అమెరికా చేరుకున్న ఖషోగ్గీ పెద్ద కుమారుడు

Jamal Khashoggi Son Arrives US - Sakshi

వాషింగ్టన్‌ : అనుమానాస్పద రీతిలో మృతి చెందిన వాషింగ్టన్‌ కాలమిస్టు జమాల్‌ ఖషోగ్గీ కుమారుడిని అమెరికాకు పంపించేందుకు సౌదీ ఎట్టకేలకు ఒప్పుకొంది. దీంతో అతడు గురువారం అమెరికాకు చేరుకున్నాడని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. అమెరికా- సౌదీల పౌరసత్వం కలిగి ఉన్న ఖషోగ్గీ కుమారుడు పెద్ద కొడుకు సలా జమాల్‌ ఖషోగ్గీ పాస్‌పోర్టును సౌదీ అధికారులు సీజ్‌ చేశారు. దీంతో గత కొన్ని నెలలుగా అతడు రియాద్‌లోనే ఉంటున్నాడు. ఈ క్రమంలో తండ్రి మరణం తర్వాత కూడా అమెరికా వెళ్లేందుకు అతడికి అనుమతి లభించలేదు. ఈ విషయమై అమెరికా విదేశాంగ అధికారులు మాట్లాడుతూ.. ‘విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో.. సలా పాస్‌పోర్టును పునరుద్ధరించాల్సిందిగా కోరారు. ఇందుకు సౌదీ విదేశాంగ అధికారులు సానుకూలంగా స్పందించారు. సలా ఇక్కడికి రావడం సంతోషంగా ఉందని’ పేర్కొన్నారు. ఖషోగ్గీ హత్య కేసులో సౌదీ చుట్టూ ఉచ్చు బిగుస్తున్న నేపథ్యంలోనే సౌదీ అమెరికా కోరిన విధంగా ప్రవర్తిస్తున్నట్లు తెలుస్తోంది.

కాగా సౌదీ జాతీయుడైన జర్నలిస్టు టర్కీలో ఉన్న సౌదీ ఎంబసీలో అత్యంత దారుణంగా హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఇస్తాంబుల్‌కు చెందిన పీహెచ్‌డీ స్కాలర్‌ హేటీస్‌ సెనీజ్‌ అనే మహిళను పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్న సమయంలోనే ఆయన హత్యకు గురయ్యారు. అయితే గతంలో ఇది వరకే ఆయనకు మూడు పెళ్లిళ్లు అయ్యాయి. మొదటి భార్య ద్వారా ఆయనకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు కలిగారు. వీరిలో ముగ్గురికి అమెరికా పౌరసత్వం ఉంది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top