శాంటియాగో డి క్యూబా: మెలిసా తుపాను ధాటికి కరీబియన్ దేశాల్లో తీవ్ర నష్టం సంభవించింది. హైతీలో 25 మంది మృతిచెందారు. క్యూబా, జమైకా దేశాల్లో వరదలు ముంచెత్తాయి. హైతీలో లా డిగూ నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. సమీపంలోని జనావాసాలను ముంచెత్తింది. బుధవారం పదుల సంఖల్లో ఇళ్లు ధ్వంసమయ్యాయి. 25 మంది మరణించగా, చాలామంది శిథిలాల కింద చిక్కుకున్నట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. బాధితులను ఆదుకోవాలని గవర్నర్ జీన్ బెర్ర్‌టాండ్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
మెలిసా ప్రభావం వల్ల జమైకాలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. గ్రాన్మా ప్రావిన్స్ వరద నీటిలో చిక్కుకుంది. ఇక్కడ 40 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. పలు భవనాలు కూలిపోయాయి. కొండ చరియలు విరిగిపడ్డాయి. బండరాళ్ల కారణంగా రహదారులు మూసుకుపోయాయి. బలమైన ఈదురుగాలులు వీచడంతో ఇళ్ల పైకప్పులు కొట్టుకుపోయాయి. మరోవైపు క్యూబాలో 7.35 లక్షల మంది శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్నారు. మెలిసా తుఫాను తూర్పు క్యూబావైపు ప్రయాణించి, క్రమంగా బలహీనపడుతుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.


