breaking news
plane hijack
-
ఘోర కలికి పాతికేళ్లు
ఉగ్రవాదుల ఉన్మాదానికి 2,977 మంది బలైపోయిన సెప్టెంబర్ 11(9/11) దాడులకు 25 ఏళ్లు పూర్తయ్యాయి. అగ్రరాజ్యం అమెరికానే సవాలు చేస్తూ ముష్కరులు సాగించిన మారణహోమాన్ని ప్రపంచం ఇప్పటికీ మర్చిపోలేదు. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ అల్‌ఖైదా 2001 సెప్టెంబర్ 11న అమెరికాపై విరుచుకుపడింది. ఆత్మాహుతి దాడులకు పాల్పడింది. ఇది అమెరికా చరిత్రలోనే అతిపెద్ద ఉగ్రవాద దాడికి నిలిచిపోయింది. అల్‌ఖైదా శిక్షణలో రాటుతేలిన 19 మంది ఉగ్రవాదులు నాలుగు విమానాలను హైజాక్ చేసి పలు లక్ష్యాలను ఢీకొట్టారు. ప్రపంచ వాణిజ్య రాజధాని న్యూయార్క్, వాషింగ్టన్ డీసీలపై జరిగిన దాడులు భారీ ప్రాణనష్టాన్ని, పెను విధ్వంసాన్ని సృష్టించాయి. న్యూయార్క్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై జరిగిన దాడిలో దాదాపు 2,750 మంది, పెంటగాన్ వద్ద 184 మంది, పెన్సిల్వేనియాలో 40 మంది మరణించారు. వేలాది మంది గాయపడ్డారు. ఈ అఘాయిత్యానికి తెగించిన మొత్తం 19 మంది ఉగ్రవాదులు సైతం మృత్యువాత పడ్డారు. మంటల్లో చిక్కుకున్న బాధితులను రక్షించే ప్రయత్నంలో 400 మందికి పైగా పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మరణించడం గమనార్హం. 9/11 దాడుల వల్ల అమెరికాకు 10 బిలియన్ డాలర్లుకుపైగా నష్టం వాటిల్లింది. దాడి ఎలా జరిగింది? హైజాకర్ల ముసుగులోని ఉగ్రవాదులు తూర్పు తీరంలోని మూడు ఎయిర్‌పోర్టుల నుంచి తమ మారణకాండ ప్రారంభించారు. నాలుగు విమానాల్లోకి ప్రవేశించారు. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే వాటిని తమ ఆ«దీనంలోకి తీసుకున్నారు. రహస్యంగా తమ వెంట తెచ్చుకున్న బాక్స్ కట్టర్లతో పైలట్లతోపాటు తమకు ఎదురు తిరిగిన కొందరు ప్రయాణికులను పొడిచేశారు. ఉదయం 8.46 గంటలకు బోస్టన్ నుండి బయలుదేరిన మొదటి విమానం(అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానం) న్యూయార్క్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ నార్త్ టవర్‌ను ఢీకొట్టింది. బోస్టన్ నుండే బయలుదేరిన రెండో విమానం 17 నిమిషాల తర్వాత సౌత్ టవర్‌లోకి దూసుకెళ్లింది. రెండు టవర్ల నుంచి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. జనం హాహాకారాలు చేశారు. కొందరు ప్రాణాలు దక్కించుకొనే క్రమంలో టవర్ల నుంచి కిందికి దూకేశారు. నిమిషాల వ్యవధిలోనే రెండు టవర్లు నేలమట్టమయ్యాయి. అప్పటిదాకా అందరూ ఇది విమాన ప్రమాదంగానే భావించారు. ముష్కర మూకల ఘాతుకమేనన్న అనుమానం రాలేదు. ఇక వాషింగ్టన్ డీసీ సమీపంలోని డల్లెస్ ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరిన మూడో విమానం ఉదయం 9.37 