
టొరంటో: చిన్నారులు ఆరోగ్యంగా ఎదగడానికి చిక్కటి పాలకు మించినది మరేది లేదని మరోసారి రుజువైంది. ఈ మధ్య కాలంలో వెన్న, కొవ్వు తీసేసిన పాలు అమ్ముతూ, అదే ఆరోగ్యానికి మంచిదని, ఊబకాయం రాదని ఊదరగొడుతూ ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆ ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదని కెనడాలో జరిగిన పరిశోధనల్లో వెల్లడైంది. కొవ్వు తీసేసిన పాలు తాగిన వారి కంటే హోల్ మిల్క్ తాగిన పిల్లల్లో ఊబకాయం ప్రమాదం 40 శాతం తక్కువగా ఉన్నట్టుగా తేలింది. కెనడాలో సెయింట్ మైకేల్ ఆస్పత్రి పరిశోధకులు మొత్తం 28 అధ్యయనాలను విశ్లేషించి నివేదిక రూపొందించారు.
ఈ వివరాలను అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్‌లో ప్రచురించారు. కెనడా పరిశోధకులు విశ్లేషించిన 28 అధ్యయనాల్లో కూడా వెన్న తీసేసిన పాలు తాగినంత మాత్రాన ఊబకాయం, అధిక బరువు ప్రమాదం ఉండదని రుజువు కాలేదు. అంతేకాదు, వాటిలో 18 అధ్యయనాలు చిక్కటి పాలు తాగిన వారిలో ఊబకాయం ప్రమాదం తక్కువగా ఉందని తేలింది. రెండేళ్ల వయసు దాటాక తక్కువ కొవ్వున్న పాలు తాగితే పిల్లల్లో ఊబకాయం సమస్యలు ఉండవన్న అంతర్జాతీయ మార్గదర్శకాలను ఈ పరిశోధన సవాల్ చేసినట్టయింది.