మలేషియా విమానం: కొత్త ఆధారాలు లభ్యం | Sakshi
Sakshi News home page

మలేషియా విమానం: కొత్త ఆధారాలు లభ్యం

Published Fri, Mar 28 2014 10:46 AM

మలేషియా విమానం: కొత్త ఆధారాలు లభ్యం

దక్షిణ హిందూ మహాసముద్రంలో కుప్పకూలిన మలేషియా విమానం ఎం హెచ్ 370 విషయంలో ఆస్ట్రేలియా అధికారులకు కొత్త ఆధారాలు లభించాయి. వీటి ఆధారంగా ఇప్పుడు అన్వేషణ కొనసాగిస్తున్న ప్రాంతం కన్నా 680 మైళ్ల దూరంలో విమాన శకలాలు ఉండవచ్చునని భావిస్తున్నారు. దీంతో సెర్చ్ టీమ్ లు అక్కడికి తరలి వెళ్తున్నాయి.

శుక్రవారం నుంచి ఆస్ట్రేలియాలోని పెర్త్ కి 1250 మైళ్ల దూరంలో 123.200 చ. మైళ్ల ప్రాంతంలో అన్వేషణ జరుగుతుంది. గురువారం భారీ వర్షాలు, మేఘాల వల్ల విమానాలు బయలుదేరలేకపోయాయి. ముందు ఏమి ఉందో తెలియనంత దట్టంగా వానపడటంతో పడవలకు కూడా ఇబ్బంది కలిగింది. అదృష్ట వశాత్తూ శుక్రవారం నుంచి వాతావరణం మెరుగుపడటంతో అన్వేషణ వేగం పుంజుకుంది.

అయితే తాజాగా లభించిన వివరాల ప్రకారం మలేషియా విమానం ఊహించిన దానికన్నా వేగంగా ప్రయాణించింది. దీని వల్ల ఇంధనం అనుకున్న దాని కన్నా ముందే అయిపోయి ఉండవచ్చు.ఫలితంగా విమానం కుప్పకూలిందని ఇప్పటి వరకూ భావిస్తున్న ప్రదేశం కన్నా చాలా ముందే నీటిలో పడిపోయి ఉండవచ్చు.

మలేషియా రాజధాని కౌలాలంపూర్ నుంచి బీజింగ్ కి 239 మంది ప్రయాణికులను తీసుకెళ్తున్న ఎం హెచ్ 370 మార్చి 8 న కుప్పకూలిపోయింది. ఈ విమానం హిందూ మహాసముద్ర జలాల్లో కుప్పకూలిందని భావిస్తున్నారు. గత 20 రోజులుగా దీని శకలాల కోసం అన్వేషణ సాగుతోంది.
 

Advertisement
Advertisement