కరోనా పోరులో ట్రంప్‌ విఫలం

Barack Obama Said About Trump Handling Of COVID-19 response - Sakshi

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కోవిడ్‌–19పై పోరాటంలో పూర్తిగా విఫలమయ్యారని ఆ దేశ మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ మహమ్మారిని ఎదుర్కోవడంలో ట్రంప్‌ వ్యవహరించిన తీరు విపత్తుని మరింత గందరగోళంగా మార్చిందని విమర్శించారు. వైట్‌హౌస్‌లో తనతో కలిసి పనిచేసిన సిబ్బందితో శుక్రవారం రాత్రి ఒబామా మాట్లాడారు.  దీనిని అమెరికా మీడియా ప్రముఖంగా ప్రసారం చేసింది.

సమర్థవంతమైన పాలకులు అధికారంలో ఉన్నప్పటికీ కరోనా వంటి ఆరోగ్య సంక్షోభాలను ఎదుర్కోవడం కత్తి మీద సామేనని, అలాంటిది నాకేంటి అన్న ధోరణిలో అధ్యక్షుడు ఉండడంతో అగ్రరాజ్యం కొంప మునిగిందని ఒబామా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కరోనాతో వచ్చే ముప్పేమీ లేదని ఫిబ్రవరిలో వాదించిన ట్రంప్, మార్చికల్లా అది ఎంతో ప్రమాదకరమైందని అన్నారని ఇలా ఊగిసలాట ధోరణిలోనే ఆయన కాలం గడిపేశారని విమర్శించారు.

కరోనాని ట్రంప్‌ ఎదుర్కొన్న తీరు ఈ విపత్తుని మరింత గందరగోళానికి గురి చేసి అందరిలోనూ తీవ్రమైన నిరాశ నిస్పృహలను నింపిందని ఒబామా విరుచుకుపడ్డారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఈ నవంబర్‌లో జరగనుండగా ట్రంప్‌పై డెమొక్రాట్‌ అయిన ఒబామా తీవ్రంగా విమర్శలు చేయడం చర్చకు దారితీసింది.  వైట్‌హౌస్‌ సభ్యులతో మాట్లాడుతూ ఒబామా పదే పదే డెమొక్రాట్‌ అభ్యర్థి జో బిడెన్‌కు మద్దతునివ్వాలని కోరారు.    

క్వారంటైన్‌లో వైట్‌హౌస్‌ సిబ్బంది
వైట్‌హౌస్‌లో కరోనాపై ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్‌ సిబ్బందిలో ముగ్గురు క్వారంటైన్‌లోకి వెళ్లారు. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎలర్జీ అండ్‌ ఇన్‌ఫెక్షన్‌ డిసీజెస్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ఆంటోని ఫాసీతో పాటు మరో ఇద్దరు ముందు జాగ్రత్తగా క్వారంటైన్‌లోకి వెళ్లారు.  

► కరోనాతో అమెరికాలో 24 గంటల్లో 1,568 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 80 వేలకి చేరువలో ఉంది. ళీ దక్షిణ కొరియా ఆంక్షలు సడలించడంతో నైట్‌ క్లబ్స్‌కి వెళ్లిన 50 మందికి కరోనా సోకింది.  దీంతో ప్రభుత్వం క్లబ్బులను మూసివేయాలని వెంటనే ఆదేశాలిచ్చింది.

► చైనాలో కొత్తగా 14 కేసులు నమోదయ్యాయి. వూహాన్‌లో కూడా ఒక కేసు నమోదు అయింది. చైనాలో ఏప్రిల్‌ 28 తర్వాత ఇన్ని కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి.  

► రష్యాలో కరోనా కేసుల సంఖ్య 2 లక్షలు దాటేసింది. గత 24 గంటల్లోనే 11 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి.    

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top