అంగారకుడిపై కంపనాలు

NASA'S INSIGHT LANDER CATCHES EVIDENCE OF FIRST EVER QUAKE ON MARS - Sakshi

వాషింగ్టన్‌: అంగారకుడిపై మొదటిసారి కంపనాలకు సంబంధించిన శబ్దాలు రికార్డయ్యాయి. మార్స్‌పై పరిశోధనలు చేసేందుకు నాసా ప్రయోగించిన ‘ఇన్‌సైట్‌’ అంతరిక్ష నౌక ఈ కంపనాల ధ్వనులను గుర్తించింది. ఇన్‌సైట్‌లో అమర్చిన సిస్మిక్‌ ఎక్స్‌పరిమెంట్‌ ఫర్‌ ఇంటీరియర్‌ స్ట్రక్చర్‌(ఎస్‌ఈఐఎస్‌) పరికరం ఈ నెల 6వ తేదీన ఈ కంపనాలను రికార్డు చేసినట్లు నాసా తెలిపింది. గతేడాది మేలో ఇన్‌సైట్‌ను ప్రయోగించగా డిసెంబర్‌లో సిసిమోమీటర్‌ను అది అంగారకుడి ఉపరితలంపై ఉంచింది. ఈ కంపనాల్ని మార్టియన్‌ సోలార్‌ 128 కంపనాలుగా పిలుస్తున్నారు. ఇక అంగారకుడి అంతర్భాగం నుంచి మొట్టమొదటిసారి వచ్చిన కంపనాలు ఇవే కావడం గమనార్హం.

ఇప్పటివరకు అంగారకుడిపై మార్చి 14, ఏప్రిల్‌ 10, ఏప్రిల్‌ 11 తేదీల్లో అత్యంత చిన్న చిన్న కంపనాలను కూడా సిసిమోమీటర్‌ గుర్తించింది. అయితే సోలార్‌ 128 కంపనాలు ఇంతకుముందు నాసా చేపట్టిన మూన్‌ మిషన్‌లో కనుగొన్న కంపనాలను పోలి ఉన్నాయి. దీంతో సోలార్‌ 128 కంపనాలపైనే శాస్త్రవేత్తలు ఎక్కువగా దృష్టి కేంద్రీకరించారు. ఈ కంపనాలు ఏర్పడటానికి గల అసలు కారణాన్ని విశ్లేషిస్తున్నారు. ఈ కంపనాలు చాలా చిన్నవని, ఇటువంటి చిన్న చిన్న కంపనాలను గుర్తించడమే ఇన్‌సైట్‌ నౌక అసలు లక్షమని ఇన్‌సైట్‌ ప్రిన్సిపల్‌ ఇన్వెస్టిగేటర్‌ బ్రూస్‌ బానెర్డ్‌ తెలిపారు. ఇన్‌సైట్‌ బృందానికి 128 కంపనాలు మైలురాయి లాంటిదని, ఇలాంటి సంకేతాల కోసం కొన్ని నెలలుగా తాము ఎదురుచూస్తున్నామని శాస్త్రవేత్త ఫిల్‌ లాగ్నొన్నె తెలిపారు. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top