ట్రంప్‌తో భేటీకానున్న ఇమ్రాన్‌ఖాన్‌ | Pak Pm Imran Khan Visit USA 22th July | Sakshi
Sakshi News home page

ట్రంప్‌తో భేటీకానున్న ఇమ్రాన్‌ఖాన్‌

Jul 5 2019 1:29 PM | Updated on Jul 5 2019 1:34 PM

Pak Pm Imran Khan Visit USA 22th July - Sakshi

సాక్షి, ఇంటర్నేషనల్‌ : పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ జులై నెలలో అమెరికాలో పర్యటించనున్నారు. అమెరికా ఆహ్వానం మేరకు ఇమ్రాన్‌ఖాన్‌ ఈ నెల 22న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో వాషింగ్టన్‌లో సమావేశం కానున్నారు. పాకిస్తాన్‌ విదేశాంగ అధికారులు ఈ విషయాన్ని ధృవీకరించారు. ఇమ్రాన్‌ పర్యటనతో ఇరుదేశాల మధ్య ఏర్పడిన ఉద్రిక్తతలు తగ్గుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. వీరి భేటీపై చైనా, భారత్‌తో సహా ప్రపంచ దేశాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. టెర్రరిజంపై పోరాడటానికి అధికారికంగా ఇరుదేశాలు ఒప్పందం చేసుకున్నా కానీ పాకిస్తాన్‌ తమ నమ్మకాన్ని వొమ్ముచేసిందని, అమెరికా నుంచి కోట్ల రూపాయల నిధులు తీసుకొని దుర్వినియోగం చేస్తోందని ట్రంప్‌ గత సంవత్సరం పాకిస్తాన్‌పై తీవ్రంగా విరుచుకపడిన విషయం తెలిసిందే.

ఆఫ్ఘనిస్తాన్‌ యుద్ధంలో కూడా ఇరుదేశాలకు బేధాభిప్రాయాలు ఉన్నాయి. తాలిబాన్‌లకు వ్యతిరేకంగా అమెరికా యుద్ధం చేస్తుంటే, పాకిస్తాన్‌ మాత్రం పరోక్షంగా తాలిబాన్‌లకు సహాయ సహకారాలు అందిస్తోందని అమెరికా నాయకులు తరచూ విమర్శిస్తున్నారు. దీంతో ఆమెరికా పాకిస్తాన్‌కు అందించే ఆర్థిక సహాయంలో కోత విధించింది. మరోపక్క అమెరికాతో భారత్‌కు పెరుగుతున్న సాన్నిహిత్యం పాకిస్తాన్‌ను ఆందోళనకు గురిచేస్తోంది. భారత్‌ అభ్యర్థన మేరకు మసూద్‌ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించడంలో అమెరికా తన సంపూర్ణ మద్దతు తెలిపింది. పాకిస్తాన్‌ కూడా అంతర్జాతీయంగా అమెరికాను చికాకు పెట్టెలా ప్రవర్తిస్తోంది. ఒకపక్క చైనా ఇబ్బడిముబ్బడిగా పాకిస్తాన్‌లో పెట్టుబడులు పెడుతూ, అంతర్జాతీయ వ్యవహారాలలో పాకిస్తాన్‌కు వంతపాడటం, మరోపక్క రష్యాతో పాకిస్తాన్‌ చేసుకుంటున్న సైనిక ఒ‍ప్పందాలు తదితర విషయాలపై ఈ సమావేశంలో ఒక స్పష్టత వస్తుందని అమెరికా భావిస్తోంది. అసలే ఆర్థిక సంక్షోభంలో కూరుకుని దినదిన గండంగా రోజువారిగా వ్యవహారాలు నడుపుతున్న పాకిస్తాన్‌కు ఈ పర్యటన ఎంతో కీలకం కానుందని విశ్లేషకులు అంటున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement