ఇక నాలుగు రోజులే పని దినాలు

Finland Introduce Four day working week and six-hour shifts - Sakshi

ప్రస్తుతం అమల్లో ఉన్న వారానికి ఐదు రోజుల పనిదినాలను నాలుగు రోజులకు కుదిస్తానని ఫిన్‌లాండ్‌ ప్రధాన మంత్రి సన్నా మేరిన్‌ సోమవారం ప్రకటించారు. కార్మికులు తమ కుటుంబాలతో ఎక్కువ సమయం గడపాలనే ఉద్దేశంతోనే ఈ నాలుగు రోజుల పని విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించినట్లు ఆమె చెప్పారు. పైగా రోజుకు ఆరు గంటలు మాత్రమే పనిచేయాల్సి ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం ఎనిమిది గంటల పని వేళలు అమల్లో ఉన్నాయి.

34 ఏళ్ల సన్నా మేరిన్‌ ప్రపంచంలోనే పిన్న వయస్సుగల ప్రధాన మంత్రి. మహిళలే నాయకత్వం వహిస్తున్న మరో నాలుగు రాజకీయ పార్టీలతో కలిసి ఆమె సంకీర్ణ ప్రభుత్వానికి సారధ్యం వహిస్తున్నారు. మిగతా మూడు పార్టీలకు నాయకత్వం వహిస్తోన్న మహిళలు 35 ఏళ్ల లోపువారే అవడం మరో విశేషం. మేరిన్‌ ప్రధాన మంత్రిగా బాధ్యతలు స్వీకరించడానికి ముందు దేశ రవాణా మంత్రిగా పనిచేశారు. 

కార్మికులు కుటుంబ సభ్యులు మరింత సమయం గడపడంతోపాటు జీవితానికి సంబంధించిన సాంస్కృతిక, సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొనడానికి వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సన్నా మేరిన్‌ తెలిపారు. తమ నిర్ణయం వల్ల కార్మికులు మరింత చురుగ్గా పనిచేయడం వల్ల ఉత్పాదకత పెరుగుతుందని భావిస్తున్నట్లు ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. త్వరలోనే అమల్లోకి రానున్న నాలుగు రోజుల పని దినాల పట్ల వామపక్ష పార్టీలు హర్శం వ్యక్తం చేశాయి. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top