గార్డెన్ ఫెస్టివల్ 'డిగ్ ద సిటీ'! | Manchester's summer garden festival Dig the City returns | Sakshi
Sakshi News home page

గార్డెన్ ఫెస్టివల్ 'డిగ్ ద సిటీ'!

Aug 3 2015 10:03 AM | Updated on Sep 3 2017 6:43 AM

గార్డెన్ ఫెస్టివల్ 'డిగ్ ద సిటీ'!

గార్డెన్ ఫెస్టివల్ 'డిగ్ ద సిటీ'!

గార్డెన్స్ అన్నా.. గార్డెనింగ్ అన్నా చాలా మందికి ఇష్టం.

 సాక్షి, స్కూల్ ఎడిషన్:
 గార్డెన్స్ అన్నా.. గార్డెనింగ్ అన్నా చాలా మందికి ఇష్టం. గార్డెన్‌లో ఉండే రకరకాలు మొక్కలు, పూలు అందరినీ ఆక్టుకుంటాయి. అందంగా తీర్చిదిద్దిన గార్డెన్లలో గడపడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. కొందరు ఇళ్లల్లోనూ గార్డెన్లు పెంచుకుని అక్కడ సేదతీరితే, మరికొందరు ఆరుబయట బహిరంగ ప్రదేశాల్లో ఉండే గార్డెన్స్‌లో గడుపుతుంటారు. ఏ ఇంటికైనా గార్డెన్ ఉంటే ఆ ఇల్లు ఎంతో అందంగా కనిపిస్తుంది. ఇక నగరాల్లో ఉండే గార్డెన్స్‌తో ఆ నగరానికే కొత్త కళ సంతరించుకుంటుంది. అలా ఒకటి, రెండు గార్డెన్లు కావు.. ఏకంగా వందల కొద్ది గార్డెన్లు ఒకే నగరంలో కనిపిస్తే.. అది చూసేవారికి కన్నులపండువగా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా అనేక నగరాల్లో గార్డెన్లు ఉన్నాయి. అయితే వీటికోసం మాంచెస్టర్‌లో ఏకంగా ఓ ఫెస్టివల్‌నే నిర్వహిస్తారు. ఈ రోజు ఆ ఫెస్టివల్ విశేషాలు మీకోసం...
 
 ఎక్కడ జరుగుతుంది
 ఇంగ్లండ్‌లోని ప్రధాన పట్టణం మాంచెస్టర్. ఇక్కడ ప్రతియేడూ వేసవి కాలంలో  'డిగ్ ద సిటీ'పేరిట గార్డెన్ ఫెస్టివల్ జరుగుతుంది. తాజాగా గత నెల 31న ప్రారంభమైన  'డిగ్ ద సిటీ'-2015 ఫెస్టివల్ ఈ నెల 6 వరకు కొనసాగనుంది. ఇందులో భాగంగా నగరం మొత్తాన్ని రకరకాల గార్డెన్లతో అలంకరిస్తారు. వీధులు మాత్రమే కాదు.. ఇక్కడి ఇళ్లు, వ్యాపార సముదాయాలు, హోటళ్లు, ఇతర సంస్థలు అన్నింటినీ వైవిధ్యభరితమైన గార్డెన్లతో తీర్చిదిద్దుతారు. ఎప్పుడూ ఒకే రకమైన గార్డెన్లు చూసిన వారికి ఇక్కడ కనిపించే కొత్త రకం గార్డెన్లు వింతగా అనిపిస్తాయి. నగరాల్లో జరిగే ప్రపంచ అతిపెద్ద గార్డెన్ ఫెస్టివల్ ఇదే. ఈ ప్రదర్శనలో 28 ప్రత్యేక గార్డెన్లను ప్రదర్శిస్తారు. వీటిలో అంతర్జాతీయ అవార్డు సాధించిన 'బీ గార్డెన్'కూడా ఉంది. మట్టి లేకుండా ఏర్పాటు చేసే (సాయిల్ లెస్) గార్డెన్, కమ్యూనిటీ గార్డెన్‌లు ప్రత్యేక ఆకర్షణలు.
 
