బ్రెగ్జిట్‌ ఒప్పందానికి ఈయూ ఓకే

EU Approved Brexit Deal - Sakshi

లండన్‌/బ్రస్సెల్స్‌: బ్రెగ్జిట్‌ కోసం యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ)తో బ్రిటన్‌ కుదుర్చుకున్న ఒప్పందాన్ని ఆదివారం ఈయూ నేతలు ఆమోదించారు. బ్రిటన్‌ మినహా ఈయూలో మిగిలిన మొత్తం 27 దేశాలూ ఈ ఒప్పందానికి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాయి. ఇక డిసెంబర్‌లో బ్రెగ్జిట్‌ ఒప్పందాన్ని బ్రిటన్‌ పార్లమెంటు ఆమోదించాల్సి ఉంది. అయితే ఇది అంత సులభమైన విషయంలా కనిపించడం లేదు. బ్రిటన్‌ ప్రధాని థెరెసా మే కుదుర్చుకున్న ఒప్పందం బ్రిటన్‌కు నష్టం చేకూర్చేలా ఉందంటూ ఆమె సొంత మంత్రివర్గంలోని వ్యక్తులే రాజీనామా చేసి వెళ్లిపోవడం, సొంత పార్టీ ఎంపీలే మేపై అవిశ్వాస నోటీసులు ఇవ్వడం తెలిసిందే. ఇది బ్రిటన్‌కు ఎంతో మేలు చేసే ఒప్పందమేననీ, ఇంతకన్నా మంచి ఒప్పందాన్ని ఎవరూ కుదర్చలేరనీ ఆమె వాదిస్తున్నప్పటికీ చాలా మంది ఆమెకు వ్యతిరేకంగానే ఉన్నారు. 

బ్రిటన్‌ పార్లమెంటు ఆమోదం అనంతరం ఈ ఒప్పందాన్ని ఈయూ పార్లమెంటు కూడా ఆమోదించాల్సి ఉంటుంది. ఇదంతా 2019 మార్చి 29కి ముందే పూర్తయ్యి, అప్పటి నుంచి ఈయూ నుంచి బ్రిటన్‌ వైదొలగడం ప్రారంభం కావాల్సి ఉంది. ఈ ప్రక్రియ మొత్తానికి 21 నెలలు పడుతుంది. ఒకవేళ ఒప్పందాన్ని బ్రిటన్‌ పార్లమెంటు ఆమోదించకపోతే పరిస్థితి దిగజారి, అసలు ఒప్పందమే లేకుండా ఈయూ నుంచి బ్రిటన్‌ బయటకు రావాల్సి రావచ్చు, లేదా కొత్త ఒప్పందం కోసం మళ్లీ చర్చలు జరగొచ్చు. మే ప్రభుత్వం కూలిపోయి బ్రిటన్‌లో మళ్లీ ఎన్నికలు వచ్చే అవకాశం కూడా ఉంది. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top