అక్కడికి వెళితే ప్రేమలో పడతారు! | far from development, Mubarak Village of Karachi | Sakshi
Sakshi News home page

అక్కడికి వెళితే ప్రేమలో పడతారు!

Feb 14 2016 3:46 PM | Updated on Sep 3 2017 5:39 PM

'ప్రేమలో పడలాంటే ఒకచోటికి వెళ్లాలా?' అంటారేమో! అయితే ఫొటోలో కనిపిస్తున్న చోటికి వెళితే మాత్రం తప్పక విశ్వప్రేమ పుట్టుకొస్తుంది.

'ప్రేమలో పడలాంటే ఒకచోటికి వెళ్లాలా? చాలాచోట్ల చాలారకాలుగా ప్రేమలో పడొచ్చు తెల్సా..' అంటారేమో! అయితే ఫొటోలో కనిపిస్తున్న చోటికి వెళితే మాత్రం తప్పక విశ్వప్రేమ పుట్టుకొస్తుంది. అది ఎలాగంటే..

ఆ ఊరిపేరు ముబారక్. దాదాపు 40 లక్షల చదరపు కిలోమీటర్లు విస్తరించిన అరేబియా సముద్రంలో.. ప్రత్యేకమైన తీరగ్రాం అది. మూడొంతుల భూగోళాన్ని ఆక్రమించిన జలరాశుల్లో భూతద్దం పెట్టివెదికితేగానీ దొరకని ఆకుపచ్చ సముద్రపు తాబేళ్లకు ముబారక్ తీరం శాశ్వత చిరునామా. అరుదైన బల్లిజాతులకూ ఆవాలం. ఇక సాయంసంధ్యల్లోనైతే  ప్రకృతికాంత తన అందమంతటినీ కట్టకట్టుకొచ్చి ఇక్కడ కుమ్మరించిందా! అన్నంత రమణీయంగా ఉంటుంది. ఆ అందాలతో ప్రేమలోపడి, ముచ్చట్లుపెట్టి, విరహంతో తిరిగిస్తుంటే.. అదిగో, అప్పుడు కనిపిస్తారు మనుషులు.

అంతటి ప్రాకృతిక సౌందర్యాన్ని ప్రపంచానికి పంచే ముబారక్ లో మనుషుల పరిస్థితి.. 'నాంపల్లి స్టేషన్ కాడి రాజలింగు' లాంటిది. కడు దయనీయం. ఉందామంటే ఇల్లూలేదు, తిందామంటే తిండీ లేదు, దాహం వేస్తే నీళ్లూ లేవు, రోగం వస్తే మందూ లేదు. అంతెందుకు ఆ ఊరికిపోయే దారి కూడా అంతా మట్టిమయం. అప్పుడు మళ్లీ మనలో ప్రేమ మొదలవుతుంది. ఈ సారిమాత్రం ప్రకృతిమీదకాదు సాటి మనిషి మీద. ఇంకా చెప్పాలంటే మన దాయాది మీద!

ముబారక్.. కరాచీ మెట్రోపాలిటన్ లో భాగం. కరాచీ నగరం నడిబొడ్డునుంచి కేవలం 30 కిలోమీటర్ల ప్రయాణం. అభివృద్ధికి మాత్రం 200 ఏళ్ల దూరం! అక్కడ నివసించేవాళ్లంతా బెలూచీ గిరిజనులే. వందల ఏళ్ల నుంచే సముద్రంలో చేపలుపట్టే జాలర్లుగా స్థిరపడిపోయారు. దేశవిభజన తర్వాత రెండు మూడు దశాబద్ధాలవరకూ అక్కడి జీవనం సాఫిగానే సాగేది. చేపల మార్కెట్ బాగా నడిచేది. అయితే పెరిగిన జనాభాకు అనుగుణంగా ఆధునిక వేటపద్ధతులు నేర్చుకోలేకపోయారు ముబారక్ జాలర్లు. విదేశీ పెట్టుబడులుగానీ, బడాబాబులకుగానీ.. ముబారక్ ను  బాగా ఆదాయమిచ్చే ప్రాంతంగా గుర్తించలేదు. ఇలా తమ రేవులోకి పెద్ద కంపెనీలు రాకపోవడం బడుగు జీవులైన జాలర్లకు పైకి మంచిచేసినట్లనిపించినా, వాస్తవానికి తీవ్రనష్టం చేసింది.

కరాచీ నుంచి వారానికి రెండు సార్లోచ్చే మంచినీళ్ల ట్యాంకర్లు, వారానికి ఒకసారొచ్చే కూరగాయల బండితోనే సరిపెట్టుకోవాలి ఆ 10 వేల జనాబా. ఒక ట్యాంకర్ నీళ్ల ఖరీదు రూ. 1500. పేరుకు ఒక గుడిసెలో వైద్యశాల ఉంది. కానీ అందులో కాటన్ కు కూడా దిక్కుండదు. జలుబొచ్చినా, జబ్బుచేసినా కరాచీ నగరానికి పరుగెత్తాల్సిందే.  కరెంటు పోల్స్, వాటిమధ్య తీగలూ ఉంటాయి కానీ కరెంటే ఉండదు. ఇప్పటివరకు ఆ గ్రామానికి విద్యుత్ సరఫరాలేదు. వంట చేసుకునేందుకు కట్టెలపొయ్యే దిక్కు. అదికూడా మోపు కట్టెలు రూ. 150కి తక్కువ దొరకదు.

'ఇంత దరిద్రపుగొట్టు జీవితాన్ని ఎలా నెట్టుకొస్తున్నారయ్యా?' అని అడిగితే ముబారక్ వాసులు చెప్పేది ఒకటే మాట.. 'మేం మా గ్రామాన్ని ప్రేమిస్తాం. సౌకర్యాలు ఉన్నా, లేకున్నా ఇక్కడే చస్తాం. ఇక్కడికొస్తే మీక్కూడా మాపై ప్రేమ కలుగుతుంది. కానీ మా పాలకులకే అది కలగట్లేదు. చూద్దాం.. అల్లా ఎప్పటికైనా కరుణించకపోడా..' అని.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement