breaking news
Royal court
-
దావా నెగ్గిన ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య
లండన్ : పాకిస్తాన్ ప్రధాని, పాకిస్తాన్ తెహ్రిక్ ఎ ఇన్సాఫ్ పార్టీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య రెహం ఖాన్ పరువునష్టం దావా కేసు నెగ్గారు. కోర్టు ఆదేశాలతో నిరాధార ఆరోపణలపై సదరు వార్తా ప్రసార సంస్థ ఆమెకు బహిరంగ క్షమాపణలు చెప్పింది. వివరాలు.. ఇమ్రాన్ మాజీ భార్య, పాక్ సంతతి బ్రిటిష్ పౌరురాలు రెహమ్ ఖాన్ పాక్‌లో ఎన్నికల ముందు తన మాజీ భర్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇందులో కొన్ని వ్యక్తిగత, లైంగిక విషయాలు కూడా ఉన్నాయి. అంతేకాక, పూర్తి వివరాలతో తన ఆత్మకథను రాస్తానని ఆమె అప్పడు ప్రకటించారు. ఎన్నికల్లో కాబోయే ప్రధానిగా ఇమ్రాన్ పేరు మార్మోగుతున్న తరుణంలో రెహమ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఇమ్రాన్‌కు ఆమె వ్యాఖ్యలు ఇబ్బందికరంగా ఉండడంతో పార్టీలోని ఇతర నాయకులు ఆమెను టార్గెట్‌గా చేసి అనేక తీవ్ర విమర్శలు చేశారు. రెహమ్ ఆత్మకథ రాసేందుకు ఇమ్రాన్ ప్రత్యర్థి పార్టీ అయిన పాకిస్తాన్ ముస్లిం లీగ్ పార్టీ నాయకుడు షెహబాజ్ షరీఫ్ వద్ద నుంచి డబ్బు తీసుకున్నారని ప్రధానంగా ఆరోపించారు. ఇమ్రాన్‌ను రాజకీయంగా దెబ్బ తీసేందుకు రెహమ్‌ను ఆయుధంగా వాడుకుంటున్నారని ఆరోపించారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఇమ్రాన్ పార్టీ నాయకుడు, ఇప్పటి పాకిస్తాన్ రైల్వే శాఖ మంత్రి షేక్ రషీద్ గతేడాది జూన్‌లో దునియా అనే టీవీ చానెల్లో నిర్వహించిన ఓ చర్చా కార్యక్రమంలో మాట్లాడుతూ.. పైన పేర్కొన్న వ్యాఖ్యలను పరుష పదజాలంతో మరోసారి చేశారు. ఉర్దూలో ప్రసారమయ్యే దునియా చానెల్ ఇంగ్లాండ్‌లో కూడా ప్రసారమవుతుంది. అయితే రషీద్ చేసిన ఆరోపణలను ఆ చానెల్ పదే పదే ప్రసారం చేసింది. దీంతో మనస్తాపానికి గురైన రెహమ్ ఖాన్ నిరాధార ఆరోపణలతో తన పరువుకు భంగం కలిగించారంటూ లండన్‌లోని రాయల్ కోర్టులో కేసు వేసింది. ఈ కేసును విచారించిన న్యాయమూర్తి మాథ్యూ నిక్లిన్ రెహమ్ ఖాన్‌కు క్షమాపణలు చెప్పి కోర్టు ఖర్చులు చెల్లించాలని సదరు టీవీ చానెల్‌ను ఆదేశించారు. జడ్జి ఆదేశాల ప్రకారం దునియా టీవీ చానెల్ రెహమ్ ఖాన్‌కు బహిరంగ క్షమాపణలు చెబుతూ, కొంత నష్ట పరిహారంతో కోర్టు ఖర్చుల్ని భరిస్తామని ప్రకటించింది. అనంతరం రెహమ్ స్పందిస్తూ.. ఈ తీర్పు వల్ల నా వ్యక్తిత్వాన్ని కాపాడుకున్నానని, పాకిస్తాన్లో నైతిక జర్నలిజానికి ఈ తీర్పు దోహదపడుతుందని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. -
ప్రణబ్ ముఖర్జీ రాయని డైరీ
