బాధిత విద్యార్థులకు ‘నాటా’ న్యాయసహాయం

Nata Helps Farmington University Affected Students - Sakshi

న్యూజెర్సీ : ఫర్మింగ్‌టన్‌ ఫేక్‌ యూనివర్సిటీ వ్యవహారంలో అరెస్టయిన తెలుగు విద్యార్థులకు సాయం చేసేందుకు నార్త్‌ అమెరికన్‌ తెలుగు అసోషియేషన్‌ (నాటా) ముందుకొచ్చింది. ఫర్మింగ్‌టన్‌ యూనివర్సిటీ ఫేక్‌ అని తెలియక చాలా మంది విద్యార్థులు మోసపోయారని నాటా ప్రెసిడెంట్‌ డాక్టర్‌ గోసల రాఘవ రెడ్డి, కార్యదర్శి ఆళ్ళ రామిరెడ్డి అన్నారు. బాధితుల్లో ఎక్కువమంది తెలుగు విద్యార్థులే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. (130 మంది విద్యార్థుల అరెస్టు)

అరెస్టయిన వారిలో చాలామంది తమ వర్క్‌ పర్మిట్‌ పొందడానికి ఈ యూనివర్సిటీలో చేరానని వెల్లడించారు. బాధిత విద్యార్థులు నాటాకు ఫోన్‌ చేసి పరిస్థితి వివరించారని తెలిపారు. విద్యార్థులకు ఉచిత న్యాయసహాయం అందిస్తామని నాటా నాయకులు ఒక ప్రకటన విడుదల చేశారు. ఇమ్మిగ్రేషన్‌ లాయర్లు విజయ్‌ ఎల్లారెడ్డిగారి, సంతోష్‌రెడ్డి సోమిరెడ్డి, యాయా తిబిట్‌ బాధిత విద్యార్థులతో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడి, వలసదారుల హక్కులేమిటో తెలిపారని,  మళ్లీ ఇలాంటి ఘటనల్లో బాధితులు కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారని తెలిపారు.

తల్లిదండ్రులు భయపడొద్దు..
అరెస్టయిన విద్యార్థుల తల్లిదండ్రులు భయపడాల్సిన పనిలేదని నాటా నాయకులు తెలిపారు. విచారరణ పూర్తయిన అనంతరం విద్యార్థుల భారత్‌కు పంపుతారని వెల్లడించారు. హోమ్‌ ల్యాండ్‌ సెక్యురిటీ శాఖ నిర్బంధంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని భరోసానిచ్చారు.

వివరాలు తెలుసుకోవాలంటే..
అరెస్టయిన వారి వివరాలు తెలుసుకోవాలంటే https://locator.ice.gov వెబ్‌సైట్‌లో లేదా ఇండియన్‌ ఎంబసీ వారికి  {(202) 322-1190, (202) 340-2590} ఫోన్‌ చేసి తెలుసుకోవచ్చని సూచించారు. వివరాలకోసం.. cons3.washington@mea.gov.in కి ఈమెయిల్‌ చేయవచ్చని తెలిపారు. కష్టపడి చదివిన విద్యార్థులా ఫేక్‌ యూనివర్సిటీల ఉచ్చులో పడకుండా.. అన్ని రూల్స్‌ పాటించి ప్రముఖ విశ్వవిద్యాలయాల నుంచి OPT/CPT పొందడం కోసం కృషి చేయాలని సలహా ఇచ్చారు. ఎటువంటి కోర్లులు లేకుండా ఏ యూనివర్సిటీ అయినా CPT అందించినట్టయితే అలాంటి వర్సిటీలను నమొద్దని హెచ్చరించారు.

129 మంది భారతీయులే..
అమెరికాలో విద్యార్థి వీసాలపై అక్రమంగా ఉంటూ ఉద్యోగాలు చేసుకుంటున్న విదేశీయులను పట్టుకునేందుకు ఇమిగ్రేషన్‌ అండ్‌ కస్టమ్స్‌ (ఐసీఈ) అధికారులు పార్మింగ్‌టన్‌ పేరుతో నకిలీ యూనివర్సిటీని ఏర్పాటు చేయడం తెలిసిందే. ఈ వలలో చిక్కిన 8 మంది మధ్యవర్తులు (అందరూ తెలుగు వారే) ఇప్పటికే అరెస్టవ్వగా, తాజాగా 130 మంది విద్యార్థులు కూడా అరెస్టయ్యారు. 8 మందిపై వీసా సంబంధిత నేరపూరిత కుట్ర, లాభం కోసం అన్యులకు ఆశ్రయమివ్వడం తదితర అభియోగాలను నమోదు చేసిన అధికారులు, విద్యార్థులపై మాత్రం కేవలం పౌర వలస నిబంధనల ఉల్లంఘన అభియోగంతో సరిపెట్టారు. అరెస్టైన 130 మంది విద్యార్థుల్లో 129 మంది భారతీయులేనని ఐసీఈ అధికార ప్రతినిధి ఖాలిద్‌ వాల్స్‌ చెప్పారు. వారిని భారత్‌కు తిరిగి పంపించేయనున్నామన్నారు.   

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top