
వాషింగ్టన్: అమెరికా తూర్పు తీరాన్ని హరికేన్ ‘ఫ్లోరెన్స్’ తాకనుందన్న అంచనాల నడుమ రాజధాని వాషింగ్టన్‌లో మంగళవారం తుపాను అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. వాషింగ్టన్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా భారీగా వర్షాలు, వరదలు తలెత్తే ముప్పు ఉందని హెచ్చరికలు జారీ అయ్యాయి.
తక్షణమే అమల్లోకి వచ్చిన ఎమర్జెన్సీ 15 రోజుల పాటు అమల్లో ఉంటుందని, హరికేన్‌ను ఎదర్కొనేందుకు అన్ని వనరులతో సిద్ధంగా ఉన్నామని వాషింగ్టన్ మేయర్ మురియల్ బౌసర్ చెప్పారు. తీర ప్రాంతాల్లో నివసిస్తున్న సుమారు 10 లక్షల మందిని ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఉత్తర, దక్షిణ కరోలినా, వర్జీనియా, మేరీల్యాండ్ రాష్ట్రాల్లో కూడా తుపాను అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. వాషింగ్టన్‌లో చివరిసారిగా 2016లో తుపాను ఎమర్జెన్సీని ప్రకటించారు.