ఇంగ్లండ్ దిగ్గజ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ‘ది హండ్రెడ్’ లీగ్‌లో ఉన్నంతకాలం ప్రతి క్షణాన్ని ద్వేషించానన్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో.. ముఖ్యంగా టెస్టు ఫార్మాట్లో ఆండర్సన్ తిరుగులేని బౌలర్.
ఇంగ్లండ్ తరఫున 2002- 2024 వరకు అంతర్జాతీయ క్రికెట్ ఆడిన ఆండర్సన్.. 188 టెస్టుల్లో ఏకంగా 704 వికెట్లు కూల్చాడు. ఈ రైటార్మ్ ఫాస్ట్ మీడియం బౌలర్ ఖాతాలో 269 వన్డే వికెట్లు కూడా ఉండగా.. 19 టీ20లలో కలిపి 18 వికెట్లు పడగొట్టాడు. ఏదేమైనా రెడ్‌బాల్ క్రికెట్లో నేటికీ అత్యధిక వికెట్ల వీరుడిగా ఆండర్సన్ కొనసాగుతన్నాడు.
మాంచెస్టర్ ఒరిజినల్స్‌కు ప్రాతినిథ్యం
ఇక 2024లో ఇంటర్నేషనల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఆండర్సన్.. తాత్కాలిక కాలానికి గానూ ఇంగ్లండ్ జట్టు మెంటార్‌గానూ పనిచేశాడు. గతేడాది ది హండ్రెడ్‌తో పొట్టి ఫార్మాట్లో గతేడాది రీఎంట్రీ ఇచ్చాడు ఆండర్సన్. ఐపీఎల్ ఫ్రాంఛైజీ లక్నో సూపర్ జెయింట్స్ యజమాని సంజీవ్ గోయెంకా యాజమాన్యంలోని మాంచెస్టర్ ఒరిజినల్స్‌కు ఆండర్సన్ ప్రాతినిథ్యం వహించాడు.
మొత్తంగా మూడు మ్యాచ్‌లు ఆడి కేవలం రెండు వికెట్లు తీయగలిగాడు. అయితే, తాజా ఎడిషన్ నుంచి ఆండర్సన్ ముందుగానే తప్పుకొన్నాడు. ఇందుకు గల కారణం గురించి తాజాగా మాట్లాడాడు.

ప్రతి క్షణాన్ని నేను ద్వేషిస్తూనే ఉన్నా
‘‘గతేడాది ది హండ్రెడ్ లీగ్‌లో కొనసాగినంత కాలం ప్రతి క్షణాన్ని నేను ద్వేషిస్తూనే ఉన్నాను. ఆ టోర్నీ మొదలుకాగానే.. సెలవుపెట్టి ఎక్కడికైనా వెళ్లిపోతే బాగుండు అనిపించింది. అదొక గొప్ప టోర్నీ. ఇందులో కూడా అనుభవం సంపాదించాలనే జట్టులో చేరాను.
కానీ నాకు ఇది సరైంది కాదు. ముఖ్యంగా లంకాషైర్ కెప్టెన్‌గా నేను చేయాల్సింది చాలా ఉంది. నాలుగు రోజుల మ్యాచ్ ఫార్మాట్ నాకు సెట్ అవుతుంది’’ అని ఆండర్సన్ అన్నాడు. తనకు రెడ్‌బాల్ క్రికెట్‌లోనే అనుభవం, ఆనందం ఉన్నాయని చెప్పకనే చెప్పాడు.
పూర్తిగా న్యాయం చేసేందుకే
కాగా 43 ఏళ్ల ఆండర్సన్ కౌంటీ చాంపియన్‌షిప్‌లో భాగంగా లంకాషైర్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. సారథిగా, బౌలర్‌గా లంకాషైర్‌కు పూర్తిగా న్యాయం చేసేందుకే ది హండ్రెడ్ నుంచి వైదొలిగినట్లు సంకేతాలు ఇచ్చాడు. వయసు మీద పడుతున్న తరుణంలో ఫిట్‌నెస్‌పై మరింత దృష్టి సారించాలి కాబట్టే తనకు నచ్చిన ఫార్మాట్‌కే పూర్తిగా అంకితం కావాలనుకుంటున్నట్లు వెల్లడించాడు.
చదవండి: నాకైతే భయం వేస్తోంది: వైభవ్ సూర్యవంశీపై పాక్ మాజీ క్రికెటర్ల వ్యాఖ్యలు


