ఆ ఐదు వింత లోకాలివేనట..! | Five wonder locations in world, can't belief that | Sakshi
Sakshi News home page

పక్షుల ఆత్మహత్య స్పాట్‌ ఇదే!

Aug 10 2016 10:13 AM | Updated on Sep 4 2017 8:43 AM

ఈ ప్రపంచం ఎన్నో వింతలకు, మరెన్నో అద్భుతాలకు నిలయం.

ఈ ప్రపంచం ఎన్నో వింతలకు, మరెన్నో అద్భుతాలకు నిలయం. ఈ భూమిపై మనిషి ఊహకందని ఎన్నో ప్రదేశాలున్నాయి. ఇప్పుడు మీరు చదవబోయే ప్రదేశాలు కూడా అలాంటివే . మీకు నమ్మకం కలిగినా.. లేకపోయినా.. వి మాత్రం అక్షరాల సత్యం. మిమ్మల్ని  మరోలోకానికి తీసుకెళ్లే అలాంటి ఐదు వింతలోకాల విశేషాలు ఈ రోజు తెలుసుకుందాం.
 -సాక్షి, స్కూల్ ఎడిషన్

పక్షుల ఆత్మహత్య స్థలం..!
భారతదేశంలోని అస్సాంలో జటింగా అనే ఒక గ్రామం ఉంది. ఇక్కడ ప్రతీ ఏడాది సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో సాయంత్రం ఆరు నుంచి తొమ్మిది గంటల వరకు వందలాది పక్షులు ఈ ప్రాంతానికి వచ్చి ఆత్మహత్య చేసుకుంటాయి. దాదాపు 30 జాతులకు చెందిన పక్షులు ఇక్కడ మరణిస్తాయని స్థానికులు చెబుతున్నారు. అసలు ఇలా ఎందుకు జరుగుతుందనడానికి ఎలాంటి శాస్త్రీయ కారణాలు లేవు. కానీ అక్కడి స్థానికులు మాత్రం ఆకాశంలో ఉండే ఆత్మలే దీనికి కారణమని బలంగా నమ్ముతున్నారు.

అఓకిగహారా (ఆత్మహత్యల అడవి)
జపాన్‌లోని మౌంట్ ఫ్యూజీ సమీపంలో అఓకిగహారా అనే అడవి ఉంది. ‘ఆత్మహత్యల ఫారెస్ట్’గా ఈ అడవి పేరుపొందింది. ఎందుకంటే ఈ అడవిలో జరిగే ఆత్మహత్యలే దీనికి నిదర్శనం. ప్రతీ ఏడాది ఈ అడవిలో సుమారు 100 మంది ఆత్మహత్య చేసుకుంటారని గణంకాలు చెబుతున్నాయి. ఆత్మహత్య చేసుకునే వారిలో ఎక్కువ శాతం డ్రగ్స్‌కి  బానిసలైనవారు, ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు ఉంటారు. కొంతమంది సందర్శకులు ఈ మృత దేహాలను చూడడానికి రావడం ఇక్కడ ఆసక్తికరమైన అంశం. ఈ విషయం ప్రపంచ వ్యాప్తంగా దుమారం లేపడంతో అక్కడి ప్రభుత్వం పత్రికల్లో, టీవీల్లో ఈ అడవికి సంబంధించిన కథనాలను టెలికాస్ట్ చేయకూడదనే షరతులు విధించింది.  
 
ది ఐలాండ్ ఆఫ్ డాల్స్  (బొమ్మల దీవి)
మెక్సికోలోని ఒక దీవిలో డాన్‌జులియన్ సంటానా అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అతను చూస్తుండగానే ఓ 12 ఏళ్ల బాలిక నీళ్లల్లో మునిగి చనిపోయింది. తర్వాత రోజు ఆ అమ్మాయి చనిపోయిన చోట ఒక చిన్న పిల్లలాంటి బొమ్మ తేలుతూ కనిపించిందట. జులియన్ ఆ బొమ్మని తీసుకొచ్చి దీవిలోని ఒక చెట్టుకు వేలాడదీశాడు. ఆ తర్వాతి రోజు నుంచి నీటిలో రోజుకో బొమ్మ తేలుతూ కనిపించడం మొదలైంది. జులియన్ ఇలా కనిపించిన ప్రతి బొమ్మని దీవిలో వేలాడదీయడం మొదలు పెట్టాడు. తను చనిపోయేంత వరకు బొమ్మలను చెట్లకు వేలాడదీశాడు. ఇప్పుడు ఆ దీవిలో కొన్ని వేల బొమ్మలు ఉన్నాయి. ఆ బొమ్మల్లో చనిపోయిన ఆత్మ ఉందని అక్కడి స్థానికులు నమ్ముతున్నారు.

అంతేకాదు బొమ్మలు అప్పుడప్పుడు కదులుతాయని, కళ్లు తెరుస్తాయని వారు చెబుతున్నారు. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే 12 ఏళ్ల అమ్మాయి చనిపోయిన చోటే డాన్‌జులియస్ మరణించాడు. ఇప్పుడు ఈ ప్రదేశం పర్యాటక ప్రదేశంగా మారింది. జులియన్ మరణాంతరం ఈ ప్రదేశంపై ప్రపంచ వ్యాప్తంగా చాలా వార్త సంస్థలు కథనాలు ప్రచురిస్తున్నాయి.
 
 సెడ్లిక్ అస్వేరి ( పుర్రెల చర్చి)
చెక్‌రిపబ్లిక్ అనే దేశంలో ఒక రోమన్ క్యాథలిక్ చర్చి ఉంది. ఈ చర్చి ప్రాంగణంలో సమాధి చేసిన వారు నేరుగా స్వర్గానికి వెళ్తారని ప్రజల నమ్మకం. దీంతో ఇప్పటివరకు అక్కడ సుమారు 70 వేల మందిని సమాధి చేశారు. అనంతరం ఆ చర్చిని పునర్‌నిర్మించే క్రమంలో ఆ సమాధులను తవ్వి అందులోని పుర్రెలతో చర్చిని డెకరేట్ చేశారు. చర్చిలో ఉన్న ప్రతి ఆకర్షణీయ వస్తువు ఎముకలతో తయారుచేసినవే. చెక్‌రిపబ్లిక్‌లో ఎక్కువ మంది పర్యాటకులు సందర్శించే ప్రదేశం ఇదే అవ్వడం విశేషం.   
 
 లేక్ నాట్రాన్
టాంజానియా అనే దేశంలో లేక్ నాట్రాన్ అనే నది ఉంది. ఈ నదిని ‘సాల్ట్ అండ్ సోడా లేక్’ అని పిలుస్తారు. దీనిలో ఉండే నీటి ఉష్ణోగ్రత సుమారు 40 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉంటుంది. ఇంత వేడిగా ఉండడం వల్ల ఆ నదిలోని నీరంత ఆవిరైపోయి ‘సోడియం కార్బోనేట్ డెకా హైడ్రేట్’ అనే రసాయనం తయారవుతుంది. ఈ రసాయనాన్ని ఈజిప్టియన్లు మమ్మీలు తయారుచేయడానికి ఉపయోగించారని పరిశోధకులు చెబుతున్నారు. ఆ నదిపై నుంచి ఏదైనా పక్షి వెళ్లినా, నీరు తాగడానికి ఏ జంతువు వచ్చినా అవి వెంటనే చనిపోతాయి.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement