బ్రిటన్‌ ‘గోల్డెన్‌ వీసా’ రద్దు 

 Britain Golden Visas and Why Are They Being Suspended? - Sakshi

ధనికులు దుర్వినియోగం చేసే వీలుందని వివరణ

 2019లో కొత్త విధానం తెస్తామన్న బ్రిటన్‌ మంత్రి

లండన్‌: బ్రిటన్‌ ప్రభుత్వం గురువారం కీలక నిర్ణయం తీసుకుంది. తమ దేశంలో పెట్టుబడులు పెట్టే విదేశీ కోటీశ్వరులకు శాశ్వత నివాసం, పౌరసత్వం కోసం జారీచేస్తున్న గోల్డెన్‌ వీసా (టైర్‌ 1 ఇన్వెస్టర్‌ వీసా)ను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. గోల్డెన్‌ వీసా దుర్వినియోగం అయ్యే అవకాశమున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామనీ, శుక్రవారం (స్థానికకాలమానం) నుంచి ఇది అమల్లోకి వస్తుందని తెలిపింది. భారత్, రష్యా, చైనా సహా పలు దేశాలకు చెందిన విదేశీయులు ఈ గోల్డెన్‌ వీసా ద్వారా బ్రిటన్‌లో స్థిరపడుతున్నారు. ఈ గోల్డెన్‌ వీసాలో ప్రధానంగా మూడు కేటగిరీలు ఉన్నాయి. బ్రిటన్‌లో కనీసం రూ.18.09 కోట్లు(2 మిలియన్‌ పౌండ్లు) పెట్టుబడి పెట్టే విదేశీయులు తొలుత 40 నెలలు ఉండేందుకు అధికారులు అనుమతిస్తారు.

దీన్ని మరో రెండేళ్ల పాటు పొడిగించుకోవచ్చు. వీరికి ఐదేళ్ల అనంతరం బ్రిటన్‌లో శాశ్వత నివాస హోదా(ఐఎల్‌ఆర్‌)ను జారీచేస్తారు. ఈ పెట్టుబడిదారులు తమ భార్యతో పాటు 18 ఏళ్లలోపు ఉండే తమ పిల్లల్ని బ్రిటన్‌కు తీసుకురావచ్చు. అలాగే బ్రిటన్‌లో రూ.45.22 కోట్లు(5 మిలియన్‌ పౌండ్లు) పెట్టుబడి పెట్టేవారికి మూడేళ్లలో, రూ.90.44 కోట్లు(10 మిలియన్‌ పౌండ్లు) పెట్టుబడి పెడితే రెండేళ్లలో శాశ్వత నివాస హోదా లభిస్తోంది. అంతేకాదు. గోల్డెన్‌ వీసా కింద మొదటి కేటగిరి వ్యాపారవేత్తలు ఆరేళ్ల తర్వాత, మిగిలినవారు ఐదేళ్ల అనంతరం బ్రిటన్‌ పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.  

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top