గంటలకు అమెరికా రక్షణ శాఖ ప్రధాన కార్యాలయమైన పెంటగాన్ నైరుతి వైపు భాగాన్ని ఢీకొట్టింది. దాంతో అక్కడ మంటలు చెలరేగాయి. నిమిషాల వ్యవధిలోనే మూడుచోట్ల విమాన ప్రమాదాలు జరగడంలో ఇది ఉగ్రవాద దాడికి అనుమానించిన ఫెడరల్ ఏవియేషన్ అథారిటీ అప్రమత్తమైంది. దేశవ్యాప్తంగా విమానాల రాకపోకలను తక్షణమే నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఆ తర్వాత న్యూజెర్సీలోని నెవార్క్ నుంచి వస్తున్న నాలుగో విమానం పెన్సిల్వేనియా గ్రామీణ ప్రాంతంలోని షాంక్స్‌విల్ సమీపంలో కూలిపోయింది. న్యూయార్క్, పెంటగాన్ ఘటనల గురించి అప్పటికే సెల్ఫోన్ల ద్వారా సమాచారం అందుకున్న నాలుగో విమానంలోని ప్రయాణికులు ఉగ్రవాదులపై తిరగబడ్డారు. నిలువరించేందుకు గట్టిగా ప్రయత్నించారు. ఈ క్రమంలోనే విమానం కుప్పకూలింది. అందులోని 40 మంది అగ్నికి ఆహూతయ్యారు. మొత్తం నాలుగు ఘటనల్లో 2,974 మృతిచెందగా, వీరిలో 90 దేశాల పౌరులు ఉన్నారు. 35 నుంచి 41 మంది భారతీయులు మరణించినట్లు అంచనా.ఉగ్రవాదంపై పోరాటం సఫలమైనట్లేనా? ఉగ్రవాదంపై అమెరికా ప్రారంభించిన ప్రపంచ యుద్ధం సఫలమైందా? అంటే లేదనే చెప్పాలి. సెపె్టంబర్ 11న ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాల్లో ఉగ్రవాదులు దాడులకు దిగారు. వేలాది మందిని బలి తీసుకున్నారు. ఉగ్రవాద భూతం అంతం కాలేదు. అంతమయ్యే సూచనలు కూడా కనిపించడం లేదు. ఉగ్రవాదం ప్రపంచానికి పెను సవాళ్లు విసురుతూనే ఉంది. అయితే, అమెరికాలో మాత్రం గత 25 ఏళ్లలో చెప్పుకోదగ్గ ఉగ్రవాద దాడులేవీ జరగలేదు. నిఘాను కట్టుదిట్టడం చేయడమే ఇందుకు కారణం. ఉగ్రవాదంపై యుద్దంలో అమెరికా అరకొర విజయం సాధించినట్లే చెప్పుకోవాలి. ఆపరేషన్ ఒసామా బిన్ లాడెన్ 9/11 దాడులు అమెరికాతోపాటు ప్రపంచాన్ని కుదిపేశాయి. ఆ రోజు అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జి డబ్ల్యూ బుష్ ఫ్లోరిడాలోని సరసోటాలో ఓ పాఠశాలలో ఉన్నారు. రెండో తరగతి విద్యార్థులతో మాట్లాడుతున్నారు. వరల్డ్ ట్రేడ్ సెంటర్లోకి ఒక విమానం దూసుకుపోయిందని ఆయనకు సమాచారం అందింది. కొద్దిసేపటి తర్వాత చీఫ్ ఆఫ్ స్టాఫ్ అయిన ఆండ్రూ కార్డ్ అధ్యక్షుడి కుడి చెవిలో గుసగుసలాడారు. అమెరికాపై దాడి జరుగుతోందని చెప్పారు. అదే రోజు రాత్రి 8.30 గంటలకు బుష్ వైట్‌హౌస్‌లో దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ దుశ్చర్యకు పాల్పడిన ఉగ్రవాదులకు, వారికి ఆశ్రయం కల్పించిన వారిని శిక్షించి తీరుతామని ప్రతిజ్ఞ చేశారు. సెపె్టంబర్ 11 దాడులకు ప్రతిస్పందనగా అమెరికా ‘గ్లోబల్ వార్ ఆన్ టెర్రర్’ప్రారంభించింది. మానవాళికి ముప్పుగా మారిన ఉగ్రవాద సంస్థలను నిర్మూలించేందుకు చర్యలు చేపట్టింది. అల్‌ఖైదాకు మద్దతు