నువ్వా ఇస్లాం గురించి మాట్లాడేది: పాక్‌ విద్యార్థులు

Pak Students Demand Apology Govt Officials Over Talking About Minority Rights - Sakshi

ఇస్లామాబాద్‌ : మానవ హక్కుల గురించి మాట్లాడిన ఓ మహిళా ప్రభుత్వాధికారి పట్ల పాకిస్తాన్‌ విద్యార్థులు దురుసుగా ప్రవర్తించారు. ఆమె కార్యాలయంలోకి చొచ్చుకువచ్చి క్షమాపణ చెప్పాలంటూ ఆమెను దౌర్జన్యానికి దిగారు. అనంతరం ఆమెతో క్షమాపణలు చెప్పించిన వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ఇది ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అసలేం జరిగిందంటే... డిసెంబరు 10న అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా అటాక్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ జన్నత్‌ హుస్సేన్‌ నెకోకరా జిల్లా పాలనావిభాగం కార్యాలయంలో ప్రసంగించారు. ‘ముస్లింమేతర పాకిస్తానీయులకు కూడా సమాన హక్కులు కల్పించాలి. మత పరమైన విభేదాలతో మన మధ్య విభజన రేఖలు ఏర్పరచుకున్నాం. షియా, సున్నీ, అహ్మదీ, వహాబీ అంటూ అంతరాలు సృష్టించుకున్నాం. మనమంతా ముస్లింలమే అని... అంతకుమించి పాకిస్తానీయులమని గుర్తించాల్సిన అవసరం ఉంది’ అని జన్నత్‌ వ్యాఖ్యానించారు.

కాగా జన్నత్‌ వ్యాఖ్యలను నిరసిస్తూ అటాక్‌ యూనివర్సిటీ విద్యార్థులు ఆమె కార్యాలయానికి చేరుకున్నారు. అహ్మదీలను ముస్లింలుగా పేర్కొన్నందుకు జన్నత్‌ క్షమాపణ చెప్పాల్సిందేనంటూ ఆందోళనకు దిగారు. అనంతరం లోపలికి చొచ్చుకెళ్లారు. ఈ క్రమంలో తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చేందుకు జన్నత్‌ ప్రయత్నించగా.. ‘ నీ కొడుకు కాఫిర్‌(తిరస్కరించబడినవాడు- ముస్లింమేతరుడు, నాస్తికుడు అన్న ఉద్దేశంతో). అతడు ముస్లిం కాదని ఒప్పుకో. అహ్మదీలను ముస్లింలు అన్నందుకు నువ్వు క్షమాపణ చెప్పి తీరాల్సిందే’ అంటూ ఆమె మాటలకు అడ్డుపెట్టారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 

ఇక విద్యార్థుల ప్రవర్తనతో తానే వెనక్కి తగ్గిన జన్నత్‌ చివరకు క్షమాపణ చెప్పారు. ‘ నేను ముస్లింమేతర పాకిస్తానీ, మైనార్టీల మానవ హక్కుల గురించి మాట్లాడాను. అసలు అహ్మది అనే పదం ఉపయోగించానో కూడా గుర్తులేదు. వివక్షకు తావు లేకుండా అందరికీ సమాన హక్కులు ఉండాలనే ఉద్దేశంతో అలా మాట్లాడాను. అంతర్గతంగా మనమందరం సంఘటితంగా ఉన్నపుడే బయటి శత్రువును ఎదుర్కోగలం అనేది నా ఉద్దేశం అని వివరణ ఇచ్చారు. ‘అవును పాకిస్తాన్‌ రాజ్యాంగం ప్రకారం అహ్మదీలు ముస్లింమేతరులు. నా దృష్టిలో కూడా సరేనా. మీరన్నట్లుగా నా కొడుకు ముస్లింమేతరుడే. వాడో కాఫిర్‌’ అని ఉద్వేగానికి లోనయ్యారు.

కాగా జన్నత్‌ క్షమాపణలు చెప్పినప్పటికీ విద్యార్ధులు ఆమె వ్యక్తిత్వాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారు. ‘హిజాబ్‌ ధరించని ఓ మహిళ ఇస్లాం గురించి ప్రసంగాలు ఎలా చేస్తుంది. మహ్మద్‌ ప్రవక్తకు వ్యతిరేకింగా మాట్లాడినందుకు ఖలీఫా అబుబాకర్‌ తన సొంత తండ్రి తలనే నరికాడు. అలాంటి మతం గురించి తలపై ముసుగు లేకుండా తిరిగే ఈ మహిళ మాట్లాడుతోంది’ అంటూ ఆమెను హేళన చేశారు. కాగా అహ్మదీలు కూడా ఇతర ముస్లింల వలె మత సంప్రదాయాలన్నింటినీ పాటిస్తారు. అయితే మెసయ్యను తమ దేవుడిగా భావిస్తూ.. ఆయన మళ్లీ తమ మతాన్ని సంస్కరించేందుకు వస్తాడని విశ్వసిస్తారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top