అల్విదా.. అపార్చునిటీ!

NASA Curiosity rover snaps striking Mars selfie before rolling out - Sakshi

ఆ రోవర్‌ గతించినట్లు నాసా అంచనా

బ్యాటరీల చార్జింగ్‌కు అడ్డంకిగా మారిన ధూళి తుపాను

అంగారకుడిపై 15 ఏళ్ల పాటు సేవలు

వాషింగ్టన్‌: అంగారక గ్రహానికి సంబంధించిన ఫొటోలు, సమాచారాన్ని మనకు పంపిస్తూ వచ్చిన రోవర్‌ అపార్చునిటీ గతించినట్లు భావిస్తున్నామని నాసా ప్రకటించింది. ఇది గత 15 ఏళ్లుగా సేవలందిస్తోంది. అపార్చునిటీ ఉన్న పర్‌సెవరెన్స్‌ లోయ దక్షిణ భాగంలో ఏడు నెలల క్రితం సంభవించిన భారీ తుపానులో అది దెబ్బతిని ఉంటుం దని శాస్త్రవేత్తలు అనుమానిస్తున్నారు. ఈ తుపాను నుంచి వెలువడిన ధూళి, దుమ్ము ఆ ప్రాంతాన్ని కప్పేసిందని, అప్పటి నుంచి దాని సౌర పలకలు సౌరశక్తిని గ్రహించడం కష్టంగా మారడంతో బ్యాటరీల చార్జింగ్‌ ఆగిపోయిందని వెల్లడించారు.

అయితే క్రమంగా తుపాను ఉధృతి తగ్గిన తరువాత రోవర్‌తో సంబంధాల పునరుద్ధరణకు మిషన్‌ బృందం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అపార్చునిటీ నుంచి చివరిసారిగా గతేడాది జూన్‌ 10న భూమికి సంకేతాలు చేరాయి. ఆ తరువాత రోవర్‌కు సుమారు 600 కమాండ్లు పంపామని నాసా తెలిపింది. డీప్‌ స్పేస్‌ నెట్‌వర్క్‌(డీఎస్‌ఎన్‌) రేడియో సైన్స్‌ సాయంతో వేర్వేరు పౌనఃపున్యాలు, పోలరైజేషన్‌లలో అపార్చునిటీ గురించి పరిశోధకులు అన్వేషణ కొనసాగిస్తూనే ఉన్నారు. ఇక చివరి ప్రయత్నంగా రాబోయే వారాల్లో మరిన్ని కమాండ్‌లు పంపాలని కాలిఫోర్నియాలోని జెట్‌ ప్రొపల్షన్‌ లేబొరేటరీ పరిశోధకులు సమాయత్తమవుతున్నారు. అపార్చునిటీతో తిరిగి సంబంధాలు పొందేందుకు అందుబాటులో ఉన్న అన్ని సాంకేతిక మార్గాల్ని పరిశీలిస్తామని వారు చెప్పారు.

లక్ష్యం 90 రోజులు..కొనసాగింది 5 వేల రోజులు
గోల్ఫ్‌ కారు పరిమాణంలో, ఆరు చక్రాలతో కూడిన అపార్చునిటీ 2004, జనవరి 24న అంగారకుడి ఉపరితలంపై కాలుమోపింది. దీనితో పాటు స్పిరిట్‌ అనే మరో రోవర్‌ను కూడా పంపారు. అరుణ గ్రహం నుంచి భూమికి సంకేతాలు పంపిన తొలి రోవర్‌గా అపార్చునిటీ గుర్తింపు పొందింది. అంగారకుడిపై 1,006 మీటర్లు ప్రయాణించి, 90 రోజులు సేవలందించేలా దీన్ని రూపొందించారు. కానీ గత ఏడాది ఫిబ్రవరి నాటికే 45 కిలోమీటర్లు ప్రయాణించి 5000వ రోజును పూర్తి చేసుకుంది. సహచర స్పిరిట్‌ మిషన్‌ 2011లోనే ముగిసింది. అపార్చునిటీకి కాలం చెల్లినా దాని పనితీరు సంతోషకరంగా సాగిందని ఈ ప్రయోగ ప్రధాన అధ్యయనకర్త స్టీవెన్‌ డబ్ల్యూ స్క్వైర్స్‌ చెప్పారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top