ఇస్తున్నారన్న ఆరోపణలతో అఫ్గానిస్తాన్ తాలిబన్ ప్రభుత్వాన్ని కూల్చిచేసింది. అమెరికా పట్ల నరనరాన విద్వేషం నింపుకొని ‘సెపె్టంబర్ 11’మారణకాండకు స్వయంగా వ్యూహరచన చేసిన అల్‌ఖైదా అధినేత, అంతర్జాతీయ ఉగ్రవాద ఒసామా బిన్ లాడెన్ 2011 మే 2న పాకిస్తాన్ భూభాగంలోని అబోటాబాద్‌లో అమెరికా సైన్యం చేతిలో దారుణంగా హతమయ్యాడు. సముద్రంలో అతడి మృతదేహాన్ని ఖననం చేశారు. శిథిలాల దిబ్బగా మారిన వరల్డ్ ట్రేడ్ సెంటర్ స్థలాన్ని(గ్రౌండ్ జీరో) శుభ్రపరిచే పని 2002 మే నెలలో పూర్తయింది. పెంటగాన్‌ను ఒక సంవత్సరంలోపే మరమ్మత్తు చేశారు. వరల్డ్ ట్రేడ్ సెంటర్ స్థలంలో ఒక స్మారక చిహ్నం ఏర్పాటుచేశారు. ప్రతిఏటా సెప్టెంబర్ 11న మృతులకు నివాళులర్పిస్తున్నారు. అలాగే నూతన వరల్డ్ ట్రేడ్ సెంటర్‌ను నిర్మించారు. పెంటగాన్, పెన్సిల్వేనియాలోనూ స్మారక చిహ్నాలు ఏర్పాటు చేశారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఉక్రెయిన్ విమానం హైజాక్
-
ఉక్రెయిన్ విమానం హైజాక్
కీవ్: ఉక్రెయిన్ విమానం హైజాక్‌కు గురయ్యింది. తాలిబన్ల ఆక్రమణ నేపథ్యంలో ఉక్రెయిన్ ప్రభుత్వం అఫ్గనిస్తాన్‌లో ఉన్న తమ పౌరులను తరలింపు ప్రక్రియను ప్రారంభించింది. ఈ క్రమంలో దుండగులు ఉక్రెయిన్ విమానాన్ని హైజాక్ చేసి ఇరాన్‌కు మళ్లించారు. విమానం హైజాక్ విషయాన్ని ఉక్రెయిన్ విదేశాంగ శాఖ మంగళవారం ధ్రువీకరించింది. విమానాన్ని హైజాక్ చేసింది ఎవరు అనే దాని గురించి ఎలాంటి సమాచారం లేదు. ఈ విమానం గతవారం అఫ్గనిస్తాన్ వచ్చినట్లు ఉక్రెయిన్ విదేశాంగ కార్యదర్శి తెలిపారు. ఈ సదర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘గత ఆదివారం మా విమానం కాబూల్ హైజాక్‌కు గురయ్యింది. మంగళవారం, విమానం ఆచరణాత్మకంగా మా నుంచి దొంగిలించబడింది. ఇక విమానంలో ఉక్రెయిన్లకు బదులుగా గుర్తు తెలియని ప్రయాణీకులు ఉన్నారు. 83 మంది ప్రయాణికుల బృందంతో విమానం ఇరాన్‌కు వెళ్లింది. మా తదుపరి మూడు తరలింపు ప్రయత్నాలు కూడా విజయవంతం కాలేదు. ఎందుకంటే మా ప్రజలు విమానాశ్రయంలోకి ప్రవేశించలేకపోయారు" అని ఉక్రెయిన్ డిప్యూటీ విదేశాంగ మంత్రి యెవ్జెనీ యెనిన్ రష్యన్ న్యూస్ ఏజెన్సీ టాస్‌తో పేర్కొన్నారు. విమానం హైజాక్ వార్తలను ఇరాన్ ఖండించింది. కాబూల్ నుంచి విమానం వచ్చింది, రీఫ్యూయల్ చేసుకుని వెళ్లింది. ప్రస్తుతం మా భూభాగంలో ఉక్రెయిన్ విమానం లేదు అని ఇరాన్ స్పష్టం చేసింది. -
ప్రియురాలి కోసం ఫ్లైట్ హైజాక్
