భారత్‌లో హిందువులకే మొదటి ప్రాధాన్యం: ఇమ్రాన్‌ ఖాన్‌

Article 370 Move Imran Khan Says Another Pulwama Will Happen - Sakshi

ఇస్లామాబాద్‌: ఆర్టికల్‌ 370 రద్దు, జమ్మూకశ్మీర్‌ పునర్వ్యవస్థీకరణ బిల్లు అంశాలపై దాయాది దేశం పాక్ మరోసారి విషం చిమ్మింది. ఆర్టికల్‌ 370 రద్దు ప్రభావం త్వరలోనే ఉంటుందని.. రానున్న రోజుల్లో మరో పుల్వామా దాడి జరగవచ్చని ఆ దేశ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ అన్నారు. మంగళవారం పాకిస్తాన్‌ పార్లమెంటు సంయుక్త సమావేశంలో ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రసంగిస్తూ.. మోదీ నిర్ణయం కశ్మీర్‌ ప్రజలను అణచి వేయలేదని పేర్కొన్నాడు. బీజేపీది జాత్యాంహకార భావజాలమని.. ముస్లింలను ఆ పార్టీ రెండో తరగతి ప్రజలుగానే పరిగణిస్తుందని వ్యాఖ్యానించాడు. మోదీ ప్రభుత్వం తీసుకున్న ఆర్టికల్‌ 370 రద్దు నిర్ణయం, మహ్మద్‌ అలీ జిన్నా రెండు దేశాల సిద్ధాంతాన్ని బలపరుస్తుందని ఇమ్రాన్‌ పేర్కొన్నాడు.

‘భారతదేశం కేవలం హిందువులకే అని ఆర్‌ఎస్‌ఎస్‌ అభిప్రాయం. అదెప్పుడూ ముస్లింలను రెండో తరగతి ప్రజలుగానే భావిస్తుంది. ఈ రోజు మొదటి సారి బీజేపీ భావజాలాన్ని ప్రపంచం కూడా చూసింది’ అన్నాడు ఇమ్రాన్‌. పాకిస్తాన్‌ ఏర్పాటును వ్యతిరేకించిన కొందరు కశ్మీర్‌ నాయకులు.. నేడు జిన్నా రెండు దేశాల సిద్ధాంతం నిజమయ్యిందని బాధపడుతున్నారని పేర్కొన్నాడు. భారతదేశం కేవలం హిందువులకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తుంది. కానీ పాకిస్తాన్‌ మాత్రం మానవులందరిని సమానంగా చూస్తుందని ఇమ్రాన్‌ తన ప్రసంగంలో పేర్కొన్నాడు. గతంలో జరిగిన పుల్వామా దాడికి, పాక్‌కు ఎలాంటి సంబంధం లేదని ఈ సందర్భంగా ఇమ్రాన్‌​ స్పష్టం చేశాడు. అయితే బీజేపీ తీసుకున్న నిర్ణయం వల్ల త్వరలోనే మరో పుల్వామా దాడి జరగనుందని ఇమ్రాన్‌ పేర్కొన్నాడు.  

జమ్మూ కశ్మీర్‌ పునర్వ్యవస్థీకరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదముద్ర వేసింది. మంగళవారం రాత్రి లోక్‌సభలో హోంమంత్రి అమిత్‌ షా ప్రవేశపెట్టిన జమ్మూ కశ్మీర్‌ పునర్వ్యవస్థీకరణ బిల్లు–2019కు అనుకూలంగా 370 మంది, వ్యతిరేకంగా 70 మంది ఓటు వేశారు. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 370, ఆర్టికల్‌ 35–ఏలను రద్దు చేసిన తీర్మానం కూడా లోక్‌సభ ఆమోదం పొందింది. ఈ తీర్మానానికి అనుకూలంగా 351 మంది, వ్యతిరేకంగా 72 మంది ఓటు వేశారు. ఒకరు గైర్హాజరయ్యారు. తృణమూల్‌ కాంగ్రెస్‌, జేడీ(యూ) సభ నుంచి వాకౌట్‌ చేశాయి.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top