‘కిమ్‌’ కర్తవ్యం?

Kim Jong Un rides white horse up sacred mountain - Sakshi

ఎత్తైన మంచుపర్వతంపై ఉ. కొరియా అధినేత కిమ్‌ గుర్రపు స్వారీ

ప్రపంచం విస్తుపోయే గొప్ప కార్యం సిద్ధంగా ఉందన్న స్థానిక పత్రికలు

సియోల్‌: కొరియన్లకు పవిత్రమైన స్థలం ఉత్తరకొరియాలోని అత్యంత ఎత్తయిన మంచుకొండల మధ్య శ్వేతవర్ణపు అశ్వంపై రాచరికపు ఠీవీని ఒలకబోస్తోన్న ఉత్తర కొరియా నాయకుడు కిమ్‌ జాంగ్‌ ఉన్‌ చిత్రాలు మీడియాలో హఠాత్తుగా దర్శనమిచ్చాయి. ఆ దేశపు కీలక నిర్ణయాల సమయంలో గతంలో కూడా కిమ్‌ ఇలాగే చేయడంతో ఈ చిత్రాల వెనుక మతలబేమిటనేది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. గోధుమ రంగు పొడవాటి కోటులో మంచుకొండల మధ్య కిమ్‌ పోజిచ్చిన స్థలం, ఆయన స్వారీ చేస్తోన్న తెల్లటి గుర్రం కిమ్‌ కుటుంబ రాచరికపు అధికారదర్పాన్ని ప్రదర్శిస్తున్నాయి.

2,750 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ మంచుకొండల ప్రాంతానికి కిమ్‌ రావడం ఇది తొలిసారి కాదు. గతంలో దేశ రాజకీయాలను మలుపుతిప్పే అరుదైన నిర్ణయాలు తీసుకునే సందర్భాల్లో ఈ స్థలాన్ని సందర్శించే అలవాటు కిమ్‌కి ఉంది. మౌంట్‌ పీక్టూ కిమ్‌ జాంగ్‌ ఉన్‌ తండ్రి నివాస స్థలమే కాకుండా ఉత్తర కొరియా విప్లవంలో ఈ స్థలానికి చారిత్రక ప్రాధాన్యత సైతం ఉన్నట్టు బుధవారం విడుదల చేసిన కెసీఎన్‌ఏ రిపోర్టు వెల్లడించింది. దక్షిణ కొరియాతో దౌత్య సంబం«ధాలపై ప్రకటన చేయడానికి కొన్ని వారాల ముందు 2017లో నూతన సంవత్సరం సందర్భంగా మౌంట్‌ పీక్టూని కిమ్‌ సందర్శించారు.

ఆ సందర్భంగా దక్షిణకొరియాతో దౌత్యసంబంధాలకు సంబంధించిన అంశాలను సూచనప్రాయంగా చెప్పారు. అలాగే 2018లో దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్‌ జేయీ ఇన్‌తో కలిసి ఈ ప్రాంతాన్ని సందర్శించారు.  అణ్వస్త్ర ప్రయోగానికి సంబంధించిన బటన్‌ ఎప్పుడూ తన టేబుల్‌పైన సిద్ధంగా ఉంటుందని కిమ్‌ గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. సుదూర లక్ష్యాలను చేరే క్షిపణులను, అణ్వాయుధ పరీక్షలను తలపెట్టబోమన్న కిమ్‌ వాగ్దానాన్ని ఆయన పునరాలోచించవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అమెరికాతో ఉత్తరకొరియా చర్చలు ప్రస్తుతం ప్రతిష్టంభనలో ఉన్నవిషయం తెలిసిందే.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top