కొత్త గ్రీన్‌ కార్డులకు బ్రేక్‌

Green Card issuance suspension 60 days Says President Donald Trump  - Sakshi

వలసలపై 60 రోజులు నిషేధం

కొన్ని మినహాయింపులుంటాయి: ట్రంప్‌

వాషింగ్టన్‌: కోవిడ్‌ నేపథ్యంలో అమెరికన్ల ప్రయోజనాలకు పెద్ద పీట వేస్తూ వలసలపై తాత్కాలిక నిషేధం విధిస్తామని ప్రకటించిన అధ్యక్షుడు  డొనాల్డ్‌ ట్రంప్‌ అది రెండు నెలలపాటు ఉంటుందని స్పష్టం చేశారు. అమెరికాలో శాశ్వత నివాసం కోసం ఉద్దేశించే గ్రీన్‌ కార్డుల జారీని ఈ రెండు నెలలు నిలిపివేస్తామని వెల్లడించారు. వలసదారులపై 60 రోజుల నిషేధం విధిస్తూ కార్యనిర్వాహక ఉత్తర్వులపై బుధవారం సంతకం చేస్తానని ట్రంప్‌ చెప్పారు. ‘కరోనా మహమ్మారితో 2 కోట్ల మందికి పైగా అమెరికన్లు ఉద్యోగాలు కోల్పోయారు.

విదేశీయుల్ని వారి స్థానంలో ఉద్యోగాల్లో తీసుకుంటే మన పౌరులకు అన్యాయం జరుగుతుంది. అలా జరగనివ్వం’అని ట్రంప్‌ అన్నారు. అమెరికాలో శాశ్వత నివాసం కోసం ఉండాలని వచ్చే వారి వలసలకే అడ్డుకట్ట వేస్తామని చెప్పారు. అమెరికాలో శాశ్వత నివాసం కోసం దరఖాస్తు చేసుకునే వారెవరినీ రెండు నెలలు ఇక్కడ అడుగు పెట్టనిచ్చే పరిస్థితి లేదని తేల్చి చెప్పారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ గాడిలో పడ్డాక ఈ ఉత్తర్వుల్ని సమీక్షిస్తామన్నారు. ‘అమెరికా పౌరుల ప్రయోజనాలను పరిరక్షించడం మన బాధ్యత.

ఈ రెండు నెలల తర్వాత ఆర్థిక పరిస్థితుల్ని నిపుణుల కమిటీ అంచనా వేసిన తర్వాత దానిని పొడిగించాలా, మార్పులు చేయాలా ఆలోచిస్తాం’’అని ట్రంప్‌ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న చట్టం ప్రకారం ప్రతీ ఏడాది అక్కడ ఉద్యోగాలు చేస్తూ స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలని అనుకునేవారికి లక్షా 40 వేల గ్రీన్‌ కార్డులను ఒక్కో దేశానికి 7శాతం వాటా చొప్పున మంజూరు చేస్తూ ఉంటుంది. కాంగ్రెషనల్‌ రీసెర్చ్‌ సర్వీసు (సీఆర్‌ఎస్‌) అంచనాల ప్రకారం విదేశీ వర్కర్లు, వారి కుటుంబసభ్యులు 10 లక్షల మంది గ్రీన్‌ కార్డు కోసం ఎదురు చూస్తున్నారు. భారతీయు ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు 5,68,414 మంది వరకు గ్రీన్‌ కార్డు కోసం ఎదురుచూస్తున్నారని సీఆర్‌ఎస్‌ అంచనా. ట్రంప్‌ నిర్ణయంతో ఇక గ్రీన్‌ కార్డు వస్తుందా రాదా అన్న అయోమయంలో అక్కడి భారతీయులు ఉన్నారు.  

న్యాయస్థానంలో చెల్లుతుందా ?
అమెరికాకి పూర్తిగా వలసలు నిషేధించే అధికారం అధ్యక్షుడికి ఉండదని కొందరు న్యాయనిపుణులు చెబుతున్నారు. ట్రంప్‌ నిర్ణయాన్ని న్యాయ స్థానంలో సవాల్‌ చేయవచ్చునని అమెరికన్‌ సివిల్‌ లిబర్టీస్‌ యూనియన్‌ డిప్యూటీ పాలసీ డైరెక్టర్‌ ఆండ్రూ ఫ్లోర్స్‌ చెప్పారు. నవంబర్‌లో అధ్యక్ష ఎన్నికలు ఉన్న నేపథ్యంలో కరోనా కట్టడిలో తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ట్రంప్‌ వలసల అంశాన్ని ఎత్తుకున్నారని డెమోక్రాట్లు డొనాల్డ్‌ ట్రంప్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు.

హెచ్‌1బీపై ఉత్తర్వులు?
అమెరికా నిర్ణయంతో ప్రభావితమయ్యే వారు, భారత్‌ టెక్కీలు అత్యధికంగా కలిగి ఉన్న హెచ్‌1బీ వీసాలపై అధ్యక్షుడు విడిగా ఉత్తర్వులు ఇచ్చే అవకాశం ఉందని వైట్‌హౌస్‌ పాలనాయంత్రాంగం అధికారి చెప్పారు. ఈ వలసల నిషేధంలో కొన్ని మినహాయింపులు ఉంటాయని ట్రంప్‌ స్పష్టం చేశారు. అయితే ఆ మినహాయింపులేమిటో ఆయన వివరించలేదు. ‘‘అమెరికాకి పూర్తిగా వలసల్ని నిషేధించం. కొందరికి మినహాయింపులుంటాయ్‌. మానవత్వ అంశాలను కూడా ప్రాతిపదికగా తీసుకుంటాం’’అని ట్రంప్‌ చెప్పారు. కరోనా సంక్షోభ సమయంలో ఆహారం పంపిణీ చేసేవారికి మిహాయింపులిచ్చే అవకాశం ఉంటుందని తెలుస్తోంది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top