సైప్రస్‌లో హైడ్రామా; హైజాకర్ అరెస్ట్‌తో సుఖాంతం లార్నాకా(సైప్రస్): మాజీ ప్రియురాలితో సయోధ్య కోసం ఒక విమానాన్నే హైజాక్ చేసి సంచలనం సృష్టించాడో ప్రబుద్ధుడు. ప్రముఖ పర్యాటక ద్వీపం సైప్రస్‌లో మంగళవారం ఉత్కంఠభరితంగా సాగిన ఈ హైజాక్ డ్రామా చివరకు సుఖాంతమైంది. నాలుగైదు గంటల హైడ్రామా అనంతరం సైప్రస్ పోలీసులు సీఫ్ ఎల్దిన్ ముస్తఫా అనే ఆ హైజాకర్‌ను అదుపులోకి తీసుకున్నారు. సైప్రస్‌లో నివసిస్తున్న తన మాజీ ప్రియురాలిని, పిల్లలను కలిసేందుకే సీఫ్ ఎల్దిన్ ముస్తఫా అనే వ్యక్తి ఈ రిస్క్ తీసుకున్నాడని స్థానిక మీడియా పేర్కొంది. ఆ వివరాలు.. ఈజిప్ట్‌లోని అలెగ్జాండ్రియా నుంచి కైరో వెళ్తున్న ఈజిప్ట్ ఎయిర్ విమానాన్ని సీఫ్ ఎల్దిన్ ముస్తఫా అనే వ్యక్తి హైజాక్ చేశాడు. పేలుడు పదార్థాలున్న బెల్ట్ ధరించానని బెదిరిస్తూ సైప్రస్‌లోని లార్నాకా ఎయిర్‌పోర్ట్‌లో విమానాన్ని ల్యాండ్ చేయాలని ఆదేశించాడు. కంట్రోల్ టవర్ సిబ్బందితోనూ అదే విషయం చెప్పాడు. దాంతో ఉదయం 9 గంటల సమయంలో (భారత కాలమానం ప్రకారం ఉదయం 11.20 గంటలు) లార్నాకా విమానాశ్రయంలో ఆ ఎయిర్‌బస్ ఏ 320ని ల్యాండ్ చేశారు. ఆ విమానంలో 8 మంది సిబ్బంది సహా 56 మంది ప్రయాణికులున్నారు. నలుగురు అమెరికన్లు సహా 21 మంది విదేశీయులు సైతం ఉన్నారు. దాంతో, ఒక్కసారిగా ఈజిప్ట్, సైప్రస్ ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. తొలుత ఉగ్రవాద చర్యగా భావించారు. లార్నాకా విమానాశ్రయాన్ని సాయుధులైన భద్రతాదళాలు చుట్టుముట్టి, తమ స్వాధీనంలోకి తీసుకున్నాయి. పలు సంప్రదింపుల అనంతరం నలుగురు విదేశీయులు, పైలట్, కో పైలట్, ఒక ఎయిర్ హోస్టెస్, ఒక సెక్యూరిటీ గార్డ్‌ను మాత్రం బందీలుగా ఉంచుకుని, మిగతావారిని ఆ హైజాకర్ వదిలిపెట్టాడు. పిల్లలతో సైప్రస్‌లోని ఒక గ్రామంలో నివసిస్తున్న తన మాజీ ప్రియురాలిని ఎయిర్‌పోర్ట్‌కు పిలిపించాలని డిమాండ్ చేశాడని ఒక కథనాన్ని, యూరోపియన్ యూనియన్ ప్రతినిధితో మాట్లాడించాలని డిమాండ్ చేశాడని మరో కథనాన్ని స్థానిక మీడియా ప్రసారం చేసింది. పిల్లలతో కలసి విమానాశ్రయానికి ఒక మహిళ వచ్చారనీ పేర్కొంది. కాసేపటి తరువాత ఆ హైజాకర్ బందీలందరినీ వదిలిపెట్టి, చేతులు పెకైత్తి విమానం బయటకు వచ్చాడు. లొంగిపోయిన హైజాకర్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేసిన పోలీసులు అతని వద్ద పేలుడు పదార్థాలేవీ లేవని నిర్ధారించారు. ఇది ఉగ్రవాద ఘటన కాదని సైప్రస్ అధికారులు స్పష్టం చేశారు. అంతకుముందు, వ్యక్తిగత కారణాలతో ఈ దుశ్చర్యకు ఒడిగట్టి ఉండొచ్చని సైప్రస్ అధ్యక్షుడు నికోస్ అనస్తాసియేడ్స్ పేర్కొన్నారు. ఒక మహిళను పిలిపించాలంటూ హైజాకర్ డిమాండ్ చేశాడా అన్న మీడియా ప్రతినిధి ప్రశ్నకు.. ‘ఎప్పుడైనా, ఎక్కడైనా మహిళ పాత్ర ఉంటుంది కదా!’ అని ఆయన నవ్వుతూ సమాధానమిచ్చారు. ఇంతకుముందు కూడా పలు సందర్భాల్లో హైజాక్ అయిన విమానాలను హైజాకర్లు లార్నాకా విమానాశ్రయంలోనే ల్యాండ్ చేయించడం గమనార్హం.


