దావా నెగ్గిన ఇమ్రాన్‌ ఖాన్‌ మాజీ భార్య | Pak PM Imran Khan Ex-Wife Wins Defamation Case in UK Royal Court | Sakshi
Sakshi News home page

పరువు నష్టం దావా నెగ్గిన ఇమ్రాన్‌ ఖాన్‌ మాజీ భార్య

Nov 13 2019 11:37 AM | Updated on Nov 13 2019 11:48 AM

Pak PM Imran Khan Ex-Wife Wins Defamation Case in UK Royal Court - Sakshi

లండన్‌ : పాకిస్తాన్‌ ప్రధాని, పాకిస్తాన్‌ తెహ్రిక్‌ ఎ ఇన్సాఫ్‌ పార్టీ అధ్యక్షుడు ఇమ్రాన్‌ ఖాన్‌ మాజీ భార్య రెహం ఖాన్‌ పరువునష్టం దావా కేసు నెగ్గారు. కోర్టు ఆదేశాలతో నిరాధార ఆరోపణలపై సదరు వార్తా ప్రసార సంస్థ ఆమెకు బహిరంగ క్షమాపణలు చెప్పింది. వివరాలు.. ఇమ్రాన్‌ మాజీ భార్య, పాక్‌ సంతతి బ్రిటిష్‌ పౌరురాలు రెహమ్‌ ఖాన్‌ పాక్‌లో ఎన్నికల ముందు తన మాజీ భర్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇందులో కొన్ని వ్యక్తిగత, లైంగిక విషయాలు కూడా ఉన్నాయి. అంతేకాక, పూర్తి వివరాలతో తన ఆత్మకథను రాస్తానని ఆమె అప్పడు ప్రకటించారు. ఎన్నికల్లో కాబోయే ప్రధానిగా ఇమ్రాన్‌ పేరు మార్మోగుతున్న తరుణంలో రెహమ్‌ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఇమ్రాన్‌కు ఆమె వ్యాఖ్యలు ఇబ్బందికరంగా ఉండడంతో పార్టీలోని ఇతర నాయకులు ఆమెను టార్గెట్‌గా చేసి అనేక తీవ్ర విమర్శలు చేశారు.

రెహమ్‌ ఆత్మకథ రాసేందుకు ఇమ్రాన్‌ ప్రత్యర్థి పార్టీ అయిన పాకిస్తాన్‌ ముస్లిం లీగ్‌ పార్టీ నాయకుడు షెహబాజ్‌ షరీఫ్‌ వద్ద నుంచి డబ్బు తీసుకున్నారని ప్రధానంగా ఆరోపించారు. ఇమ్రాన్‌ను రాజకీయంగా దెబ్బ తీసేందుకు రెహమ్‌ను ఆయుధంగా వాడుకుంటున్నారని ఆరోపించారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఇమ్రాన్‌ పార్టీ నాయకుడు, ఇప్పటి పాకిస్తాన్‌ రైల్వే శాఖ మంత్రి షేక్‌ రషీద్‌ గతేడాది జూన్‌లో దునియా అనే టీవీ చానెల్‌లో నిర్వహించిన ఓ చర్చా కార్యక్రమంలో మాట్లాడుతూ.. పైన పేర్కొన్న వ్యాఖ్యలను పరుష పదజాలంతో మరోసారి చేశారు. ఉర్దూలో ప్రసారమయ్యే దునియా చానెల్‌ ఇంగ్లాండ్‌లో కూడా ప్రసారమవుతుంది. అయితే రషీద్‌ చేసిన ఆరోపణలను ఆ చానెల్‌ పదే పదే ప్రసారం చేసింది.

దీంతో మనస్తాపానికి గురైన రెహమ్‌ ఖాన్‌ నిరాధార ఆరోపణలతో తన పరువుకు భంగం కలిగించారంటూ లండన్‌లోని రాయల్‌ కోర్టులో కేసు వేసింది. ఈ కేసును విచారించిన న్యాయమూర్తి మాథ్యూ నిక్లిన్‌ రెహమ్‌ ఖాన్‌కు క్షమాపణలు చెప్పి కోర్టు ఖర్చులు చెల్లించాలని సదరు టీవీ చానెల్‌ను ఆదేశించారు. జడ్జి ఆదేశాల ప్రకారం దునియా టీవీ చానెల్‌ రెహమ్‌ ఖాన్‌కు బహిరంగ క్షమాపణలు చెబుతూ, కొంత నష్ట పరిహారంతో కోర్టు ఖర్చుల్ని భరిస్తామని ప్రకటించింది. అనంతరం రెహమ్‌ స్పందిస్తూ.. ఈ తీర్పు వల్ల నా వ్యక్తిత్వాన్ని కాపాడుకున్నానని, పాకిస్తాన్‌లో నైతిక జర్నలిజానికి ఈ తీర్పు దోహదపడుతుందని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement