మిస్‌ వరల్డ్‌గా జమైకా సుందరి

Miss World 2019 winner is Miss Jamaica Tony Ann Singh - Sakshi

రెండో రన్నరప్‌గా భారత్‌కు చెందిన సుమన్‌ రావ్‌

లండన్‌: జమైకాకు చెందిన టోనీ–ఆన్‌ సింగ్‌ మిస్‌ వరల్డ్‌–2019 కిరీటం దక్కించుకున్నారు. లండన్‌లోని ఎక్సెల్‌ లండన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో శనివారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగిన కార్యక్రమంలో ఆమెను ఈ కిరీటం వరించింది. గత ఏడాది మిస్‌ వరల్డ్‌గా నిలిచిన మెక్సికో సుందరి వనెస్సా పొన్స్‌.. టోనీ–ఆన్‌ సింగ్‌ తలపై మిస్‌ వరల్డ్‌ కిరీటాన్ని అలంకరించారు. ఈ పోటీలో ఫస్ట్‌ రన్నరప్‌గా ఫ్రాన్స్‌కు చెందిన ఒఫ్లి మెజినో, సెకండ్‌ రన్నరప్‌గా భారత్‌కు చెందిన సుమన్‌ రావ్‌ నిలిచారు.

నవంబర్‌ 20వ తేదీ నుంచి మొదలైన 69వ మిస్‌ వరల్డ్‌–2019 పోటీలో 120 దేశాలకు చెందిన అందగత్తెలు పాల్గొన్నారు. పలు వడబోతల అనంతరం ఫైనల్స్‌ కోసం 10 మందిని ఎంపిక చేశారు. అంతిమంగా ఎంపికైన ఐదుగురికి ప్రముఖ వ్యాఖ్యాత పియర్స్‌ మోర్గాన్‌ నేతృత్వంలోని బృందం పలు ప్రశ్నలు సంధించింది. అందగత్తెల సమాధానాల ఆధారంగా విజేతలను ఎంపిక చేసింది. తన సొంతూరుతోపాటు ప్రపంచవ్యాప్తంగా లింగ సమానత్వం కోసం పోరాడతానని ఈ సందర్భంగా భారత్‌కు చెందిన రన్నరప్‌ సుమన్‌ రావ్‌ అన్నారు. జమైకా నుంచి మిస్‌ వరల్డ్‌ గెలుచుకున్న నాలుగో మహిళగా టోనీ–ఆన్‌ చరిత్ర సృష్టించారు. తొమ్మిదేళ్ల వయస్సులో ఆమె కుటుంబం అమెరికాకు వలస వెళ్లి, ఫ్లోరిడాలో స్థిరపడింది.

సుమన్‌ రావ్‌

 ►  జననం: 1998 నవంబర్‌ 23
 ► స్వస్థలం: రాజస్తాన్‌ రాష్ట్రం ఉదయ్‌పూర్‌ సమీపంలోని అయిదానా
 ► తల్లి: సుశీలా కున్వర్‌ రావ్, గృహిణి
 ► తండ్రి: రతన్‌ సింగ్, నగల వ్యాపారి
 ►  విద్య: నవీముంబైలోని మహాత్మా స్కూల్‌ ఆఫ్‌ అకాడెమిక్స్‌ అండ్‌ స్పోర్ట్స్‌లో పాఠశాల విద్య పూర్తి చేశారు, ప్రస్తుతం ముంబై యూనివర్సిటీలో చార్టెర్డ్‌ అకౌంటెన్సీ చదువుతున్నారు.
 ► భాషలు: ఇంగ్లిష్, హిందీతోపాటు మాతృభాష మేవారీ
 ► వృత్తి: మోడల్, డ్యాన్సర్‌(కథక్‌)
 ► 2018లో మిస్‌ నవీముంబై పోటీలో పాల్గొని మొదటి రన్నరప్‌గా నిలిచారు. అనంతరం రాజస్తాన్‌ తరఫున పాల్గొని ఫెమినా మిస్‌ ఇండియా వరల్డ్‌ –2019ను, ఆ పోటీల్లోనే మిస్‌ ర్యాంప్‌వాక్‌ అవార్డు గెలుచుకున్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top