
సాక్షి, న్యూఢిల్లీ : డోక్లాం ప్రతిష్టంభన భారత్ చైనాల మధ్య సంబంధాలకు విఘాతం కలిగించిన సంగతి తెలిసిందే. అయితే, ప్రధాని మోదీ, చైనా అధ్యక్షడు జిన్‌పింగ్‌ల మధ్య కొద్ది నెలల క్రితం జరిగిన చర్చలు ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల పునరుద్ధరణకు దోహదం చేశాయి. కాగా, తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అయింది. భారత్, చైనా సంబంధాలు మెరుగయ్యాయనే విషయానికి అద్దం పడుతున్నట్టుగా ఆ వీడియో ఉంది. చైనా సోల్జర్ ఒకరు భారత ఆర్మీ ఆఫీసర్‌కు తై చీ నేర్పిస్తున్న వీడియో అది.
కాగా, తై చీ చైనా ప్రాచీన యుద్ధకళ పద్ధతి. ఇది యుద్ధకళ మాత్రమే కాదు. శరీర నియంత్రణకు తోడ్పడే వ్యాయామాల్లో ఒకటి. దీంతో శరీరంపై చక్కని నియంత్రణ వస్తుంది. తై చీ పద్ధతిలో శరీర బరువును నెమ్మదిగా ఒక కాలి మీది నుంచి మరో కాలి మీద పడేలా లయబద్ధంగా కదులుతూ ఉంటారు. ఇది శరీర నియంత్రణకు తోడ్పడుతుందనీ, ఫలితంగా కింద పడిపోయే ముప్పు తగ్గుముఖం పడుతుందని పరిశోధకులు చెబుతున్నారు.
గతేడాది డోక్లాం ప్రాంతంలో భారత్, చైనా రక్షణ బలగాల మధ్య ప్రతిష్టంభన నెలకొన్న సంగతి తెలిసిందే. డోక్లాం తమదేనని అటు చైనా, ఇటు భూటాన్ వాదించాయి. భూటాన్ వాదనకు భారత్ మద్దతివ్వడంతో పరిస్థితి మరోలా మారింది. దాంతో భారత్, చైనాల మధ్య సంబంధాలకు విఘాతం కలిగింది.