ఇక్కడ తలరాత మారుస్తారు!

Hair bank for hair growth in future - Sakshi

హెయిర్‌ బ్యాంకు.. ఈ బ్యాంకు పేరెప్పుడూ వినలేదు కదూ.. మామూలు బ్యాంకులేం చేస్తాయి.. మా దగ్గర మీ డబ్బులు దాచుకోండి.. భవిష్యత్తులో అవి ఎన్నో రెట్లు పెరిగి మీకు ఉపయోగపడతాయి అంటాయి.. అంతేగా.. ఈ హెయిర్‌ బ్యాంకు కూడా డిటోనే. కాకపోతే.. మూమూలు బ్యాంకుల్లో డబ్బులు దాస్తాం.. ఇక్కడ మన జుట్టు దాస్తాం.. అంతే.. తేడా.. మిగతాదంతా సేమ్‌టుసేమ్‌..

ఇంతకీ ఎందుకు?
ఎందుకేంటి.. ఈ ప్రపంచంలో ధనిక పేదా తేడా లేకుండా దిగులుతో తల్లడిల్లిపోయే సమస్య ఒకే ఒక్కటి.. అదే.. బట్టతల.. నిజానికి వెంట్రుకలు ఏర్పడేందుకు హెయిర్‌ ఫాలికిల్స్‌ కింది భాగంలో ఉండే డెర్మల్‌ పాపిల్లా అనే కణాలు కీలక పాత్ర పోషిస్తాయి. ఇది చర్మంలోని భాగం. వయసు పెరుగుతున్న కొద్దీ హెయిర్‌ ఫాలికిల్స్‌.. ఈ డెర్మల్‌ పాపిల్లా కణాల నుంచి వేరుపడుతాయి. దీంతో ఫాలికిల్‌ చిన్నగా అయిపోవడంతో వెంట్రుకలు చిన్నగా అయిపోవడం.. ఎదుగుదల లేకపోవడం జరుగుతుంటుంది. అంటే వెంట్రుకల ఎదుగుదలలో ఈ డెర్మల్‌ పాపిల్లా కణాలు చాలా ముఖ్య పాత్ర పోషిస్తాయన్న విషయం అర్థమైంది కదా.. సరిగ్గా ఇక్కడే పరిశోధకులు దృష్టి సారించి పరిశోధనలు సాగించారు. హెయిర్‌ బ్యాంకుగా పేర్కొంటున్న ఈ ప్రక్రియకు బ్రిటన్‌ అధికారులు తాజాగా అనుమతులిచ్చారు.

ఇక్కడేం చేస్తారు..
ముందుగా ఎవరైనా వ్యక్తికి చెందిన డెర్మల్‌ పాపిల్లా కణాలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే.. దాదాపు 100 కణాలను తీసుకుని బ్యాంకులో భద్రపరుస్తారు. ఈ కణాలు పాడవకుండా ఉండేందుకు ‘క్రయోప్రిజర్వ్‌’పద్ధతి ద్వారా దాదాపు మైనస్‌ 180 సెల్సియస్‌ డిగ్రీ ఉష్ణోగ్రత వద్ద ఎంత కాలం అంటే అంతకాలం దాచి ఉంచుతారు. కణాలను వేరు చేసే ప్రక్రియకే దాదాపు రూ.1.8 లక్షలు వసూలు చేయనున్నారు. ఆ తర్వాత భద్రపరిచినందుకు ఏటా దాదాపు రూ.9 వేలు చెల్లించాల్సి ఉంటుంది. ఇలా దాచి ఉంచినందుకు దాదాపు రూ.1.8 లక్షలు ఖర్చు అవుతుంది. ఆ తర్వాత ఆ వ్యక్తికి ఎప్పుడైనా భవిష్యత్తులో వెంట్రుకలు ఊడిపోతున్నా.. బట్టతల వచ్చినా ఆ బ్యాంకుకు వెళ్తే చాలు సమస్య పరిష్కారం అయినట్లే. ఎందుకంటే ఒక్క డీపీ కణం నుంచి చాలా చాలా డీపీ కణాలను క్లోనింగ్‌ ప్రక్రియ ద్వారా అభివృద్ధిపరచవచ్చు. ఇలా క్లోనింగ్‌ ద్వారా ఏర్పడిన కణాలను తలమీది చర్మంలోకి ఇంజెక్షన్‌ ద్వారా ఎక్కిస్తారు. అప్పుడు ఆ కణాల నుంచి హెయిర్‌ ఫాలికిల్స్‌ ఏర్పడి.. వాటి నుంచి ఒత్తయిన జట్టు పెరుగుతుంది. 18 ఏళ్ల వయసు దాటిన ప్రతి ఒక్కరికి ఈ కణాలను దాచిపెట్టుకునే అవకాశం ఉంటుంది. యుక్త వయసు రాగానే ఈ కణాలను బ్యాంకులో దాచిపెట్టుకుంటే మరీ మంచిదని ఈ పరిశోధనల్లో పాలుపంచుకున్న డాక్టర్‌ ఫర్జో వివరించారు. ఈ వెంట్రుకల బ్యాంకు కాన్సెప్ట్‌ను అమలు చేసేందుకు బ్రిటన్‌ హ్యూమన్‌ టిష్యూ అథారిటీ.. హెయిర్‌ క్లోన్‌ అనే బయోటెక్నాలజీ కంపెనీకి తాజాగా అనుమతులిచ్చింది. 

పాతవాటికి కొత్తదానికి తేడా?
బట్ట తల వచ్చినప్పుడు.. ప్యాచ్‌ సిస్టమ్‌ లేదా హెయిర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ (పీఆర్‌పీ)చేయించుకుంటారు. మొదటి విధానంలో వెంట్రుకలను తలపై భాగంలో అతికిస్తారు. రెండో విధానంలో మాత్రం మన రక్తాన్ని తీసుకుని సెంట్రిఫ్యూజ్‌ చేసి ప్లేట్‌లెట్‌ రిచ్‌ ప్లాస్మాను వేరుచేస్తారు. దీన్ని వెంట్రుకలు ఎదగాల్సిన చోట ఇంజెక్షన్‌ ద్వారా ఎక్కిస్తారు. కానీ హెయిర్‌ బ్యాంకు ప్రక్రియ ద్వారా నేరుగా ఆరోగ్యవంతమైన మన డెర్మల్‌ పాపిల్లా కణాలను ఉపయోగించి, సహజసిద్ధంగా వెంట్రుకలు పెరిగేలా చేయొచ్చు. ఈ విధానంలోని వెంట్రుకలు ఉన్న చోట కొంత చర్మాన్ని ముందుగా తీసుకుంటారు తర్వాత అందులోని హెయిర్‌ ఫాలికిల్స్‌ను తీసుకుని, అందులో ఉన్న డెర్మల్‌ పాపిల్లాను వేరు చేస్తారు. ఆ పాపిల్లా కణాలను చాలా తక్కువ ఉష్ణోగ్రత వద్ద భద్రపరుస్తారు. అయితే ఈ విధానం వల్ల సైడ్‌ ఎఫెక్టులు తక్కువగా ఉండటమే కాకుండా.. వెంట్రుకలు పెరుగుతాయనేందుకు గ్యారంటీ కూడా ఉంటుందట.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top