గ్యాస్ స్టేషన్లో ఫైర్: వారందరూ హీరోలైపోయారు!
చైనాలో ఓ గ్యాస్ స్టేషన్లో మోటార్ సైకిలిస్టు ద్వారా నిప్పంటుకోవడంతో అక్కడ పనిచేసేవారందరూ హీరోలైపోయారు.
గ్యాస్ స్టేషన్లో నిప్పులంటుకున్నాయంటే.. అక్కడ పనిచేసే వర్కర్లందరూ ఒక్కసారిగా షాకుకు గురై పరుగులు పెడతారు. కానీ చైనాలో ఓ గ్యాస్ స్టేషన్లో మోటార్ సైకిలిస్టు ద్వారా నిప్పంటుకోవడంతో అక్కడ పనిచేసేవారందరూ హీరోలైపోయారు. ఎంతో చాకచక్యంగా వ్యవహరించిన ఉద్యోగుల టీమ్ వర్క్ ప్రస్తుతం సోషల్ మీడియా యూజర్ల మన్ననలను పొందుతోంది. వారి చూపించిన ధైర్యసాహసాలకు రివార్డు కింద 65వేల యువాన్లు అంటే 6,11,000 రూపాయలను కూడా అందుకున్నట్టు చైనా గ్లోబల్ టెలివిజన్ నెట్ వర్క్ రిపోర్టు చేసింది. చైనాలోని సిచువాన్ ప్రావిన్స్ యిబిన్ లో మే 4వ తేదీన ఉదయం తొమ్మిది నలభై గంటలకు ఈ అగ్నిప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఓ మోటార్ సైకిలిస్టు తన బైకులో ఆయిల్ నింపిన తర్వాత, ఇంధనం నింపే దగ్గరే మంటలు చెలరేగేలా చేశాడు.. వెంటనే స్పందించిన అక్కడి ఉద్యోగి వెంటనే పెనుముప్పు నుంచి బయటపడేందుకు మంటలను ఆర్పే ప్రయత్నం చేశాడు. ఆ మంటలను ఆర్పే ప్రయత్నంలో ఉండగానే ఆ మోటార్ సైకిలిస్టు బైకును కిందకి పడేసి, మరింత మంటలు చెలరేగేలా చేశాడు.
మంటలు మరింత పైకి ఎగయడంతో అక్కడే ఉన్న ఉద్యోగులందరూ ఏకమై, వాటిని ఆర్పే ప్రయత్నం చేశారు. అదేసమయంలో మోటార్ సైకిలిస్టు ఆ మంటల్లోకి దూకాడు. అతన్ని ఓ వర్కర్ పక్కకు లాగగా.. మిగతా వర్కర్లు మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఓ వ్యక్తి బైకును ఇంధనం నింపే దగ్గర్నుంచి నుంచి పక్కకు లాగేశాడు. ఇలా స్టాఫ్ సభ్యులందరూ చాకచక్యంగా వ్యవహరించిన తీరుతో పెను ముప్పు తప్పింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో పోస్టు అయిన ఈ వీడియోకు మంచి స్పందన వస్తోంది. ఉద్యోగులను అందరూ కొనియాడుతుండగా.. ప్రమాదానికి కారణమైన మోటార్ సైకిల్ వ్యక్తిని తీవ్రంగా విమర్శిస్తున్నారు. ''గ్రేట్ వర్క్! వారి ప్రాణాలను సైతం పణంగా పెట్టి, ఆ వ్యక్తిని, గ్యాస్ స్టేషన్ ను రెండింటినీ కాపాడారు'' అని ఓ కామెంటర్ కొనియాడాడు. స్టాఫ్ సభ్యులందరకు హ్యాట్సాప్ అని మరికొందరు ఫేస్ బుక్ యూజర్లంటున్నారు.