అమెరికా-చైనా ట్రేడ్‌వార్‌ ముగియనుందా !

China Agreed With US To Remove Tariffs As Trade Deal Progresses - Sakshi

బీజింగ్‌ : అమెరికా-చైనా మధ్య జరుగుతున్న వాణిజ్య యుద్దానికి తెరపడే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు ఇరు దేశాల మధ్య జరిగిన చర్చల సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.  'గత రెండు వారాలుగా ఇరు దేశాలకు చెందిన అధికారులు మద్యవర్తిత్వ చర్చలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య విధించిన సుంకాలను దశల వారిగా ఎత్తివేసేందుకు అంగీకరించారు. ఈ మేరకు తుది ఒప్పందం దిశగా అడుగులు వేస్తున్నట్లు' చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ అధికారి గావో ఫెంగ్‌ తెలిపారు.

ఫేజ్‌-1లో భాగంగా ఇరు దేశాలు సమాన నిష్పత్తుల్లో విధించిన సుంకాలను ఒకేసారి ఎత్తేయాలని నిర్ణయించినట్లు ఆయన పేర్కొన్నారు. 'సుంకాలు విధించుకోవడం వల్ల మా దేశాల మధ్య వాణిజ్య యుద్దం మొదలైంది. ఇప్పుడు వాటిని రద్దు చేయడంతోనే ఈ యుద్దం ముగుస్తుందని' మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి రెండు దేశాల అధికారులు త్వరలోనే ఒప్పంద పత్రాలపై సంతకాలు చేయనున్నట్లు తెలిపారు.

ఇరు దేశాల మధ్య ఏడాదికి పైగా వాణిజ్య యుద్దం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ రెండేళ్లలో వందల బిలియన్‌ డాలర్ల విలువైన ఉత్పత్తులపై రెండు దేశాలు భారీ స్థాయిలో సుంకాలు విధించుకున్నాయి. ఈ నేపథ్యంలో రెండు దేశాల మధ్య ఒప్పందం వాణిజ్య యుద్దానికి తెరపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top