ఐసిస్‌ చీఫ్‌ హతం: ప్రత్యక్షంగా వీక్షించిన ట్రంప్‌!

ISIS Baghdadi Death US Forces Launched Dangerous Nighttime Raid - Sakshi

వాషింగ్టన్‌ : ‘అతడు హీరోలా కాదు. ఓ పిరికిపందలా ఏడుస్తూ.. భయంతో కేకలు వేస్తూ చచ్చాడు’ . సిరియాలో నరమేధానికి కారణమైన ఇస్లామిక్‌ స్టేట్‌ చీఫ్‌ అబు బాకర్‌ అల్‌- బాగ్దాదీని అగ్రరాజ్య సైన్యాలు మట్టుబెట్టిన అనంతరం అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ చేసిన వ్యాఖ్య ఇది. తమ సైన్యానికి చెందిన కుక్కలు వెంబడించడంతో ఓ టన్నెల్‌లోకి పరిగెత్తిన బాగ్దాదీ తనను తాను పేల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆయన విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. బాగ్దాదీపై దాడి చేసి రాత్రి వేళలో అత్యంత ప్రమాదకర పరిస్థితుల మధ్య తమ సైన్యం అతడిని హతం చేసిందని పేర్కొన్నారు. కాగా సిరియాతో పాటు ప్రపంచాన్ని గడగడలాడించిన ఐఎస్‌ ఉగ్రమూక చీఫ్‌ బాగ్దాదీని అంతమొందించడానికి అమెరికా ఐదేళ్లుగా వేచిచూస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పక్కా ప్లాన్‌తో బాగ్దాదీని హతమార్చినట్లు ట్రంప్‌ పేర్కొన్నారు. ఇక బాగ్దాదీపై తమ సైనికులు విరుచుకుపడిన తీరును ట్రంప్‌ సహా అమెరికా భద్రతా సంస్థ సీనియర్‌ అధికారులు సిట్యూవేషన్‌ రూంలో నుంచి ప్రత్యక్షంగా వీక్షించినట్లు సమాచారం. 

రెండు రోజుల ముందే స్కెచ్‌ వేసి...
పిల్లలు, మహిళల పట్ల అత్యంత అమానుషంగా ప్రవర్తించిన బాగ్దాదీని చంపే ఆపరేషన్‌కు అమెరికా అధికారులు కైలా ముల్లర్‌ అని నామకరణం చేశారు. సిరియాలో పనిచేస్తున్న సమయంలో అమెరికా సామాజిక కార్యకర్త కైలాను బాగ్దాదీ కిడ్నాప్‌ చేశాడు. అనంతరం ఆమెపై అత్యంత క్రూరంగా అనేకమార్లు అత్యాచారానికి పాల్పడి హత్య చేశాడు. ఈ నేపథ్యంలో ఆపరేషన్‌కు కైలా మ్యూలర్‌ అని పేరుపెట్టిన అధికారులు గురువారం నుంచే బాగ్దాదీని హతం చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. అంతేకాదు ఈ విషయాన్ని అత్యంత గోప్యంగా ఉంచడంలోనూ సఫలీకృతమయ్యారు. శుక్రవారం తన కూతురు, సలహాదారు ఇవాంక ట్రంప్‌ వివాహ వార్షికోత్సవాన్ని జరపడం కోసం ట్రంప్‌ క్యాంప్‌ డేవిడ్‌కు వెళ్లారు. అనంతరం వెంటనే వర్జీనియాకు పయనమై మిలిటరీ ఆపరేషన్స్‌కు సంబంధించిన ఫైళ్లను ఆయన పరిశీలించారు. తర్వాత బేస్‌బాల్‌ మ్యాచ్‌ వీక్షించేందుకు వెళ్లారు. ఈ క్రమంలో శనివారం ఉదయం ఆపరేషన్‌కు సంబంధించిన ప్రక్రియ మొత్తం పూర్తైంది.

