హలో..నేనండీ.. చిట్టిపొట్టి చీమను..  | Indonesian macro photographer Echo Adianto Photo was this | Sakshi
Sakshi News home page

హలో..నేనండీ.. చిట్టిపొట్టి చీమను.. 

Jul 18 2018 3:03 AM | Updated on Jul 18 2018 3:03 AM

Indonesian macro photographer Echo Adianto Photo was this - Sakshi

ఆ రాజుగారి ఏడుగురు కొడుకులు వేట కెళ్లిన కథలో.. పుట్టలో వేలు పెడితే నే కుట్టనా అన్న చీమను నేనే.. అంతేకాదు.. చిన్నప్పుడు మీ పుస్తకాల్లో కష్టజీవి, సంఘజీవి అంటూ పొగడ్తల వర్షం కురిపించిన చీమను కూడా నేనే.. మీకు తెలుసుగా.. మేము మా బరువు కంటే 100 రెట్లు ఎక్కువ బరువును మోయగలమని.. అయితే.. అలా మోసినప్పుడు మీరు ఎప్పుడైనా చూశారా? ఇదిగో ఇప్పుడు చూసేయండి. మావోడు ఇచ్చిన స్టిల్‌ చూస్తుంటే.. బాడీ బిల్డింగ్‌ పోటీలకు ప్రిపేర్‌ అవుతున్నట్లు కనిపిస్తోంది కదూ.. ఈ చిత్రాన్ని ఇండోనేసియాకు చెందిన మాక్రో ఫొటోగ్రాఫర్‌ ఎకో అడియాంటో తీశారు.

ఆయన సూక్ష్మ చిత్రాలు తీయడంలో ప్రసిద్ధుడు. మా కండబలాన్ని ప్రదర్శిస్తూ.. మాకంటే ఎంతో బరువైన పండును నెత్తిన బాలెన్సింగ్‌ చేస్తూ.. తీసుకొస్తున్న చిత్రాలను ఆయన భలేగా తీశారు. ఎలాగూ వచ్చాను కాబట్టి.. మా గురించి ఓ నాలుగు ముక్కలు చెప్పి పోతాను.  

మా అంత బలం మనుషులకుంటే.. వారు ఏకంగా 4 వేల కిలోల బరువును ఎత్తేయగలరు. చీమలు మీకంటే ముందు నుంచే అంటే.. ఈ భూమ్మీద 13 కోట్ల ఏళ్ల నుంచీ ఉన్నాయి.. అంతేకాదు.. ఈ భూమ్మీద ఉన్న మొత్తం చీమల బరువు.. 700 కోట్ల మంది మనుషుల బరువుతో సమానం. అంటార్కిటికా.. గ్రీన్‌లాండ్‌.. కొన్ని సుదూర ద్వీపాల్లో తప్పిస్తే.. మేం అన్నిచోట్లా ఉన్నాం. మాకు రెండు పొట్టలు ఉంటాయి.. ఒకటి మేం తిన్నది జీర్ణం చేసుకోవడానికి.. మరొకటి ఆహారాన్ని నిల్వ చేయడానికి.. మాకు ఊపిరితిత్తులు ఉండవు. చిన్నచిన్న రంధ్రాల ద్వారా ఆక్సిజన్‌ మా శరీరంలోకి వెళ్తుంది. మాలో కొన్ని చీమల జాతులు కొన్నివారాల పాటు బతికితే.. మా రాణులు 30 ఏళ్ల వరకూ బతుకుతాయి. చెప్పింది చాలు.. చాలా పనుంది.. ఇక ఉంటా మరి..  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement