ఆక‌లి తీర్చేందుకు రాళ్ల‌ను క‌రిగిస్తోన్న త‌ల్లి

Mother Boils Stones For Hungry Kids Believe She Prepare Meal In Kenya - Sakshi

లాక్‌డౌన్ వ‌ల్ల పేద‌ల ఇంట్లో ఆక‌లి కేక‌లు

ఆక‌లితో పిల్ల‌ల ఏడుపులు.. ఉపాయం ఆలోచించిన త‌ల్లి

వండేందుకు ఏమీ లేక రాళ్లు ఉడికించిన త‌ల్లి

సాయం చేస్తూ ఆమెకు అండ‌గా నిలుస్తున్న జ‌నాలు

నైరోబి: క‌రోనా ఏమో కానీ దానిక‌న్నా ముందే క‌టిక దారిద్ర్యం పేద‌వారి ప్రాణాలు తీసేలా ఉంది. ఇంట్లో స‌రుకులు లేక‌, పిల్ల‌ల‌ క‌డుపు నింప‌లేక పేద త‌ల్లిదండ్రులు కళ్ల నుంచి ర‌క్తం కారుస్తున్నారు. ఓవైపు ఆక‌లిమంట.. మ‌రోవైపు క‌న్న‌బిడ్డ‌ల‌కు తిండిపెట్ట‌లేక పేగుమంట‌.. వెర‌సి ఓ త‌ల్లి, లేని అన్నం వండుతున్న‌ట్లు పిల్ల‌ల‌ను మాయ చేస్తూ నిద్ర పుచ్చుతోంది. వీరి దుస్థితికి సంబంధించిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కెన్యాకు చెందిన కిట్సావో అనే ఓ వితంతువు ఇరుగుపొరుగు ఇళ్ల‌లో బ‌ట్టలు ఉతికే ప‌ని చేసేది. ఆ దేశంలో విధించిన లాక్‌డౌన్ వ‌ల్ల ఆమె ప‌ని కోల్పోయింది. దీంతో నీళ్లు, విద్యుత్ స‌దుపాయం కూడా స‌రిగా లేని త‌న ఇంటికే ప‌రిమిత‌మైంది. చూస్తుండ‌గానే ఆమె ఇంట్లో ఉన్న స‌రుకులు నిండుకున్నాయి. ఇవేవీ అర్థం కాని పిల్ల‌లు ఆక‌లంటూ అల‌మ‌టించారు. (ఆ గిఫ్ట్ ఇవ్వ‌గానే ఏడ్చేసిన వృద్ధుడు)

ప్ర‌పంచంలో ఇంత ప్రేముందా?
వారికి ఆ త‌ల్లి ఏమ‌ని చెప్ప‌గ‌ల‌దు?  చెప్పినా పిల్లలు ఏమ‌ని అర్థం చేసుకోగ‌ల‌రు? అలా అని ఎన్ని పూట‌ల‌ని వాళ్లు ఆక‌లిని చంపుకుని ఉండ‌గ‌ల‌రు? వారి క‌న్నీళ్లు చూడ‌లేక‌, క‌డుపున భోజ‌నం పెట్ట‌లేక ఆ త‌ల్లి ఓ ప‌రిష్కార మార్గాన్ని ఆలోచించింది. పొయ్యి వెలిగించి ప‌సిపిల్ల‌ల‌ క‌ళ్ల‌లో ఆశ‌ల జ్యోతులు నింపింది. అందులో రాళ్లు వేసి ఉడికిస్తూ అన్నం త‌యార‌వుతోంద‌ని చెప్పి ప‌డుకోబెట్టింది. అది ఎన్న‌టికీ ఆహారంగా మార‌ద‌ని తెలీని చిన్నారులు అమాయ‌కంగా అమ్మ చెప్పిన మాట‌ల‌ను న‌మ్మి నిద్ర‌లోకి జారుకున్నారు. ఇది గ‌మ‌నించిన ఓ వ్య‌క్తి మీడియాకు స‌మాచారం అందించాడు. దీంతో ఆమె గురించి ప్ర‌పంచానికి తెలిసింది. మాన‌‌వ‌త్వం ఇంకా మిగిలే ఉంద‌ని నిరూపిస్తూ ఎంద‌రో వ్య‌క్తులు సాయం కోసం ముందుకొస్తున్నారు. నిత్యావ‌స‌ర స‌రుకుల‌తోపాటు పెద్ద మొత్తంలో డ‌బ్బును అంద‌జేస్తున్నారు. ఇది చూసిన ఆ త‌ల్లి ప్ర‌పంచంలో ఇంత ప్రేమ ఉంద‌ని న‌మ్మ‌లేక‌పోతున్నాన‌ని భావోద్వేగానికి లోనైంది. (నాన్నా.. అమ్మ ఏది?)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top