40 మంది ముష్కరుల కాల్చివేత

Egypt police kill 40 'terrorists' after Giza bus attack - Sakshi

గిజా: ప్రపంచ ప్రఖ్యాత గిజా పిరమిడ్‌ వద్ద బాంబు పేల్చి ముగ్గురు విదేశీయులను బలి తీసుకున్న ఉగ్ర మూకలపై ఈజిప్టు సైన్యం విరుచుకుపడింది. గిజాతోపాటు సినాయ్‌ ద్వీపకల్పంలోని ఉగ్రవాదుల స్థావరాలపై దాడులు జరిపి 40 మందిని కాల్చి చంపింది. శుక్రవారం గిజాలో పర్యాటకుల బస్సుపై ఉగ్ర వాదులు జరిపిన బాంబు దాడిలో ముగ్గురు వియత్నాం దేశస్తులతోపాటు ఒక ఈజిప్టు గైడ్‌ చనిపోగా మరో 10 మంది పర్యాటకులు గాయపడ్డారు. ప్రభుత్వ కీలక ఆర్థిక వనరులు, విదేశీ పర్యాటకులే లక్ష్యంగా ఉగ్రవాదులు మరిన్ని దాడులకు సిద్ధమవుతున్నారన్న సమాచారంతో సైన్యం అప్రమత్తమైంది.

విశ్వసనీయ సమాచారం మేరకు శనివారం వేకువజామున గిజాలోని రెండు ప్రాంతాలతోపాటు సినాయ్‌ ప్రావిన్స్‌లో ఉగ్ర స్థావరాలపై బలగాలు ఒక్కసారిగా దాడులు జరిపాయి. ఈ దాడుల్లో మొత్తం 40 మంది ఉగ్రవాదులు హతమైనట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దీర్ఘకాలంపాటు ఈజిప్టును పాలించిన హోస్నీ ముబారక్‌ 2011లో వైదొలిగాక దేశంలో తీవ్ర అస్థిరత నెలకొంది. దేశంలో సుస్థిర పరిస్థితులు ఇప్పుడిప్పుడే నెలకొంటున్న తరుణంలో జరిగిన తాజా ఉగ్ర దాడిని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top