జోర్డాన్‌లో దిగి చాలా సేపయింది. ఇక్కడి రాయల్ కోర్టులో ఇంకా తెల్లవారలేదు. రాష్ట్రపతి భవన్లో అయితే ఈపాటికి కాఫీలు, టిఫిన్లు పూర్తయి ఉండేవి. జోర్డాన్.. ఇండియా కన్నా రెండున్నర గంటలు వెనకుంటుందని ఫ్లయిట్ దిగుతున్నప్పుడు థావర్ చంద్ గెహ్లాట్ చెప్పాడు. మోదీ గవర్నమెంట్లో ఆయన సోషల్ జస్టిస్ మినిస్టర్. జోర్డాన్ అయినా, ఇండియా అయినా గంటలు నిమిషాల్లో వెనకబడిపోతే వచ్చే నష్టం ఏమీ లేదు. సోషల్ జస్టిస్‌లో యుగాల వెనక్కి వెళ్లకుండా ఉంటే చాలు. ఇవాళ, రేపు జోర్డాన్‌లో. తర్వాతి మూడు రోజులు పాలస్తీనాలో, ఇజ్రాయెల్‌లో. కొన్ని స్పీచ్‌లు, కొన్ని సంతకాలు, కొన్ని టూర్లు.. చిన్నచిన్నవి. ఇజ్రాయెల్ అయితే ముందే చెప్పేసింది, జెరూసలేంలోని అల్ అఖ్సా మసీదును మాత్రం చూడ్డం కుదరదని! పాలస్తీనా బాంబులేస్తోందట. సెక్యూరిటీ కష్టమట. అల్ అఖ్సా.. అక్కడి టెంపుల్ మౌంట్ కాంపౌండ్‌లో ఉంది. ఆ కాంపౌండ్లోనే యూదులు, క్రైస్తవుల ప్రార్థనాలయాలు కూడా ఉన్నాయి. అన్నిటినీ ఒకే చోట చూడ్డం ఎంత అదృష్టం. రెలిజియస్ డెమోక్రసీ! డెమోక్రసీ! అందమైన మాట. సత్యమేవ జయతేలా, జనగణమనలా, వందేమాతరంలా, రిపబ్లిక్ ఆఫ్ ఇండియాలా! చరిత్రలో ఎన్ని నాగరికతలు వర్ధిల్లలేదు? ఎన్ని క్షీణించలేదు? ఇండియా మాత్రం అలానే నిలిచి ఉంది. విలువల్ని కాపాడుకుంటోంది. సహనమూర్తి నా దేశం. సహనశీలత మన నాగరికత. ఎవరో అన్నారు.. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈ మాట ఇప్పుడెందుకు చెబుతున్నారు.. రిపబ్లిక్ డే కాదు కదా, ఇండిపెండెన్స్ డే కాదు కదా అని. నిజమే. కానీ అప్పుడప్పుడు జరిగే దురదృష్టకర సంఘటనల్ని కూడా జాతీయ ప్రాముఖ్యం ఉన్న సందర్భాలుగానే భావించాలి. ఎదురుగా కాఫీ టేబుల్ మీద ప్రభు చావ్లా రాసిన పుస్తకం ఉంది. ‘ది నేషనలిస్ట్ ప్రెసిడెంట్-ప్రణబ్ ముఖర్జీ’. వచ్చేటప్పుడు వెంట తెచ్చుకున్నాను. పుస్తకం రిచ్‌గా ఉంది. కవర్‌పేజీ మీద నేనూ రిచ్‌గానే ఉన్నాను.. సూటు వేసుకుని, కుషన్ సీట్లో కూర్చుని! మరి నా లోపలి నేషనలిస్ట్.. పుస్తకం లోపల ఎలా ఉన్నాడో. కూర్చునా? నిల్చునా? నేషనలిస్ట్ ఎప్పుడూ నిటారుగానే ఉండాలి. పుస్తకం చూడలేదు. రాత్రి ఫ్లయిట్లో చూడ్డానికి కుదరలేదు. ఇండియా తిరిగి వెళ్లేలోపు కొన్ని పేజీలైనా తిరగేయాలి. ఫిష్ కర్రీ, మృదువైన చపాతీలు నా కోసం సిద్ధంగా ఉన్నాయని జోర్డాన్ రాజప్రాసాదం నుంచి కబురు! వాళ్ల బ్రేక్‌ఫాస్ట్ వేరు. వీటిని నాకోసం ప్రత్యేకంగా చేయించారు.. నాకు చేపలంటే ఇష్టమని. జోర్డాన్ నది నుంచి పట్టి తెచ్చారట! పాలన.. రాచరికం. ఆతిథ్యం.. ప్రజాస్వామ్యం. అన్నట్లు.. డెమోక్రసీలోని ఇంకో గొప్ప సంగతి.. నచ్చింది తినే స్వతంత్రం. - మాధవ్ శింగరాజు