100 గంటల్లో 10 లక్షలు | COVID-19: 10 Lakh new cases in just 100 hours worldwide | Sakshi
Sakshi News home page

100 గంటల్లో 10 లక్షలు

Jul 19 2020 2:49 AM | Updated on Jul 19 2020 9:32 AM

COVID-19: 10 Lakh new cases in just 100 hours worldwide - Sakshi

వాషింగ్టన్‌: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ మహోగ్రరూపం దాలుస్తోంది. గుండెల్లో దడ పుట్టేలా కేసుల సంఖ్య పెరిగిపోతున్నాయి. గత 100 గంటల్లో 10 లక్షల కేసులు నమోదయ్యాయి. జూలై 13 నాటికి 1.3 కోట్లు ఉన్న సంఖ్య 4 రోజుల్లో 1.4 కోట్లకు పెరిగింది. ఇక కేసుల సంఖ్యలో అగ్రరాజ్యం అమెరికాయే మొదటి స్థానంలో కొనసాగుతోంది.

ఆ దేశంలో ఒకే రోజు 77 వేల కేసులు నమోదు కావడం ఆందోళన పుట్టిస్తోంది. స్వీడన్‌ మొత్తం కేసులతో ఇది సమానం కావడం గమనార్హం. ప్రపంచ వ్యాప్తంగా నమోదైన కేసులు, మృతుల్లో సగం ఉభయ అమెరికా ఖండాల్లోనే వెలుగులోకి వచ్చాయి. బ్రెజిల్‌ అధ్యక్షుడు బోల్సనోరా సహా 20 లక్షల మందికి పైగా కరోనా పాజిటివ్‌ వస్తే, ఆ దేశంలో 76 వేలకి మంది పైగా మరణించారు.

కనీస జాగ్రత్తలు తీసుకోని అమెరికన్లు
యథా రాజా తథా ప్రజా అన్నట్టుగా ఉంది అమెరికా ధోరణి. దేశ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్, ఆయన అనుచరగణం మాస్కులు పెట్టుకోవడం, భౌతిక దూరం పాటించడం వంటి వాటికి ఏమాత్రం ప్రాధాన్యం ఇవ్వడం లేదు. కరోనా కట్టడి నిబంధనలు కఠినంగా అమలు చేయడం లేదు. దీంతో ప్రజలందరూ మాస్కు ధరించడంలో అలసత్వం ప్రదర్శిస్తున్నారు. కనీస జాగ్రత్తలు తీసుకోకుండా రోడ్లపై తెగ తిరుగుతున్నారు. కేసులు రికార్డు స్థాయిలో పెరిగిపోతున్నప్పటికీ దేశాన్ని ఆర్థికంగా గాడిలో పెట్టాలన్న ఉద్దేశంతో మార్కెట్లను ప్రారంభిస్తున్న ట్రంప్‌ ఇప్పుడు పాఠశాలలు తెరవడానికి కూడా సిద్ధమయ్యారు.

ఊపిరి పీల్చుకుంటున్న యూరప్‌
కరోనా వైరస్‌ బయటపడిన తొలినాళ్లలో ఇటలీ, స్పెయిన్‌ వంటి యూరప్‌ దేశాలు అల్లాడిపోయాయి. ఇప్పుడు ఐరోపా దేశాల్లో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. బార్సిలోనా వంటి నగరాల్లో అక్కడక్కడ కేసులు కనిపిస్తూ ఉండడంతో ఆ ప్రాంతాల్లో మళ్లీ లాక్‌డౌన్‌ ఆంక్షలు విధిస్తున్నారు.

ఇరాన్‌లో మూడు కోట్ల మందికి కరోనా?
ఇరాన్‌లో 2.5 కోట్ల మందికి కరోనా ఇన్‌ఫెక్షన్‌ సోకి ఉంటుందని, ప్రజలంతా ఈ మహమ్మారిని తీవ్రంగా పరిగణించాలని ఇరాన్‌ అ«ధ్యక్షుడు హస్సన్‌ రొహానీ అన్నట్లు, ఇరాన్‌ అధికార ఐఆర్‌ఎన్‌ఏ న్యూస్‌ ఏజెన్సీ వెల్లడించింది. రానున్న కొద్ది నెలల్లో మూడు నుంచి మూడున్నర కోట్ల మందికి ఈ వైరస్‌ సోకనుందన్నారు. దేని ఆధారంగా ఈ అంచనాకి వచ్చారో ఇరాన్‌ అధికారులు వివరించలేదు.

మధ్య ప్రాచ్యంలో ఇప్పటి వరకు ఇరాన్‌ తీవ్రంగా ప్రభావితమైందని, 2,70,000 పాజిటివ్‌ కేసులున్నాయని, ఇప్పటి వరకు కనీసం 14,000 మంది చనిపోయారని ఆ రిపోర్టు వెల్లడించింది. కరోనా కట్టడి కోసం దేశ రాజధాని టెహ్రాన్‌లో శనివారం నుంచి కఠిన ఆంక్షలు విధించబోతున్నారు. మరణాల సంఖ్య అధికారికంగా ప్రకటించిన సంఖ్య కంటే రెట్టింపు వుండవచ్చునని, వైరస్‌ బారిన పడిన వారి సంఖ్య పదిరెట్లు ఎక్కువగా ఉండవచ్చునని ఏప్రిల్‌లో విడుదల చేసిన పార్లమెంటరీ రిపోర్టు తెలపడం గమనార్హం.

మాస్క్‌ పెట్టుకోండని చెప్పను
కరోనాని కట్టడి చేయడానికి ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని తాను ఆదేశాలు జారీ చేయనని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ అన్నారు. మాస్కుల అంశంలో అమెరికన్లకి స్వేచ్ఛ ఉండాలని స్పష్టం చేశారు.  ప్రజలంతా మాస్కులు ధరిస్తే, వైరస్‌ అంతా మాయం అయిపోతుందన్న వాదనలతో తాను ఏకీభవించనని అన్నారు. మాస్కులు ధరించడం వల్ల ఎన్నో సమస్యలు వస్తున్నాయని చెప్పారు.


సాధారణ జ్వరాల కంటే మూడు రెట్లు ఎక్కువ
ప్రతీ ఏడాది వివిధ దేశాలను ఫ్లూ వంటి సీజనల్‌ ఫీవర్లు వణికిస్తూ ఉంటాయి. అలా సాధారణంగా ఏడాదికి నమోదైన కేసుల కంటే మూడు రెట్లు ఎక్కువగా కరోనా కేసులు నమోదయ్యాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) వెల్లడించింది. ఈ మహమ్మారి ఏడు నెలల కాలంలోనే దాదాపుగా 6 లక్షల మందిని పొట్టన పెట్టుకుంది. ప్రతి ఏటా విష జ్వరాలతో మరణిస్తున్న వారి సంఖ్యతో ఇది సమానం. చైనాలో వూహాన్‌లో తొలిసారిగా జనవరి 10న కరోనా మరణం నమోదైంది. అక్కడ్నుంచి వైరస్‌ యూరప్‌ దేశాలకు పాకి, ఆ తర్వాత అమెరికాకి విస్తరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement