‘తొలి’ పరీక్షతో తప్పుడు ఫలితాలు!

Early COVID-19 test produces false negative results - Sakshi

లక్షణాలు కనిపించిన మూడు రోజులకు పరీక్షలు మేలు!

జాన్‌ హాప్కిన్స్‌ వర్సిటీ అధ్యయనం

వాషింగ్టన్‌: కరోనా వైరస్‌ సోకిన తొలినాళ్లలోనే పరీక్షలు నిర్వహిస్తే వారికి వ్యాధి సోకనట్లు తప్పుడు ఫలితాలు రావచ్చని జాన్‌ హాప్కిన్స్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు నిర్వహించిన అధ్యయనం స్పష్టం చేసింది. లక్షణాలు కనిపించాక మూడు రోజులకు పరీక్షలు చేయడం మేలని అధ్యయనం సూచించింది. అధ్యయనంలో భాగంగా తాము 1330 మంది రోగుల నమూనాలను విశ్లేషించామని, ఆసుపత్రిలో చేరిన రోగులతోపాటు పలు వర్గాల వారు ఇందులో ఉన్నారని లారెన్‌ కౌసిర్కా అనే శాస్త్రవేత్త తెలిపారు.

ఆర్‌టీ–పీసీఆర్‌ టెస్ట్‌ ఫలితాలు, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపించిన సమయం ఆధారంగా తాము పరీక్షల ఫలితం నెగటివ్‌ వచ్చేందుకు ఉన్న అవకాశాలను లెక్కించామని తెలిపారు. ఆర్‌టీ–పీసీఆర్‌ పరీక్షలు నిర్వహించేటప్పుడు ముక్కు, గొంతుల్లోని ద్రవాల నమూనాలు సేకరించడంతోపాటు లక్షణాలు ఎప్పుడు మొదలయ్యాయి అన్నదీ నమోదు చేస్తారని ఈ సమాచారం ద్వారా తాము వైరస్‌ సోకిన తరువాత నాలుగు రోజులకు పరీక్షలు చేస్తే 67 శాతం నెగటివ్‌ ఫలితాలు రావచ్చునని అంచనా వేసినట్లు వివరించారు. కరోనా లక్షణాలు ఉన్న వారందరికీ వైరస్‌ ఉన్నట్లుగానే భావించి చికిత్స అందించాలని సూచించారు. కరోనా పరీక్షల్లోని ఈ లోటును రోగులకు స్పష్టంగా వివరించాలని తెలిపారు.

జూలైలో మోడెర్నా కోవిడ్‌ టీకా పరీక్షలు
కోవిడ్‌కు అడ్డుకట్ట వేసేందుకు రూపొందించిన వ్యాక్సిన్‌ను జూలైలో భారీగా ప్రయోగాత్మకంగా పరిశీలించి చూడనున్నట్లు అమెరికా నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్, మోడెర్నా ప్రకటించాయి. జూలైలో 30 వేల మంది వలంటీర్లపై ఈ టీకాను ప్రయోగించి చూస్తామని, ఇందుకు అవసరమైన డోసులను ఇప్పటికే సిద్ధం చేసి ఉంచామని తెలిపాయి. పెద్దల్లో ఎలా పనిచేస్తుందో చూడటమే కీలకమైన ఈ ప్రయోగ ఉద్దేశం. మార్చిలో 45 మంది వలంటీర్లపై ప్రారంభ ప్రయోగం ఫలితాలు అందాల్సి ఉంది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top