సోషల్‌ మీడియా కామెంట్‌.. జాబ్‌ ఫట్‌

Kerala Man In Saudi Fired For Remarks On Sabarimala Row - Sakshi

దుబాయ్‌: శబరిమల వివాదం నేపథ్యంలో మహిళలపై అభ్యంతకర వ్యాఖ్యలు చేసినందుకు భారతీయుడొకరు సౌదీ అరేబియాలో ఉద్యోగం పోగొట్టుకున్నారు. కేరళకు చెందిన దీపక్‌ పవిత్రం.. రియాద్‌లోని లులు హైపర్‌ మార్కెట్‌లో పనిచేస్తున్నాడు. వయసుతో సంబంధం లేకుండా మహిళలందరికీ శబరిమల ఆలయంలోకి  ప్రవేశంపై వివాదం నెలకొన్న నేపథ్యంలో సోషల్‌ మీడియాలో వివక్షాపూరితమైన, అనుచిత వ్యాఖ్యలు చేశాడు. దీనిపై తీవ్రంగా స్పందించిన యాజమాన్యం అతడిని ఉద్యోగం నుంచి తొలగించింది.

‘మతపరమైన విషయాల్లో కించపరిచే వ్యాఖ్యలు చేయడాన్ని అస్సలు సహించం. సోషల్‌ మీడియాను మా సిబ్బంది దుర్వినియోగం చేస్తే కఠినంగా వ్యవహరిస్తామ’ని లులు గ్రూపు కమ్యూనికేషన్స్‌ అధికారి చీఫ్‌ వి నందకుమార్‌ తెలిపారు. అన్ని దేశాల సంస్కృతులను, మత విశ్వాసాలను గౌరవిస్తామని స్పష్టం చేశారు. సోషల్‌ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన ఉద్యోగిపై కఠిన చర్య తీసుకున్నందుకు లులు గ్రూపు అధిపతి యూసుఫ్‌ అలీపై ప్రశంసలు కురుస్తున్నాయి.

ఇదే కారణంతో అంతకుముందు ఒమన్‌లో కేరళకు చెందిన మరో ఉద్యోగిని విధుల నుంచి తొలగించారు. కేరళ వరద బాధితులను అగౌరవపరిచే వ్యాఖ్యలు చేసినందుకు ఈ చర్య తీసుకుంది. అతడు క్షమాపణ చెప్పినప్పటికీ ఒప్పుకోలేదు. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top