జాకబ్‌ జుమా రాజీనామా

Jacob Zuma resigns as South Africa's President, mired in corruption scandal - Sakshi

దక్షిణాఫ్రికా నూతన అధ్యక్షుడిగా రామాఫోసా

జోహన్నెస్‌బర్గ్‌: దక్షిణాఫ్రికా అధ్యక్షుడు జాకబ్‌ జుమా ఎట్టకేలకు తన పదవికి రాజీనామా చేశారు. దీంతో అధికార ఆఫ్రికన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ (ఏఎన్‌సీ), జుమాకు మధ్య ఏర్పడిన ప్రతిష్టంభనకు తెరపడింది. ఆయన రాజీనామా చేయకపోతే ప్రతిపక్ష పార్టీలతో కలసి పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం పెట్టి జుమాను గద్దె దించాలని అధికార పార్టీ భావించడం తెల్సిందే.

ఏఎన్‌సీ జాతీయ నాయకత్వం మూడు రోజుల పాటు జరిపిన చర్చల్లో జుమా రాజీనామా చేయాల్సిందిగా కోరింది. అందుకు ఆయన నిరాకరిస్తూ వచ్చారు. అనూహ్యంగా బుధవారం రాత్రి మీడియా సమావేశం ఏర్పాటు చేసి తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు జుమా ప్రకటించారు.  దీంతో 9 ఏళ్ల జుమా పాలనకు తెరపడింది. దాదాపు 30 నిమిషాల పాటు ఆయన ప్రసంగించారు.  కాగా, బుధవారం ఓ టీవీ చానల్‌లో ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..  అసలు తాను రాజీనామా చేసేందుకు పార్టీ నాయకత్వం ఎలాంటి కారణాలను తనకు చూపలేదని చెప్పారు.

అధ్యక్ష స్థానంలో సిరిల్‌ రామాఫోసాను కూర్చోబెట్టాలని ఏఎన్‌సీ తీసుకున్న నిర్ణయాన్ని ఆయన వ్యతిరేకించారు. జాకబ్‌ జుమా రాజీనామా నేపథ్యంలో దక్షిణాఫ్రికా నూతన అధ్యక్షుడిగా ప్రస్తుత ఉపాధ్యక్షుడు సిరిల్‌ రామాఫోసా ఏకగ్రీవంగా ఎన్నిక య్యారు. గురువారం జరిగిన పార్లమెంటు సమావేశంలో ఆయన ఎన్నికైనట్లు ప్రకటన వెలువడింది. ఆఫ్రికన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా 65 ఏళ్ల రామాఫోసా రెండు నెలల కిందటే ఎన్నికయ్యారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top