ప్రియురాలి కోసం ఫ్లైట్ హైజాక్‌ | estranged wife caused hijacking of egyptian plane | Sakshi
Sakshi News home page

ప్రియురాలి కోసం ఫ్లైట్ హైజాక్‌

Mar 30 2016 12:42 AM | Updated on Jul 11 2019 6:15 PM

ప్రియురాలి కోసం ఫ్లైట్ హైజాక్‌ - Sakshi

ప్రియురాలి కోసం ఫ్లైట్ హైజాక్‌

మాజీ ప్రియురాలితో సయోధ్య కోసం ఒక విమానాన్నే హైజాక్ చేసి సంచలనం సృష్టించాడో ప్రబుద్ధుడు.

సైప్రస్‌లో హైడ్రామా; హైజాకర్ అరెస్ట్‌తో సుఖాంతం
 
 లార్నాకా(సైప్రస్): మాజీ ప్రియురాలితో సయోధ్య కోసం ఒక విమానాన్నే హైజాక్ చేసి సంచలనం సృష్టించాడో ప్రబుద్ధుడు. ప్రముఖ పర్యాటక ద్వీపం సైప్రస్‌లో మంగళవారం ఉత్కంఠభరితంగా సాగిన ఈ హైజాక్ డ్రామా చివరకు సుఖాంతమైంది. నాలుగైదు గంటల హైడ్రామా అనంతరం సైప్రస్ పోలీసులు సీఫ్ ఎల్దిన్ ముస్తఫా అనే ఆ హైజాకర్‌ను అదుపులోకి తీసుకున్నారు. సైప్రస్‌లో నివసిస్తున్న తన మాజీ ప్రియురాలిని, పిల్లలను కలిసేందుకే  సీఫ్ ఎల్దిన్ ముస్తఫా అనే వ్యక్తి ఈ రిస్క్ తీసుకున్నాడని స్థానిక మీడియా పేర్కొంది. ఆ వివరాలు.. ఈజిప్ట్‌లోని అలెగ్జాండ్రియా నుంచి కైరో వెళ్తున్న ఈజిప్ట్ ఎయిర్ విమానాన్ని సీఫ్ ఎల్దిన్ ముస్తఫా అనే వ్యక్తి హైజాక్ చేశాడు.

పేలుడు పదార్థాలున్న బెల్ట్ ధరించానని బెదిరిస్తూ సైప్రస్‌లోని లార్నాకా ఎయిర్‌పోర్ట్‌లో విమానాన్ని ల్యాండ్ చేయాలని ఆదేశించాడు. కంట్రోల్ టవర్ సిబ్బందితోనూ అదే విషయం చెప్పాడు. దాంతో ఉదయం 9 గంటల సమయంలో (భారత కాలమానం ప్రకారం ఉదయం 11.20 గంటలు) లార్నాకా విమానాశ్రయంలో ఆ ఎయిర్‌బస్ ఏ 320ని ల్యాండ్ చేశారు. ఆ విమానంలో 8 మంది సిబ్బంది సహా 56 మంది ప్రయాణికులున్నారు. నలుగురు అమెరికన్లు సహా 21 మంది విదేశీయులు సైతం ఉన్నారు. దాంతో, ఒక్కసారిగా ఈజిప్ట్, సైప్రస్ ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. తొలుత ఉగ్రవాద చర్యగా భావించారు.

లార్నాకా విమానాశ్రయాన్ని సాయుధులైన భద్రతాదళాలు చుట్టుముట్టి, తమ స్వాధీనంలోకి తీసుకున్నాయి. పలు సంప్రదింపుల అనంతరం నలుగురు విదేశీయులు, పైలట్, కో పైలట్, ఒక ఎయిర్ హోస్టెస్, ఒక సెక్యూరిటీ గార్డ్‌ను మాత్రం బందీలుగా ఉంచుకుని, మిగతావారిని ఆ హైజాకర్ వదిలిపెట్టాడు. పిల్లలతో సైప్రస్‌లోని ఒక గ్రామంలో నివసిస్తున్న తన మాజీ ప్రియురాలిని ఎయిర్‌పోర్ట్‌కు పిలిపించాలని డిమాండ్ చేశాడని ఒక కథనాన్ని, యూరోపియన్ యూనియన్ ప్రతినిధితో మాట్లాడించాలని డిమాండ్ చేశాడని మరో కథనాన్ని స్థానిక మీడియా ప్రసారం చేసింది. పిల్లలతో కలసి విమానాశ్రయానికి ఒక మహిళ వచ్చారనీ పేర్కొంది.

కాసేపటి తరువాత ఆ హైజాకర్ బందీలందరినీ వదిలిపెట్టి, చేతులు పెకైత్తి విమానం బయటకు వచ్చాడు. లొంగిపోయిన హైజాకర్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేసిన పోలీసులు అతని వద్ద పేలుడు పదార్థాలేవీ లేవని నిర్ధారించారు. ఇది ఉగ్రవాద ఘటన కాదని సైప్రస్ అధికారులు స్పష్టం చేశారు. అంతకుముందు, వ్యక్తిగత కారణాలతో ఈ దుశ్చర్యకు ఒడిగట్టి ఉండొచ్చని సైప్రస్ అధ్యక్షుడు నికోస్ అనస్తాసియేడ్స్ పేర్కొన్నారు. ఒక మహిళను పిలిపించాలంటూ హైజాకర్ డిమాండ్ చేశాడా అన్న మీడియా ప్రతినిధి ప్రశ్నకు.. ‘ఎప్పుడైనా, ఎక్కడైనా మహిళ పాత్ర ఉంటుంది కదా!’ అని ఆయన నవ్వుతూ సమాధానమిచ్చారు. ఇంతకుముందు కూడా పలు సందర్భాల్లో హైజాక్ అయిన విమానాలను హైజాకర్లు లార్నాకా విమానాశ్రయంలోనే ల్యాండ్ చేయించడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement