అత్యంత ప్రమాదకర స్వైన్‌ ఫ్లూ.. ఆందోళనలో శాస్త్రవేత్తలు

Highly Infectious Swine Flu Found in China - Sakshi

బీజిగ్‌: ఓ వైపు కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతుండగానే.. మరో కొత్త రకం స్వైన్‌ ఫ్లూ వైరస్‌ ఒకటి ప్రస్తుతం చైనాను కలవరపెడుతోంది. ఇది‌ గతంలో విస్తరించిన స్వైన్‌ ఫ్లూ వైరస్‌ కంటే ఎంతో ప్రమాదకరమైనదని.. అంటువ్యాధిగా మారే లక్షణాలు కలిగి ఉందని అమెరికా సైన్స్ జర్నల్ పీఎన్‌ఏఎస్‌ సోమవారం ప్రచురించింది. జీ4 అని పిలువబడే ఇది జన్యుపరంగా 2009లో స్వైన్‌ ఫ్లూకు కారణమైన హెచ్‌1ఎన్‌1 జాతి నుంచి వచ్చిందని నివేదిక వెల్లడించింది. ఇది మానవులకు సోకడానికి అవసరమైన అన్ని లక్షణాలను కలిగి ఉందని చైనా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు, చైనా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ అధికారులు వెల్లడించారు. (చైనా ప్రాజెక్టులకు కరోనా సెగ)

పరిశోధకులు 2011 నుంచి 2018 వరకు 10 చైనా ప్రావిన్సులు, పశువైద్య ఆస్పత్రులు, కబేళాలలో పందుల నుండి 30,000 వేల స్వాబ్స్‌ను సేకరించి పరిశోధనలు జరిపారు. దాదాపు 179 స్వైన్ ఫ్లూ వైరస్‌లను ఐసోలేట్‌ చేసినట్లు తెలిపారు. అయితే 2016 నుంచి కొత్త రకం వైరస్‌ ఒకటి పందులలో బాగా అభివృద్ధి చెందినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. దీని గురించి తెలుసుకోవడానికి పరిశోధకులు ఫెర్రోట్స్‌తో సహా పలు ప్రయోగాలు చేశారు. ప్లూ పరిశోధనల్లో ఈ ఫెర్రోట్స్‌ టెస్ట్‌ను బాగా ఉపయోగిస్తారు. ఎందుకుంటే ఈ వ్యాధి సోకిన వారిలో జలుబు, జ్వరం, దగ్గు లక్షణాలే కనపడతాయి. అయితే తాజాగా గుర్తించిన జీ4 చాలా ప్రమాదకరమైన అంటువ్యాధిగా మారే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఫెర్రెట్ల కంటే తీవ్రమైన లక్షణాలు కలిగి ఉందని తెలిపారు. సాధారణ ఫ్లూ నుంచి మానవుల్ని రక్షించే రోగనిరోధక శక్తి ఈ జీ4 నుంచి కాపాడలేదని పరీక్షలు తెలుపుతున్నాయన్నారు. (చైనాకు పాశ్చాత్య సెగ)

ఇప్పటికే 4.4 శాతం మంది జనాభా ఈ జీ4 బారిన పడినట్లు పరీక్షల్లో తేలిందన్నారు శాస్త్రవేత్తలు. అంతేకాక ఈ వైరస్ జంతువుల నుంచి మానవులకు వ్యాపించినట్లు గుర్తించామన్నారు. అయితే ఇది మానవుడి నుంచి మానవునికి వ్యాపిస్తుందనే దానిపై ఇంకా స్పష్టమైన ఆధారాలు లభించలేదన్నారు. ఒకవేళ జీ4 వైరస్ మానవుల్లో ఒకరి నుంచి ఇతరులకు వ్యాపిస్తే.. మహమ్మారిగా మారే ప్రమాదం అధికంగా ఉందన్నారు. కనుక పందులతో పని చేసేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని శాస్త్రవేత్తలు కోరారు. ‘జూనోటిక్ రోగకారకాలు రోజురోజుకు అభివృద్ధి చెందుతుండటంతో మానవులు నిరంతరం ప్రమాదంలో ఉన్నారు. వన్యప్రాణుల కంటే కూడా మానవులకు ఎక్కువ సంబంధం ఉన్న వ్యవసాయ జంతువుల నుంచి ఈ మహమ్మారి వైరస్‌లు ఎక్కువ వ్యాప్తి చెందుతుండటం ఆందోళన కలిగిస్తున్నది’ అని అని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో వెటర్నరీ మెడిసిన్ విభాగం చీఫ్‌గా పని చేస్తున్న జేమ్స్ వుడ్ తెలిపారు. వైరస్‌ జంతువు నుంచి మానవులకు వ్యాప్తి చెందటాన్ని జూనోటిక్ ఇన్ఫెక్షన్ అంటారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top