ఆ విమానాల్ని కూల్చింది మా ఎఫ్‌16లే

Pakistan indicates F-16s might have been used to hit Indian aircraft - Sakshi

భారతవిమానాల కూల్చివేతపై తొలిసారి ఒప్పుకున్న పాక్‌

ఇస్లామాబాద్‌: బాలాకోట్‌పై ఐఏఎఫ్‌ దాడి అనంతరం ఎఫ్‌–16 విమానాలను వినియోగించలేదని ఇప్పటిదాకా బుకాయించిన పాకిస్తాన్‌.. తాజాగా మాట మార్చింది. తమ ఎఫ్‌–16 యుద్ధ విమానాలే భారత్‌ విమానాలను కూల్చేశాయని మొదటిసారిగా అంగీకరించింది. పాక్‌ సైన్యం అధికార ప్రతినిధి మేజర్‌ జనరల్‌ ఆసిఫ్‌ గఫూర్‌ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ‘ఫిబ్రవరి 27వ తేదీన నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్‌ వైమానిక దళం(పీఏఎఫ్‌) పాక్‌ గగనతలం నుంచే దాడులకు దిగింది. ఆ సమయంలో మా భూభాగంలోకి ప్రవేశించిన రెండు ఐఏఎఫ్‌ విమానాలను పీఏఎఫ్‌ కూల్చివేసింది. మేం మోహరించిన విమానాల్లో ఎఫ్‌–16లు కూడా ఉన్నాయి.

ఆత్మరక్షణ కోసం ఏ విధంగానైనా స్పందించే హక్కు మాకుంది’ అని ఆయన ప్రకటించారు. ‘ఆ ఘటన గత చరిత్ర. మా వద్ద ఉన్న ఎఫ్‌–16 విమానాలను మాత్రం ఐఏఎఫ్‌ కూల్చలేదు’ అని కూడా ఆయన తెలిపారు. కానీ, గత నెలలో జేఎఫ్‌–17 రకం విమానాన్ని మాత్రమే వాడినట్లు గఫూరే ప్రకటించారు. బాలాకోట్‌లోని ఉగ్ర శిబిరాలపై ఐఏఎఫ్‌ దాడికి ప్రతీకారంగా పాక్‌ వైమానిక దళం కూడా దాడికి యత్నించిన విషయం తెలిసిందే. కానీ, ఈ సందర్భంగా అమెరికా తయారీ ఎఫ్‌–16ను ఐఏఎఫ్‌ కూల్చివేయడం కలకలం రేపింది. ఈ విమానాలను మూడో దేశంపై ఉపయోగించరాదని విక్రయ ఒప్పందంలో అమెరికా పేర్కొంది. కానీ, ఈ షరతులను పాక్‌ ఉల్లంఘించిందంటూ భారత్‌ అమెరికాకు సాక్ష్యాధారాలు అందజేయడం తెల్సిందే.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top