భీకర తుపాను ధాటికి జమైకా అతలాకుతలం
పలువురి దుర్మరణం !
దేశంలో 174 ఏళ్ల తుపాన్ల రికార్డులను తిరగరాసిన మెలిసా
కింగ్‌స్టన్: అట్లాంటిక్ మహాసముద్రంలో పుట్టి చరిత్రలో అత్యంత శక్తివంతమైన తుపాన్‌లలో ఒకటిగా రూపుదాలి్చన ‘మెలిసా’ తుపాను మంగళవారం జమైకా దేశాన్ని వెన్నులో వణకుపుట్టే స్థాయిలో భీకరంగా తాకింది. జమైకాలో నైరుతి దిశలో ఉన్న ‘న్యూ హోప్’ ప్రాంతం వద్ద తుపాను తీరాన్ని తాకి పెను విధ్వంసం సృష్టించింది. గంటకు 295 కిలోమీటర్ల వేగంతో వీచిన పెను గాలుల ధాటికి కరీబియన్ ద్వీపదేశం జమైకాలో వేలాదిగా చెట్లు నేలకూలాయి. కొండచరియలు విరిగిపడ్డాయి. విద్యుత్ స్తంభాలు కూలిపోయి దేశంలో సగం జనావాసాలకు విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. దీంతో అంతటా అంధకారం అలుముకుంది. రాజధాని నగరం కింగ్‌స్టన్‌లో వీధులన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి.
జమైకాలో తుపాన్‌లను నమోదుచేసే విధానం మొదలైన ఈ 174 ఏళ్లలో ఇంతటి భీకర తుపాను రావడం ఇదే తొలిసారి. కేటగిరీ–5 తుపాన్ అయిన మెలిసా ధాటికి మంగళవారం జమైకాలో పలువురు ప్రాణాలు కోల్పోయినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. కనీవినీ ఎరుగని శక్తివంతమైన తుపాను దెబ్బకు దేశం చరిత్రలో ఎప్పడూ లేనంతటి ఆస్తి నష్టాన్ని చవిచూడబోతోందని ప్రధాని ఆండ్రూ హోల్నెస్ ఆవేదన వ్యక్తంచేశారు. ‘‘తుపాను ఇప్పుడే తీరాన్ని తాకింది. వెంటనే దీని పూర్తి నష్ట తీవ్రతను అంచనావేయలేం’’ అని ఆయన అన్నారు. తీరం వెంబడి అలలు 13 అడుగుల ఎత్తులో ఎగసిపడుతున్నాయి. మరోవైపు సహాయక చర్యలను ముమ్మరంచేశారు. తాత్కాలిక శిబిరాలను ఏర్పాటుచేసి లోతట్టు ప్రాంతాల ప్రజలను అక్కడికి తరలించారు. తుపాను కారణంగా హైతీ దేశంలో ముగ్గురు, డొమినికన్ రిపబ్లిక్ దేశంలో ఒకరు మరణించారు.
ఐక్యరాజ్యసమితి విభాగాలు, పలు స్వచ్ఛంద సంస్థలు ఆహారం, ఔషధాలు, నిత్యవసరాలను జమైకాకు తరలిస్తున్నాయి. సురక్షితమైన తాగునీటిని నిల్వ చేసుకోవాలని, ప్రతి చుక్కా జాగ్రత్తగా వాడుకోవాలని మంత్రి మాథ్యూ సమూడా ప్రజలకు సూచించారు. ఇప్పటికే జమైకాలో అన్ని రకాల ప్రభుత్వ, ప్రైవేట్ కార్యకలాపాలను నిలిపేశారు. ఎయిర్‌పోర్ట్‌లు, ప్రజారవాణా స్తంభించిపోయింది. కింగ్‌స్టన్, సెయింట్ ఎలిజబెత్, క్లారెండన్ నగరాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తుపాను ప్రభావం క్యూబా, హైతీ, డొమినికన్ రిపబ్లికన్, బహమాస్‌పైనా ప్రభావం చూపింది.
క్యూబాలో ఇప్పటికే 6 లక్షల మందికిపైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరోవైపు తుపాన్‌కు సంబంధించి కృత్రిమ మేధ(ఏఐ)తో సృష్టించిన నకిలీ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాను ముంచెత్తుతున్నాయి. అవి చూసిన తుపాను ప్రభావిత ప్రాంతాల ప్రజల్లో భయాందోళనలు పెరిగాయి. సోషల్ మీడియాలో సాగుతున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని అధికారులు స్పష్టంచేశారు. జమైకాలో ప్రస్తుతం 25,000 మంది విదేశీ పర్యాటకులు ఉన్నారని, వారి రక్షణ కోసం చర్యలు చేపట్టామని ప్రభుత్వం వెల్లడించింది. తూర్పు క్యూబా, బహమాస్‌ల వైపు వెళ్లాక తుపాను కొనసాగే అవకాశముందని అమెరికా హరికేన్ విభాగం పేర్కొంది.


