
ముస్లింలపై అందాల భామ ట్వీట్ల దుమారం!
మిస్ పోర్టారికో- 2015గా ఎంపికైన అందాల భామ డెస్టినీ వెలెజ్ ముస్లింల గురించి ట్విట్టర్‌లో చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
మిస్ పోర్టారికో- 2015గా ఎంపికైన అందాల భామ డెస్టినీ వెలెజ్ ముస్లింల గురించి ట్విట్టర్‌లో చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఆమె వ్యాఖ్యలపై స్పందించిన అందాల పోటీ నిర్వాహక సంస్థ మిస్ పోర్టారికో ఆర్గనైజేషన్ ఆమెను నిరవధికంగా సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించింది. 'మనమందరం ముస్లింలమే' అంటూ దర్శకుడు మైఖేల్ మూర్ గతవారం ఆన్‌లైన్‌లో ఓ ప్రచారం చేపట్టారు. ఇందులోభాగంగా 'వుయ్ ఆర్ ముస్లిం' అన్న ప్లకార్డు పట్టుకొని ఫొటోలు దిగి ఆన్‌లైన్‌లో పెట్టాల్సిందిగా ఆయన నెటిజన్లకు విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన డెస్టినీ వెలెజ్ తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
'అమెరికాను భయపెట్టేందుకు ముస్లింలు మన రాజ్యాంగాన్ని ఉపయోగించుకుంటున్నారు. యూదులు, క్రైస్తవులతో ముస్లింలకు ఎలాంటి పోలిక లేదు. యూదులు, క్రైస్తవుల పవిత్ర పుస్తకాల్లో టెర్రర్ అజెండాలు లేనేలేవు. చమురు సమకూర్చడం, ఈ దేశాన్ని భయపెట్టడం, ఎంతమందిని భయభ్రాంతులకు గురిచేయడం ఇదే ముస్లింలు చేస్తున్నారు' అని ఆమె ట్వీట్ చేసింది. ఈ వ్యాఖ్యలపై దుమారం రేగడంతో తన ట్విట్టర్ పేజీని తొలగించి.. క్షమాపణలు చెప్పింది. మరోవైపు ఆమె వ్యాఖ్యలతో తమకెలాంటి సంబంధం లేదని మిస్ పోర్టారికో ఆర్గనైజేషన్ పేర్కొంది. ఆమె వ్యాఖ్యలు తమ సంస్థ ఆశయాలకు విరుద్ధంగా ఉన్నాయని పేర్కొంది. సంస్థ ఆశయాలకు విరుద్ధంగా పోటీదారులు వ్యాఖ్యలు చేస్తే సహించబోమని, అందుకే ఆమెను సస్పెండ్ చేశామని తెలిపింది.