 విదేశీ సందర్శకుల రాక
 ఈ ఫెస్టివల్‌ను తిలకించేందుకు బ్రిటన్ సహా పలు దేశాల నుంచి గార్డెన్ ప్రేమికులు భారీగా హాజరవుతారు. ఇది కుటుంబ సమేతంగా పాల్గొనదగిన ఫెస్టివల్. సందర్శకులు ఫెస్టివల్‌ను ప్రతిబింబించే ప్రత్యేక దుస్తులు ధరిస్తారు. ఇందులో పాల్గొనడం వల్ల పర్యావరణంపై కూడా అవగాహన కలుగుతుందని నిర్వాహకులు తెలిపారు. పూల మొక్కలపై ఆధారపడి జీవించే వివిధ కీటకాల గురించి కూడా ఈ ఫెస్టివల్ ద్వారా అవగాహన పెంచుకోవచ్చు.
 
 సృజనాత్మకతకు పెద్దపీట
 గార్డెనింగ్ అంటే ఎప్పుడూ ఒకే రకంగా ఎందుకు ఉండాలి? ఇందులోనూ మన సృజనాత్మకత చూపించాలి అనుకునే వారికి ఈ ఫెస్టివల్ అసలైన వేదిక. వివిధ దేశాలకు చెందిన గార్డెన్ డిజైనర్లు, వ్యాపారులు, సంస్థలు ఈ ఫెస్టివల్‌లో పాల్గొంటాయి. ఇందులో రకరకాల గార్డెన్లను ప్రదర్శిస్తారు. బూట్లనే కుండీగా మలిచి అలంకరించిన పూలు, అనేక పాత్రలు, ప్లాస్టిక్ వస్తువుల్లో పెంచిన మొక్కలను కూడా ప్రదర్శనకు ఉంచుతారు. ఈ ఫెస్టివల్‌లో ప్రతియేడూ ఓ కొత్త థీమ్‌ను రూపొందిస్తారు. ఈ యేటి థీమ్ 'ఇన్నోవేట్ అండ్ ఇంటరాక్ట్'. అలాగే ఇక్కడ మొక్కలు పెంచేందుకు కొత్త విధానాన్ని అనుసరించి చూపిస్తారు.
 
 మరిన్ని ప్రత్యేకతలు
 గార్డెన్ ఫెస్టివల్ అంటే కేవలం పూల మొక్కల పెంపకానికి సంబంధించింది కాదు. అనేక విశేషాలు ఈ ఫెస్టివల్ సొంతం. సందర్శకులు కూడా ఇక్కడి మొక్కలను తీసుకుని గార్డెన్ రూపొందించవచ్చు. దీనిని పీపుల్స్ గార్డెన్ అని పిలుస్తారు. ఇందులో పాల్గొన్న వారిలో ఒకరికి బహుమతిని కూడా అందిస్తారు. స్థానిక హోటళ్లలో ప్రత్యేక మెనూను తయారు చేస్తారు. పూలతో రూపొందించే గొడుగులు మరో ఆకర్షణ. ఈ గొడుగులు ధరించి అక్కడి వారు చేసే సందడి అంతా ఇంతా కాదు. రంగురంగుల పూలు, కొమ్మలతో వీటిని రూపొందిస్తారు. ఇక జాజ్ ఫెస్టివల్, నైట్ షాపింగ్, పిల్లల కోసం ఉచితంగా నిర్వహించే ఈవెంట్లు ఎన్నో విశేషాలతో ఇది వారంపాటు సాగుతుంది. అలాగే సాల్‌ఫోర్డ్ యూనివర్సిటీలో డిజిటల్ గార్డెన్‌ను కూడా ఏర్పాటు చేస్తారు. గత శనివారం ఇక్కడ 'వన్ బిగ్ షాపింగ్ వీకెండ్' నిర్వహించారు. ఈ సందర్భంగా నగరంలో ఆ రోజు భారీ స్థాయిలో షాపింగ్ జరిగింది. విట్‌వర్త్ ఆర్ట్ గ్యాలరీ ద్వారా గార్డెన్స్‌ని కళాత్మకంగా ఎలా తీర్చిదిద్దాలో తెలుసుకోవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement