కొలంబోలో మళ్లీ పేలుడు..

Fresh blast in Colombo, Van parked near St Anthony Church explodes - Sakshi

కొలంబో: శ్రీలంక చిగురుటాకులా వణుకుతోంది. ఓవైపు భద్రతా బలగాలు జల్లెడ పడుతుండగా.. మరోవైపు బాంబులు పేలుతూనే ఉన్నాయి. తాజాగా కొలంబోలో మరో పేలుడు సంభవించింది. స్థానిక సవోయ్ థియేటర్ వద్ద ఉగ్రవాదులు డియో బైక్‌లో బాంబులు అమర్చి పేల్చేశారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. బైక్ అనుమానాస్పదంగా పార్క్ చేసి ఉన్నప్పటికీ.. ఎవరూ గుర్తించకపోవడం భద్రతా లోపాన్ని స్పష్టంచేస్తోంది. ఐసిస్ ఈసారి బహిరంగ ప్రదేశాల్లో పేలుళ్లకు ప్లాన్ చేసిందని అమెరికా నిఘా వర్గాలు శ్రీలంక ప్రభుత్వానికి సమాచారం అందించాయి.  అమెరికన్ ఇంటలిజెన్స్ సమాచారం ఇచ్చినట్టుగానే.. ఉదయం 10.50గంటల సమయంలో సవోయ్ థియేటర్ ఎదుట పేలుడు సంభవించింది. పేలుడు దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. న్యూజిలాండ్‌లోని క్రైస్ట్ చర్చి మసీదుల్లో పేలుళ్లకు ప్రతీకారంగానే శ్రీలంకలో పేలుళ్లు జరిపినట్టు ఐసిస్ ఇప్పటికే ప్రకటించింది.

శ్రీలంకలో బాంబు పేలుళ్లకు పాల్పడిన తొమ్మిది మంది ఆత్మాహుతి దళ సభ్యుల్లో ఓ మహిళ కూడా ఉన్నట్లు ఆ దేశ రక్షణశాఖ సహాయమంత్రి రువాన్‌ విజయవర్దనే తెలిపారు. మరో ఇద్దరిని బడా వ్యాపారవేత్త మహమ్మద్ యూసుఫ్‌ ఇబ్రహీం కుమారులుగా గుర్తించారు. 33 ఏళ్ల ఇమ్సాత్‌ కొలంబోలోని సిన్నమన్‌ గ్రాండ్‌ హోటల్‌లో, 31ఏళ్ల ఇల్హామ్‌.. షాంగ్రిల్లా హోటల్‌లో పేలుళ్లకు తెగబడినట్టు వెల్లడైంది. ఈస్టర్‌ సండే రోజు వరుస దాడులతో ఉగ్రవాదులు నరమేథం సృష్టించిన నేపథ్యంలో సోమవారం అర్థరాత్రి నుంచి శ్రీలంకలో ఎమర్జెన్సీ అమల్లోకి వచ్చింది. పోలీసులు, త్రివిధ దళాలు ప్రజా భద్రతను పర్యవేక్షిస్తున్నాయి.

359కి చేరిన మృతుల సంఖ్య
శ్రీలంకలో ఈస్టర్‌ సండేరోజు జరిగిన వరుస పేలుళ్ల ఘటనలో మృతుల సంఖ్య 359కి చేరింది. మృతుల్లో 39మంది విదేశీయులున్నారు. ఇందులో 10మంది భారతీయులు ఉండగా.. నలుగురు అమెరికన్లు ఉన్నట్టు తెలిసింది. ఈ ఘాతుకానికి పాల్పడ్డ దుండగుల కోసం జరుపుతున్న గాలింపు చర్యలు ముమ్మరంగా సాగినట్లు పోలీసు అధికార ప్రతినిధి గుణశేఖర తెలిపారు. మంగళవారం రాత్రి మరో 18 మంది అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. దీంతో ఇప్పవరకు పోలీసులు అరెస్టు చేసిన వారి సంఖ్య 60కి చేరింది. అలాగే మరిన్ని దాడులు జరిపేందుకు ముష్కరులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారన్న సమాచారం అందడంతో..  ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని లంక ప్రధాని రనిల్‌ విక్రమసింఘే పిలుపునిచ్చారు. దాడులకు సంబంధించి భారత ఇంటెలిజెన్స్‌ వర్గాలు శ్రీలంకను ముందే హెచ్చరించింది. మూడు సార్లు ఆ దేశానికి హెచ్చరికలు జారీ చేసినట్లు అధికారవర్గాలు తెలిపాయి. ఈ విషయాన్ని శ్రీలంక ప్రధాని విక్రమసింఘే కూడా ధ్రువీకరించారు. అయినప్పటికీ క్షేత్రస్థాయిలో తగిన చర్యలు తీసుకోవడంలో విఫలమైనట్లు అంగీకరించారు.

హైదరాబాద్‌కు భౌతికకాయం
శ్రీలంకలో జరిగిన వరుస బాంబు పేలుళ్ల ఘటనలో హైదరాబాద్ అమీర్‌పేటకు చెందిన ఒకరు మృతిచెందారు. మణికొండకు చెందిన బిల్డర్ మాకినేని శ్రీనివాస్‌, ఆయన బంధువు వేమూరి తులసీరామ్ స్నేహితులతో కలిసి ఐదురోజుల క్రితం శ్రీలంక సమ్మర్ ట్రిప్‌కు వెళ్లారు. శ్రీలంక హోటల్‌లో ఉన్న సమయంలో జరిగిన బాంబు దాడిలో తులసీరామ్ అక్కడికక్కడే మృతిచెందారు. శ్రీనివాస్‌కు గాయాలయ్యాయి. ముష్కరుల దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన తులసీరాం భౌతికకాయాన్ని హైదరాబాద్‌ తీసుకువచ్చారు. కొలంబో నుంచి శంషాబాద్‌ విమానాశ్రయానికి ఆయన భౌతికకాయాన్ని తరలించారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top