సీక్రెట్‌ ఆపరేషన్‌ సాగిందిలా..
ఆదివారం వేకువ జామున అమెరికా సైన్యానికి చెందిన ఎనిమిది హెలికాప్టర్లు ఉత్తర ఇరాక్‌ నుంచి బయల్దేరాయి. సిరియాలోని ఇడ్లిబ్‌ ప్రావిన్స్‌లో బాగ్దాదీ ఉన్నాడన్న సమాచారంతో మిడిల్‌ ఈస్ట్‌లో ప్రవేశించాయి. ఇరాక్‌, టర్కీ, రష్యా అధికారులతో సమన్వయమై ఆపరేషన్‌కు సంబంధించిన వివరాలేవీ చెప్పకుండానే గగనతలాన్ని అదుపులోకి తెచ్చుకోవాలని అమెరికా అధికారులు సూచించారు. బాగ్దాదీ ఉన్న ప్రాంతానికి చేరుకోగానే అమెరికా సైన్యానికి చెందిన రోటార్‌ సీహెచ్‌-47 విమానాలు రెండు అల్‌- అసద్‌ ఎయిర్‌బేస్‌ కేంద్రంగా బుల్లెట్ల వర్షం కురిపించాయి. ఈ క్రమంలో తన చావు ఖాయమని భావించిన బాగ్దాదీ తమ అండర్‌ గ్రౌండ్‌ బంకర్లలోకి వెళ్లి తల దాచుకున్నాడు. అంతేకాదు అమెరికా సైనికులు తనను సమీపిస్తున్న క్రమంలో ఆత్మాహుతి దాడి జాకెట్‌ ధరించి ముగ్గురు అమాయక పిల్లల్ని తన వెంట తీసుకువెళ్లాడు. అయితే అమెరికా సైన్యానికి చెందిన జాగిలాలు బాగ్దాదీని వెంబడించడంతో బంకర్‌ టన్నెల్‌ చివరికి చేరగానే తనను తాను పేల్చుకున్నాడు. ఈ ఘటనలో బాగ్దాదీతో పాటు ముగ్గురు చిన్నారులు కూడా చనిపోయారు.(చదవండి : ఐసిస్ చీఫ్‌ బాగ్దాదీని పట్టించింది అతడే!)

చచ్చింది అతడే..
బంకర్‌ పేలిపోవడంతో బాగ్దాదీ హతమైనట్లు గుర్తించిన అమెరికా సైన్యం.. చనిపోయింది బాగ్దాదీ అన్న విషయాన్ని ధ్రువీకరించేందుకు అతడి ఆనవాళ్లు సేకరించారు. ముక్కలైన మృతదేహం నుంచి ఫోరెన్సిక్‌ అధికారులు డీఎన్‌ఏ సేకరించి పరీక్షించగా అది బాగ్దాదేనన్న విషయం స్పష్టమైంది. ఈ విషయం గురించి ట్రంప్‌ మాట్లాడుతూ.. ‘ చచ్చింది అతడే. 15 నిమిషాల్లోనే ఫోరెన్సిక్‌ అధికారులు ఈ విషయాన్ని ధ్రువీకరించారు. రెండు గంటల పాటు శ్రమించిన తర్వాత బాగ్దాదీని మట్టుబెట్టి మా సైనికులు ఐసిస్‌కు సంబంధించిన సున్నిత సమాచారాన్ని, ఉగ్రవాదుల తదుపరి ప్రణాళికల గురించి వివరాలు సేకరించారు’ అని పేర్కొన్నారు. కాగా అమెరికా సైన్యం సిరియాలో బాగ్దాదీని అంతం చేసిన వెంటనే అమెరికా ఫైటర్‌ జెట్లు ఆరు రాకెట్లను ఆకాశంలోకి వదిలి తమ విజయాన్ని ప్రపంచానికి తెలియజేశారు.

ఈసారి లీక్‌ అవ్వలేదు..
ఒసామా బిన్‌లాడెన్‌ తరహాలోనే బాగ్దాదీని కూడా అంతమొందించామన్న ట్రంప్‌ ఈసారి మాత్రం తమ ప్రణాళికలు ఏమాత్రం బయటకు పొక్కలేదని వ్యాఖ్యానించారు. ‘ వాషింగ్టన్‌ లీకింగ్‌ మెషీన్‌. అయితే ఇప్పుడు లీకులు బయటికి రాలేదు. నేను రచించిన వ్యూహం కొంతమందికి మాత్రమే తెలుసు. ఇది అమెరికా అతిపెద్ద విజయం అని పేర్కొన్నారు. ఇక బాగ్దాదీని హతం చేయడం పట్ల ట్రంప్‌ మద్దతుదారులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ‘ ప్రపంచంలోనే నెంబర్‌ వన్‌ ఉగ్రవాదిని అంతమొందించి అమెరికాను సురక్షితంగా ఉంచడంలో సఫలమయ్యారు’ అంటూ క్యాంపెయిన్‌ నిర్వహిస్తున్నారు. ఏది ఏమైనా ఐసిస్‌ వంటి క్రూరమైన ఉగ్రమూకను నడిపిస్తున్న బాగ్దాదీని మట్టుబెట్టి అమెరికా ఉగ్రవాదులకు గట్టి హెచ్చరిక జారీ చేసిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక మరోవైపు ట్రంప్‌ ఎన్నికల వ్యూహంలో ఇదొక ఎత్తుగడ అని.. అందుకే ఎవరికీ సమాచారం ఇవ్వకుండా రహస్యంగా ఆపరేషన్‌ నిర్వహించారని ఆయన ప్రత్యర్థులు విమర్శిస్తున్నారు. కాగా 2020లో అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top