‘చైనీస్‌’ వైరస్‌ వార్తలపై ఘాటుగా స్పందించిన రోంగ్‌

Coronavirus : Ji Rong Says China Neither Created Nor Intentionally Transmitted - Sakshi

న్యూఢిల్లీ : చైనాలోని వుహాన్‌ కేంద్ర బిందువుగా పుట్టుకొచ్చిన కరోనా వైరస్‌ (కోవిడ్‌-19) ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 4.5 లక్షల కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, అందులో 21 వేలకు పైగా మృతిచెందారు. అయితే ఈ కరోనా వైరస్‌ అనేది చైనా సృష్టించిన జీవాయుధం అనే అనుమానాలు కూడా ఉన్నాయి. ఇందుకు సంబంధించి కొన్ని మీడియా సంస్థలు కథనాలు కూడా ప్రచురించాయి. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కరోనాను ‘చైనీస్‌ వైరస్‌’ అని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. 

ఈ విమర్శలపై భారత్‌లోని చైనా ఎంబసీ అధికార ప్రతినిధి జీ రోంగ్‌ స్పందించారు. కరోనా వైరస్‌ను చైనా సృష్టించలేదని, ఉద్దేశపూర్వకంగా ప్రపంచవ్యాప్తంగా విస్తరించేలా చేయలేదని అన్నారు. కరోనాను చైనీస్‌ వైరస్‌, వుహాన్‌ వైరస్‌ అని పిలవడ్డాన్ని ఆయన తప్పుబట్టారు. అంతర్జాతీయ సమాజం చైనా ప్రజలను నిందించడం మానుకోని.. కరోనా వైరస్‌ను ఎలా ఎదుర్కొవాలనేదానిపై దృష్టి పెట్టాలని సూచించారు. కరోనాపై పోరాటంలో చైనా, భారత్‌లు సమాచార మార్పిడితో ముందుకు వెళ్తున్నట్టు చెప్పారు. క్లిష్ట సమయాల్లో కరోనా మహమ్మారిని ఎదుర్కొవడానికి సహకారం అందించుకుంటున్నాయని తెలిపారు. చైనాకు భారత్‌ వైద్య సామాగ్రిని అందించి కరోనా పోరాటానికి మద్దతుగా నిలిచిందని వెల్లడించారు. అందుకు భారత్‌కు ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు. 

చైనాను ఉద్దేశించి ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన కొందరు అధికారులు చేసిన వ్యాఖ్యలను సరిదిద్దుకోవాలని రోంగ్‌ కోరారు. కరోనా నివారణకు చైనా చేస్తున్న ప్రయత్నాలు కించపరచాలని చూస్తున్నవారు.. గతంలో మానవజాతి ఆరోగ్యం కోసం చైనా ప్రజలు చేసిన త్యాగాలను విస్మరించారని అన్నారు.

చదవండి : ఢిల్లీలో ఆ డాక్టర్‌ కుటుంబానికి కరోనా 

చైనాలో కరోనా వ్యాక్సిన్‌ ట్రయల్స్‌ !

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top