుంచి అనుమతులు రాగానే వాటి పనులు తిరిగి ప్రారంభిస్తామని చెప్పకొచ్చారు. అయితే దాని వెనుక ఉన్న కారణాలను మాత్రం వివరించలేదు.

సాంకేతిక సమస్యల కారణంగానే రోడ్‌ నెట్‌ వర్క్‌కు సంబంధించిన ఈ మూడు ప్రాజెక్టులను ఆపేశారని ఇంతకు ముందు పాక్‌ మీడియా సంస్థ డాన్ ప్రచురించిన విషయం తెలిసిందే. త్వరలో చైనా నిపుణులు ఆయా ప్రాజెక్టు ప్రాంతాలను పరిశీలించి క్లియరెన్స్‌ ఇస్తారని పాక్‌ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top