వడిసెల పట్టు.. జాబ్‌ పట్టు.. | Sakshi
Sakshi News home page

వడిసెల పట్టు.. జాబ్‌ పట్టు..

Published Sun, Jul 15 2018 1:30 AM

Different test in mexico - Sakshi

అది మెక్సికోలోని అల్వరాడో నగరం.. అక్కడి ఓ పోలీస్‌ స్టేషన్‌లో పోలీసు అధికారులు యథావిధిగా ఉదయం విధులకు హాజరయ్యారు. వచ్చిన అధికారులందరి దగ్గరి నుంచి తుపాకులు, ఆయుధాలు తీసేసుకున్నారు. ఆ తర్వాత వారి చేతికి వడిసెల, కొన్ని రాళ్లు ఇచ్చారు. అదేనండీ పిట్టలను కొట్టే వడిసె. కొన్ని చోట్ల గులేరు అని పిలుస్తారు. ఆ.. అదే. దాంతో చెప్పిన లక్ష్యాన్ని గురి చూసి కొట్టాలని సూచించారు ఉన్నతాధికారులు.

ఈ పరీక్షలో పాల్గొన్న 130 మంది అధికారుల్లో కేవలం 30 మంది పాసయ్యారట. మిగిలిన వారు సర్వీసుకు పనికిరారని సర్టిఫికెట్‌ ఇచ్చేశారట. మిగిలిన నగరాల్లోనూ ఇలాంటి పరీక్షలే పెట్టి పోలీసుల సామర్థ్యాన్ని పరీక్షిస్తామని వెరాక్రూజ్‌ రాష్ట్ర గవర్నర్‌ మిగుల్‌ ఏంజెల్‌ యూనస్‌ వెల్లడించారు. ఇప్పుడు ఈ చర్య అక్కడ హాట్‌ టాపిక్‌ అయింది. ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి.

ఉన్నతాధికారులు కూడా గవర్నర్‌పై మండిపడుతున్నారు. ఇదంతా రాజకీయంగా చేస్తున్న కుట్ర అని, ఆయుధాలను పక్కనపెట్టి ఇలాంటివి ఇవ్వడమేంటని పోలీసులు దుయ్యబడుతున్నారు. ఇలా జరగడం అక్కడ తొలిసారేం కాదు. 2007లో కూడా టిజువానా నగరంలో ఆర్మీ అధికారులు పోలీసుల తుపాకులు తీసుకున్నారని, వడిసెలు ఇచ్చి డ్యూటీ చేయమన్నారట!

Advertisement
Advertisement