
కరోనా వైరస్.. చైనాలో పుట్టి ప్రపంచమంతా విస్తరిస్తూ 100కు పైగా దేశాలు గజగజ వణికిస్తోన్న విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని ప్రపంచ ఆరోగ్యసంస్థ కూడా వెల్లడించింది. ఈ ప్రాణాంతక వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే దాదాపు 3800 మందికి పైగా మృత్యువాత పడగా.. లక్షలాది మంది కరోనా లక్షణాలతో బాధపడుతున్నారు. దీంతో ప్రపంచ దేశాలు ముందు జాగ్రత్తగా వ్యవహరిస్తూ అప్రమత్తమవుతున్నాయి. వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ఉన్న అన్ని ప్రయత్నాలను చేస్తున్నారు. చదవండి: కోవిడ్: ఇరాన్ నుంచి 58 మంది వచ్చేశారు!
చైనా తరువాత కరోనా వైరస్ అత్యంత ప్రభావం చూపుతున్న దేశాలు ఇటలీ, ఇరాన్. దీంతో ఇటలీ ప్రభుత్వం మరో అడుగు ముందుకేసి దేశ ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావాలని నిబంధన విధించింది. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరించింది. అత్యవసరమైతే తప్ప ఎటువంటి ప్రయాణాలు పెట్టుకోవద్దని ఇటలీ ప్రభుత్వం దేశ ప్రజలను ఆంక్షలు విధించింది. రెండు రోజుల క్రితం వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న ప్రదేశాల్లో మాత్రమే అమలు చేసిన ఈ నిర్ణయం ఇప్పుడు దేశ వ్యాప్తంగా అమలుపరుస్తోంది. దీంతో దాదాపు ఆరు కోట్లకు పైగా జనాభా ఉన్న ఇటలీ ప్రజలు స్వచ్చందంగా నిర్భందంలో ఉండనున్నారు. కాగా ఇప్పటికే ఇటలీలో 9,712 కరోనా కేసులు నమోదు కాగా... మృతుల సంఖ్య 463కు చేరుకుంది. చదవండి: ‘ఇంత చెత్తగా ఎలా ప్రవర్తిస్తున్నావు’